బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నా

కోటి కలలతో అత్తవారింట్లో అడుగుపెట్టా. నా కలలన్నీ కల్లలేననీ కొద్దిరోజుల్లోనే తేలింది. మా ఆయన చాలా బద్ధకస్తుడు. తినడం, పడుకోవడం, సినిమాలు

Published : 17 Dec 2016 01:30 IST

బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నా

కోటి కలలతో అత్తవారింట్లో అడుగుపెట్టా. నా కలలన్నీ కల్లలేననీ కొద్దిరోజుల్లోనే తేలింది. మా ఆయన చాలా బద్ధకస్తుడు. తినడం, పడుకోవడం, సినిమాలు చూడటమే పని. ఎంత బతిమాలినా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం లేదు. ఈ ప్రవర్తన భరించలేకున్నా. ఈ బద్ధకం వదిలేదెలా?
ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఉందో చెప్పలేదు. సాధారణంగా బద్ధకం అనే మానసికస్థితి పైకి కనిపించినంత తేలికైంది కాదు. పనిపై ఆసక్తి చూపించకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఆత్మవిశ్వాసం లోపించడం, నిరాశ, నిస్పృహ, శారీరక నీరసం, వూహించని సంఘటనలతో కలిగే షాక్‌... ఇలాంటివెన్నో. మొదట్లోనే వీటిని గమనించి సరిచేస్తే ఈ పరిస్థితి తలెత్తదు.

కొంతకాలం పనిచేయకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించే వారిలో నిరాసక్తత పెరిగి, బద్ధకమై పని ఎగ్గొట్టడం ఒక వ్యసనంగా మారుతుంది. మీ లేఖలో కూడా ఆయన పని చేయకపోవడం వల్ల మీకు ఎదురువుతున్న మానసిక సమస్యలనే ప్రస్తావించారు. ఆర్థిక సమస్యలు లేకపోవడంతో కూడా ఆయన పని మానేసి, బద్ధకానికి అలవాటుపడి ఉండొచ్చు. సమస్య పరిష్కారం కోసం ఆలోచించే ముందు మీరు ప్రతికూల మానసిక అభిప్రాయం నుంచి బయటపడాలి. బురద గుంటలో ఉన్నవారిని బయటకి లాగాలంటే ముందు మనం ఒడ్డున స్థిరంగా నిలబడాలి కదా. ఆయన ఉద్యోగం చేయక పోవడం మీకు నష్టం, అవమానం అన్నట్లు మాట్లాడటం మానేయండి. మీకు మీ భర్త ప్రతిభపై నమ్మకం ఉందనీ, మంచి భవిష్యత్తు కోసం ఆ టాలెంట్‌ని ఉపాధిగా మార్చుకొని సంపాదన పెంచుకోవాలని వివరించండి. ఖాళీగా ఉంటే కుటుంబం, స్నేహితులు, బంధువుల్లో విలువ తగ్గుతుందనీ అలా అవమానం పొందడం చూడలేకపోతున్నానని అనునయంగా చెప్పండి. తనంతట తాను ఒక లక్ష్యం ఏర్పరచుకొని దానికోసం ప్రయత్నించేలా ప్రేమతో మోటివేట్‌ చేయండి.

ఆత్మవిశ్వాసలేమితో బాధపడే చాలామంది పైకి బింకంగా, గంభీరంగా కబుర్లు చెబుతారు. తప్పొప్పులకు బాధ్యత వహించాల్సి వస్తే ఏదో వంకతో పని తప్పించుకుంటారు. అలాగే బద్ధకం అనేది కేవలం పనుల విషయంలోనే ఉందా? వ్యక్తిగత పరిశుభ్రత, నిద్ర, ఆహారం తీసుకోవడం... ఇలాంటి విషయాల్లో కూడా ఉందా? గమనించండి. ఇలా చేయడం మానసిక చికిత్సలో కీలకం. మానసిక వైద్యుల దగ్గర కౌన్సిలింగ్‌ తీసుకున్నా మానసిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడాలంటే ఇంట్లో వాళ్ల సహకారం చాలా అవసరం. ముందు మీ ఆయనకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల మీద అవగాహన పెంచండి. ఆయన మనస్తత్వానికి తగిన ఉద్యోగం సూచించడానికి, తగిన మానసిక శిక్షణ ఇవ్వడానికి కెరీర్‌ కౌన్సిలర్‌ని కూడా సంప్రదించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని