అన్నయ్యే అనుకున్నా.. ఎందుకీ బాధ?

బీటెక్‌ సెకండియర్‌లో ఒక అబ్బాయి పరిచయమయ్యాడు. నన్ను చెల్లిలా చూసుకునేవాడు. సంతోషం, దుఃఖం ప్రతీదీ తనతో పంచుకునేదాన్ని.

Published : 03 Dec 2016 02:01 IST

అన్నయ్యే అనుకున్నా.. ఎందుకీ బాధ?

బీటెక్‌ సెకండియర్‌లో ఒక అబ్బాయి పరిచయమయ్యాడు. నన్ను చెల్లిలా చూసుకునేవాడు. సంతోషం, దుఃఖం ప్రతీదీ తనతో పంచుకునేదాన్ని. ఇంజినీరింగ్‌ మొత్తం మేం మాట్లాడుకోని రోజు లేదు. ఇప్పుడు తను ఎం.ఎస్‌.చదవడానికి ఫారిన్‌ వెళ్లాడు. ఇదివరకటిలా మాట్లాడ్డం లేదు. ఎందుకని అడిగితే ‘నీతో మాట్లాడాలంటే చిరాకేస్తోంది. అసలు ఫోన్‌ చేయకు’ అంటున్నాడు. ఈ మార్పు తట్టుకోలేక చనిపోవాలనిపిస్తోంది. నాకు అతడిపై ప్రేమలాంటి ఫీలింగేం లేదు. కేవలం అన్నగానే భావించా. ఈ బాధ నుంచి బయటపడేదెలా?

ప్రశ్నలోని వివరాలనుబట్టి చూస్తే మీరు సున్నిత మనస్కురాలిగా, ఇంట్రావర్ట్‌లా కనిపిస్తున్నారు. అంతర్ముఖులు మనసులోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేరు. కొద్దిమందే స్నేహితులుంటారు. కాలేజీలో అతడొక్కడితోనే స్నేహం కొనసాగినట్టు తెలుస్తోంది. అందుకే తను దూరమవడం తట్టుకోలేకపోతున్నారు. తనవైపు నుంచి చూస్తే అతడి ప్రవర్తనలో తప్పేం కనిపించడం లేదు. విదేశాల్లో ఎం.ఎస్‌.చేయడం సులువేం కాదు. కొత్తగా అక్కడికి వెళ్లినవాళ్లు చాలా కష్టపడాలి. చదువుతోపాటు దుస్తులు ఉతుక్కోవడం, వంట, సొంత పనులు చక్కబెట్టుకోవడం... చాలా ఉంటాయి. సమయం సరిపోదు. వెనకబడిపోతున్నామనే టెన్షన్‌ ఉంటుంది. అలాంటపుడు ఇంజినీరింగ్‌లో మాట్లాడినట్టు గంటలకొద్దీ మాట్లాడటం కుదరదు.

మరోవైపు ఏ స్నేహమైనా పరస్పర ఆధారితంగా ఉండాలి. ఒకరు ఆధారపడేవాళ్లు, ఇంకొకరు భరించేవాళ్లైతే కష్టం. ఇక్కడెలా ఉన్నా అక్కడికెళ్లాక ఈ ఇంటర్‌-డిపెండెన్సీ కుదరదు. ఎవరి సమస్యలు వారు పరిష్కరించుకోవాల్సిందే. ఈ సంగతి తనకర్థమైంది. దూరంగా ఉన్న అతడి సలహా, ప్రేమ, సానుభూతి మీద మీరు ఇంకా ఆధారడటం మంచిదికాదు. ఆ మాట నేరుగా చెప్పలేక పని ఒత్తిడిలో ఉండి మీమీద చిరాకు పడుతూ ఉండొచ్చు. దాంట్లో మోసంగానీ, దురుద్దేశం ఉండక పోవచ్చు.

మీది ఆత్మహత్య గురించి ఆలోచించాల్సినంత పెద్ద సమస్య కాదు. ప్రస్తుతం మీరు కెరీర్‌, జీవితంలో స్థిరపడాలి. నచ్చిన వ్యక్తిని పెళ్లాడాలి. ఈరోజుల్లో ఏకాకిగా ఉండటం అంత మంచిది కాదు. మన భావాలను స్పష్టంగా చెప్పగలగాలి. నలుగురిలో మెలగాలి. అలా ఉంటేనే వృత్తి, జీవితంలో రాణిస్తాం. ప్రస్తుతం తక్షణం చేయాల్సిన అంశాలు, లక్ష్యాల మీద దృష్టి పెట్టండి. ఆ శక్తి మీలో ఉంది. ఇలా లేఖ రాసి మానసిక నిపుణుల సాయంతో సమస్య పరిష్కరించుకోవాలనుకోవడం సొంత నిర్ణయమే కదా! ఇతరుల స్నేహం, ఆమోదం గురించి ఆలోచించకుండా లక్ష్యాల మీద దృష్టిపెట్టి పని చేస్తుంటే, కెరీర్‌ కొనసాగిస్తుంటే కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీ ఉన్నతిని మెచ్చుకుంటూ బహుశా నీ పాత స్నేహితుడు కూడా అభినందిస్తూ ఫోన్‌ చేయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని