ముందు ఔనని.. ఇప్పుడు కాదంటే ఎలా?

నేనో కాలేజీలో లెక్చరర్‌ని. కొన్నేళ్లుగా క్లాస్‌మేట్‌ని ప్రేమిస్తున్నా. డిగ్రీ తర్వాత అతడు మూడేళ్లు సైన్యంలో పనిచేసి ఏవో కారణాలతో తిరిగొచ్చాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ సొంతంగా చిన్న స్వీట్‌షాప్‌ నడుపుతున్నాడు.

Published : 20 Aug 2016 01:34 IST

ముందు ఔనని.. ఇప్పుడు కాదంటే ఎలా?

* నేనో కాలేజీలో లెక్చరర్‌ని. కొన్నేళ్లుగా క్లాస్‌మేట్‌ని ప్రేమిస్తున్నా. డిగ్రీ తర్వాత అతడు మూడేళ్లు సైన్యంలో పనిచేసి ఏవో కారణాలతో తిరిగొచ్చాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ సొంతంగా చిన్న స్వీట్‌షాప్‌ నడుపుతున్నాడు. ఉద్యోగాల్లో స్థిరపడ్డాక పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా మతం కాకపోయినా అబ్బాయి మంచివాడని మా పెద్దలు మా ప్రేమను ఒప్పుకున్నారు. మా అమ్మ నన్ను చాలా కష్టపడి పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చింది. మరోవైపు వాళ్లింట్లో ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం బాగా లేవు. తన తల్లికి గుండెజబ్బు. అతడికి పెళ్లి చేస్తే వచ్చే కట్నంతో కొన్ని కష్టాలైనా తీర్చుకోవాలనుకుంటున్నారు. మేమిచ్చే కట్నంతో తను గట్టెక్కుతాడని నేనూ భావిస్తున్నా. కానీ ఈమధ్యే ఏదో విషయంలో అతడు మా అమ్మ, అన్నయ్యలతో చిన్న గొడవ పడ్డాడు. దీంతో మావాళ్లకి అతడిపై కోపం పెరిగి పెళ్లికి నిరాకరిస్తున్నారు. వాళ్లింట్లో వాళ్లని కూడా ఎలా ఒప్పించాలో తెలియడం లేదు. సలహా ఇవ్వండి.

- సిరి, ఈమెయిల్‌

* చాలాకాలం నుంచి వ్యాపారంలో ఉన్న వ్యక్తికి ఇతర సంపాదన మార్గాలు తెలిసే ఉంటాయి. అయినా కష్టాలు తీరడం లేదంటే రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి ఇంట్లో విపరీతమైన అనారోగ్య ఖర్చులు లేదా మీకు తెలియకుండా అతడికి ఏవైనా వ్యసనాలు ఉండటం. ఉద్యోగం, వ్యాపారం, ఆస్తిపాస్తులు లేనివాడ్ని తల్లిదండ్రులు పెళ్లికోసం తొందరపెట్టడం బాగా లేదు. మీపై ఒత్తిడి తేవడానికే వాళ్లు కట్నం ప్రస్తావన తీసుకొచ్చి ఉండొచ్చు. ఏ అమ్మాయి అయినా అబ్బాయి అందం, హోదా గురించే ఆలోచిస్తుంది. తల్లిదండ్రులు కాబోయే అల్లుడి ఆస్తిపాస్తులు, గుణగణాల గురించి కూడా ఆరా తీస్తారు. మీవాళ్లూ అలాగే ఆలోచిస్తున్నారేమో! పేదరికంలో పుట్టినా పీజీ వరకు చదువుకొని ఉద్యోగం చేయడం మీ ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. తనేమో డిగ్రీ వరకే చదివాడు. పైగా ఉద్యోగం లేదు. ఏరకంగా చూసినా మీరే ఓ మెట్టు పైనున్నారు. అయినా కట్నం ఆశించడం సమంజసంగా లేదు. ప్రయత్నిస్తే మీ చదువు, హోదాకు తగ్గ మంచి భర్త దొరుకుతాడు.

రెండో కోణంలో గమనిస్తే అతడి ప్రేమ నిస్వార్థమైందని మీకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉంటే ముందు అతడిని ఉద్యోగంలో స్థిరపడమని సలహా ఇవ్వండి. ఆపై మెల్లిగా పెద్దల్ని ఒప్పించే ప్రయత్నం చేయండి. అప్పుడు కూడా ఒప్పుకోకుంటే మీరిద్దరూ మైనారిటీ తీరినవాళ్లే కాబట్టి వాళ్లని ఎదిరించైనా పెళ్లి చేసుకోవచ్చు. ప్రస్తుతం మీకొచ్చే జీతంతో ఎలాగోలా సర్దుకుపోవచ్చు. అతడూ కొలువులో చేరితే కాస్త ఆలస్యంగానైనా సమస్యలు సర్దుకుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని