ప్రేమించాడు.. పెద్దల్ని ఒప్పించమంటాడు!

చిన్ననాటి స్నేహితుణ్ని ప్రేమిస్తున్నా. ఉద్యోగరీత్యా రెండేళ్ల కిందట అతడు విదేశాలకు వెళ్లిపోయాడు. అప్పట్నుంచి ఫోన్‌లో ముక్తసరిగా మాటలే.

Published : 30 Jul 2016 01:29 IST

ప్రేమించాడు.. పెద్దల్ని ఒప్పించమంటాడు!

* చిన్ననాటి స్నేహితుణ్ని ప్రేమిస్తున్నా. ఉద్యోగరీత్యా రెండేళ్ల కిందట అతడు విదేశాలకు వెళ్లిపోయాడు. అప్పట్నుంచి ఫోన్‌లో ముక్తసరిగా మాటలే. కష్టాల్లో ఉండి కన్నీళ్లు పెట్టుకున్నా తను పెద్దగా భరోసా ఇవ్వడం లేదు. మా పెళ్లికి ఇరువైపులా పెద్దల్ని ఒప్పించే బాధ్యత నేనే తీసుకోవాలన్నాడు. నాలుగు నెలల కిందట తనే ఫోన్‌ చేసి పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోవడం లేదన్నాడు. రెణ్నెళ్లు మా మధ్య మాటలు లేవు. తర్వాత తనే మాట కలిపాడు. చూస్తుంటే అనుబంధాలు, విలువలు పట్టించుకోని డబ్బు మనిషిలా కనిపిస్తున్నాడు. కానీ అతడి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. తనని పెళ్లి చేసుకోవడం మంచిదేనా?

- వీవీ, ఈమెయిల్‌

* మీది జాలి కోరుకునే మనస్తత్వం. కష్టాల్లో ఉంటే ఎవరైనా ఓదార్పు కోరుకుంటారు. కానీ అది ఓ పరిధి వరకే ఉండాలి. అదేపనిగా ఇతరుల నుంచి ఆశించడం మానసిక బలహీనతగా మారుతుంది. ప్రేమించే వ్యక్తికి ఆనందాన్ని పంచాలి గానీ ప్రతిసారీ కష్టాలు ఏకరువు పెడితే ఎవరూ పెద్దగా స్పందించరు. అయినా మీకొచ్చిన కష్టాలేంటో వివరంగా రాయలేదు. తను అనుబంధాలు, విలువలు పాటించని వ్యక్తి అయితే మీ స్నేహం ప్రేమగా మారి ఉండేదికాదు.

ఆడపిల్ల బాధ్యత స్వీకరించే మగతోడు కోరుకోవడం సహజం. కానీ మీరు ప్రేమించిన వ్యక్తి విదేశాల్లో ఉన్న కారణంగా తల్లిదండ్రుల్ని ఒప్పించే బాధ్యత మీకు అప్పగించి ఉండొచ్చు. ఈలోపే తల్లిదండ్రులను అడిగి వాళ్లు అంగీకరించని విషయం మీకు చెప్పాడేమో! కొన్నాళ్లు మీ మధ్య మాటలు దూరమైనా మళ్లీ తనే ఫోన్‌ చేశాడంటే అతడికి మీపై కచ్చితంగా ప్రేమ ఉన్నట్టే కదా? అంతదూరంలో ఉన్నా ఖర్చుకు వెనకాడకుండా తరచూ మీతో సంభాషిస్తున్నాడంటే ఆ అబ్బాయి డబ్బు మనిషి అనుకోవడానికి వీలు లేదు.

మీ అనుబంధం దృఢమవడానికి స్కైప్‌లాంటి వీడియోకాల్స్‌ని ఉపయోగించుకోవచ్చు. గొంతు వినడం ద్వారా దొరికే ఆత్మీయత కంటే ముఖాముఖితో ఎక్కువ ఓదార్పు, సాంత్వన పొందొచ్చు. మీ సందేహాలు, అనుమానాలూ పటాపంచలవుతాయి. అలాగే ఇద్దరూ మీ పెద్దవాళ్లతో మాట్లాడి కచ్చితంగా మీ ప్రేమ విషయం చెప్పండి. ఒప్పుకుంటే సంతోషం. లేదంటే మీకు చట్టం అండ ఉండనే ఉంది. దానికన్నా ముందు మీ మధ్య సమన్వయం, అవగాహన అవసరం. వెంటనే ప్రయత్నాలు ప్రారంభించండి. బెస్టాఫ్‌ లక్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని