మనసంతా ప్రేమికుడే!

నేనొక ప్రభుత్వోద్యోగిని. ఒకబ్బాయిని ప్రాణంగా ప్రేమించా. తనూ అంతే. ఇద్దరం సరదాగా ఉండేవాళ్లం. ఎలాగూ...

Published : 19 Nov 2016 01:19 IST

మనసంతా ప్రేమికుడే!

* నేనొక ప్రభుత్వోద్యోగిని. ఒకబ్బాయిని ప్రాణంగా ప్రేమించా. తనూ అంతే. ఇద్దరం సరదాగా ఉండేవాళ్లం. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదాని హద్దులు దాటాం. మా పేరెంట్స్‌ ఒప్పుకోకపోవడంతో ఆ అబ్బాయిని కాదని మా బంధువునే పెళ్లాడాల్సి వచ్చింది. కానీ మా ఆయన దగ్గరికొస్తున్న ప్రతిసారీ నా లవరే గుర్తొస్తున్నాడు. అతడితో వెళ్లిపోవాలనిపిస్తోంది. తనూ రమ్మంటున్నాడు. వెళ్లాలని ఉన్నా కన్నవాళ్లు, కుటుంబ పరువు ఏమైపోతుందో అని భయమేస్తోంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నా. సలహా ఇవ్వండి.

- ఓ పాఠకురాలు

* ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించిన తర్వాత కూడా మీ పెద్దలను నొప్పించలేకపోయారంటే తల్లిదండ్రులు, కుటుంబ పరువు-ప్రతిష్ఠల గురించి ఆలోచిస్తున్నారని అర్థమవుతోంది. ప్రాణంగా ప్రేమిస్తే పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సింది. అది గతం. ఇప్పుడు బాధ్యతగల ప్రభుత్వోద్యోగిగా, ప్రేమించే తల్లిదండ్రులకు కూతురిగా, మంచి భార్యగా సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. మీ నుంచి సన్నిహితులు, బంధుమిత్రులు, సమాజం అదేస్థాయి ప్రవర్తన ఆశిస్తారు.

 

ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మీరు అకస్మాత్తుగా వివాహబంధాన్ని తెంపుకొని ఇంకొకరితో వెళ్లిపోవడం లేదా పెళ్లి చేసుకోవడం అంత తేలికేం కాదు. దీనికోసం చట్టబద్ధంగా విడాకులు తీసుకోవాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా పరువు పోవడమే కాక ఉద్యోగంలోనూ సమస్యలు ఎదురుకావొచ్చు. పెళ్లికాకముందు ప్రేమికులకు ఉన్న విలువ పెళ్లయ్యాక ప్రేమలకు ఉండదు. ఎందుకంటే రెండోరకం ప్రేమలో మనల్ని నమ్మిన ఒక వ్యక్తినీ, కుటుంబాన్నీ మోసం చేయడం, బాధ పెట్టడం ఉంటాయి. ప్రస్తుత వివాహబంధంలో మీకెలాంటి కష్టం, నష్టం లేదు. గతాన్ని మర్చిపోలేని బలహీనత మాత్రమే మిమ్మల్ని బాధిస్తోంది. నిజాయతీతో ప్రయత్నిస్తే ప్రియుడ్ని మర్చిపోవడం అంత కష్టమేమీ కాదు. కొద్దిరోజులు స్నేహితునితో మాట్లాడ్డం, సమాచార సంబంధాలు మానేయండి. మీ జీవిత భాగస్వామి మీద దృష్టి నిలపండి. క్రమంగా మీరు ఆయనను ప్రేమించడం ప్రారంభిస్తారు.

మనం ఎవరితో కలిసి ఎక్కువ సమయం గడుపుతామో, కలిసి పనిచేస్తామో, శారీరక సాన్నిహిత్యం ఉంటుందో వారితో మనకు ఎమోషనల్‌ అటాచ్‌మెంట్‌ సహజంగానే ఏర్పడుతుంది. దూరంగా ఉన్నవాళ్లతో ఎమోషనల్‌ అటాచ్‌మెంట్‌ తగ్గిపోతుంది. మీ స్నేహితునితో గతంలో సాన్నిహిత్యం ఉన్నా ఇప్పుడు అతడికి దూరంగా, మీ భర్తకు దగ్గరగా ఉన్నారు. ఇదిలా కొనసాగనివ్వండి. అతడితో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటే మీ భర్త సాన్నిహిత్యాన్ని ఆనందిస్తారు. అయోమయ, ఇబ్బందికరస్థితి నుంచి త్వరలోనే బయటపడతారు. నిజాయతీగా ప్రయత్నించినా గతాన్ని మర్చిపోలేకపోతుంటే ఒకసారి మీకు దగ్గర్లోని మానసిక నిపుణుడు లేదా వివాహబంధాల కౌన్సిలర్‌ని సంప్రదించండి. మీ మానసికస్థితిని విశ్లేషించి కౌన్సిలింగ్‌ ద్వారా మీ మనసు అదుపులోకి వచ్చేలా చేస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని