రక్తం చిందించినా ప్రేమ చూపదేం?

నాకు పదిహేడేళ్లు. నేనో అమ్మాయిని ప్రేమించా. ‘నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? నిన్నెలా నమ్మను?’ అందోసారి. వెంటనే చేయి కోసుకొని రక్తం చిందించా.

Published : 29 Oct 2016 01:13 IST

రక్తం చిందించినా ప్రేమ చూపదేం?

నాకు పదిహేడేళ్లు. నేనో అమ్మాయిని ప్రేమించా. ‘నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? నిన్నెలా నమ్మను?’ అందోసారి. వెంటనే చేయి కోసుకొని రక్తం చిందించా. అయినా తను నన్ను ప్రేమిస్తున్నాననే మాట చెప్పలేదు. నీవంటే ఇష్టమే అంటుందిగానీ ఐలవ్యూ చెప్పదు. పోనీ కొన్నేళ్ల తర్వాతైనా పెళ్లి చేసుకుంటానని మాటివ్వు అన్నా ఒప్పుకోవడం లేదు. తను నాకు దక్కదేమో అనే ఆలోచనతో చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నా. చనిపోవాలనే ఆలోచనలొస్తున్నాయి. ఏం చేయను?

- రంజిత్‌, ఈమెయిల్‌

మస్య పరిష్కారం కోసం మానసిక నిపుణులను సంప్రదించాలనే నీ ఆలోచన బాగుంది. ప్రస్తుతం నీది ప్రేమంటే ఏంటో కూడా అర్థం చేసుకోలేని చిరుప్రాయం. కౌమారంలో హార్మోన్ల ప్రభావంతో మానసిక ఉద్వేగాలు తీవ్రంగా ఉంటాయి. మనసుకు నచ్చినదాని కోసం ఏం చేయడానికైనా శరీరం, మనసు సిద్ధంగా ఉంటాయి. ఈ వయసులో తీసుకున్న నిర్ణయాల ఫలితం మొత్తం జీవితం మీద ఉంటుంది. మానసిక, శారీరక పరిపక్వత లేని ఈ వయసులో ప్రేమ, పెళ్లికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం అంటే సాహసమే.

పది, ఇంటర్లో ఏర్పడే ఆకర్షణ ప్రమాదకరమైంది. ఆమెని ఇష్టపడటం, తెలియజేయడం తప్పు లేదు. ఆ అమ్మాయినే చూడాలనిపించడం.. తనతో మాట్లాడితే ఆనందంగా ఉండటం.. లేకపోతే వెలితి సహజమే. కానీ ఇది మంచి లక్షణం కాదు. మరో ముఖ్య విషయం ఏంటంటే తనని నిజంగా ఇష్టపడితే ఆమె అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. ఆమె అభిరుచులకు అనుగుణంగా నిన్ను నీవు మలచుకొని తన మనసులో స్థానం సంపాదించాలి. చదువు మీద శ్రద్ధ లేకుండా ప్రేమ పాఠాలే వల్లించే ఓ అబ్బాయిని ఏ తెలివైన అమ్మాయీ ఇష్టపడదు. అందుకే నువ్వు ఆమె ఆశ్చర్యపోయేలా ఎదగాలి. నీ తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలి.

ఈ ప్రపంచంలో ఎవరైనా ముందు వారి మనసుకు సమాధానం చెప్పుకోవాలి. ఆ తర్వాత తమ తల్లిడండ్రులకు నచ్చేలా, మెచ్చుకునేలా ఉండాలి. అప్పుడు నిన్ను ఎవరైనా ఇష్టపడతారు. ఆఖరిగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మహత్య, ఆ తరహా ప్రయత్నాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. చనిపోయిన తర్వాత కూడా నిన్ను ఎవరూ మెచ్చుకోరు. జాలి పడరు. పైగా తిట్టుకుంటారు. ఈసారి ఎప్పుడైనా అలాంటి ఆలోచన వస్తే ఓపిగ్గా ఇదంతా ఆలోచించు. ఆ తర్వాత కూడా నీ మానసిక స్థితిలో మార్పు రాకపోతే దగ్గర్లోని మానసిక నిపుణుడిని సంప్రదించు. ప్రేమ, ఆకర్షణ కన్నా జీవితం ముఖ్యమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని