అన్నయ్యా అంటూనే ఆ చొరవేంటి?

బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగవేటలో ఉన్నా. చెల్లి స్నేహితురాలు తరచూ మా ఇంటికొస్తూ ఉంటుంది. తను మొదట్లో నన్ను అన్నయ్యా అని పిలిచేది....

Published : 17 Sep 2016 01:21 IST

అన్నయ్యా అంటూనే ఆ చొరవేంటి?

* బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగవేటలో ఉన్నా. చెల్లి స్నేహితురాలు తరచూ మా ఇంటికొస్తూ ఉంటుంది. తను మొదట్లో నన్ను అన్నయ్యా అని పిలిచేది. ఈమధ్య తన తీరు మారింది. నా పక్కన వచ్చి కూర్చోవడం, కావాలని తాకడం చేస్తోంది. నువ్వు, నీ స్టైల్‌ ఇష్టం అంటోంది. నాకు కూడా తన పట్ల అభిప్రాయం మారుతోంది. తనలాగే ప్రవర్తిస్తే సంతోషమేస్తోంది. కానీ అన్నయ్య అనే పిలుపే నచ్చడం లేదు. తనది ప్రేమా? ఆకర్షణా? లేక నేనే అతిగా వూహించుకుంటున్నానా? నేనేం చేయాలి?

- ఎస్‌.ఎస్‌.ఆర్‌., ఈమెయిల్‌

* ఇది మీ తప్పు కాదు. పరిచయస్తులు, స్నేహితులు, ఇరుగుపొరుగు ఏ చుట్టరికం లేకున్నా అన్నావదినా, బావాచెల్లీ... రకరకాల వరుసలతో పిలుచుకుంటూ ఆత్మీయంగా ఉంటారు. పెద్దవాళ్లను అత్తామామా అంటూనే వాళ్ల పిల్లల్ని అన్నా, అక్కా అని పిలవడం చూస్తుంటాం. అత్తయ్య కొడుకు బావ అవుతాడనీ, కూతురు మరదలు అవుతుందని పెద్దవాళ్లు చెప్పరు. అలాగే మీ చెల్లెలి స్నేహితురాలు మిమ్మల్ని అన్నయ్యా అని పిలవడం మన సమాజంలో రివాజే.

* తన ప్రవర్తనలో వచ్చిన మార్పులు, ఆమె పట్ల మీ అభిప్రాయం మారుతూ ఉండటం కూడా అసహజమేమీ కాదు. ఆమెను చెల్లెలి స్నేహితురాలిగా మాత్రమే చెబుతున్నారంటే మీ పరిచయం సుదీర్ఘమైంది కాదని అర్థమవుతోంది. డిగ్రీ చదువుతున్న అమ్మాయికి పరాయి మగాళ్లతో ఎలా మెలగాలో తెలుస్తుంది. తెలిసీ మీతో చనువు చూపిస్తుందంటే కారణం ఆకర్షణే. అదే కొంతకాలానికి ప్రేమగా మారొచ్చు. ఈ క్రమంలోనే ఆమె అన్నయ్యా అనే పిలుపునూ తగ్గిస్తుంది. మీరు, నువ్వు అనే పదాలను ఎక్కువగా వాడుతుంది. ఈ మార్పు వచ్చే వరకు ఓపిక పట్టండి. ఈలోగా ఉద్యోగం చూసుకొని జీవితంలో స్థిరపడే ప్రయత్నం చేయండి. తర్వాత పని ఒత్తిడితో మీరు కలుసుకోగలిగే సమయాలు తగ్గుతాయి. ఆ ఎడబాటులో మీ ఇద్దరిలో ఉన్న ప్రేమ, అనురాగం బయటపడుతాయి. ఇవేం లేకుండా ఒకర్నొకరు మర్చిపోగలిగారంటే అది కేవలం ఆకర్షణే అని తేలుతుంది.

* అంతకాలం ఆగకుండా ఇప్పటికిప్పుడు నాపై నీ అభిప్రాయం ఏంటి అని మీరు అడగొచ్చు. కానీ ఆమె నిన్ను అన్నయ్యా అని పిలుస్తున్నా కదా అంటే తట్టుకోలేరు. సున్నితమైన అంశాల్లో ఓపిక అవసరం. కొద్దికాలమైతే మీది ప్రేమో, ఆకర్షణో తెలిసిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని