అందమైన ప్రతీకారం

సియాన్‌ ర్యాన్‌, మిల్లర్‌ రెండేళ్ల కిందట అపరిచితులు.

Published : 05 Feb 2017 01:35 IST

అందమైన ప్రతీకారం

సియాన్‌ ర్యాన్‌, మిల్లర్‌ రెండేళ్ల కిందట అపరిచితులు. ఒక పార్టీలో పరిచయమయ్యారు. నెల తిరక్కముందే నువ్వులేక నేను లేనన్నాడు. సియాన్‌ ముందు సిగ్గుపడింది. ఆపై భయపడింది. ఎందుకంటే తను కొంచెం లావు. ‘కొంచెం బొద్దుగా ఉన్నా అందంలో మోనాలిసాకి నువ్వేం తక్కువ?’ అన్నాడు. పడిపోయింది. ఆపై సరదాలు.. షికార్లు.. విదేశాలు తిరగడం.. ఆఖరికి సహజీవనం కూడా చేశారు.

సీన్‌ కట్‌ చేస్తే...
ఏడాదిన్నర అయ్యాక ‘మన ప్రేమకి బ్రేకప్‌’ అన్నాడు మిల్లర్‌. ‘ఏనుగులా ఉన్నావ్‌. నీ పక్కన నడుస్తుంటే నన్నంతా వింతగా చూస్తున్నార’ని 

వేళాకోళమాడాడు. సియాన్‌ గుండె పగిలింది. వెక్కివెక్కి ఏడ్చింది. అలా ఏడుస్తూనే ‘ప్రేమలో మోసపోయిన అమ్మాయిలు అబ్బాయిలపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే మరింత అందంగా తయారు కావడమే’ ఓ రియాలిటీ స్టార్‌ చెప్పిన మాటలు విన్నది. అంతే. అదేరోజు జిమ్‌లో చేరింది. బెడ్రూమ్‌లో.. బాత్రూమ్‌లో.. విమానంలో.. షాపింగ్‌లో.. ఎక్కడున్నా వ్యాయామాలే. ఆర్నెళ్లలో ఏకంగా 45 కేజీలు తగ్గి మెరుపుతీగలా తయారైంది. కుర్రాళ్ల మతులు పోయేలా ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల్లో ఫొటోలు పెట్టేసింది. గతంలో ఎలా ఉన్నానో కూడా చెప్పింది. కొన్నాళ్లకే అనుసరించేవారి సంఖ్య లక్షకు దగ్గరైంది. మాకూ టిప్స్‌ చెప్పమంటూ అమ్మాయిలు వెంటపడ్డారు. ఆపై శిక్షకురాలిగా మారింది.

ఆమె అందం చూసి ఎందరో ప్రపోజ్‌ చేశారు. కొందరు వ్యాపారవేత్తలు కూడా. ఈ విషయం మాజీ ప్రేమికుడి చెవిన పడింది. ఫొటోలు చూసి నోరెళ్లబెట్టాడు. ఇంత అందమైన అమ్మాయినా నేను కాదనుకుంది అని కుళ్లిపోయాడు. ‘ప్లీజ్‌ మనం మళ్లీ ప్రేమలో మునిగిపోదాం’ అని బతిమాలాడు. తను వినిపించుకోలేదు. హాలీవుడ్‌ తారలతో వ్యాయామాలు చేయిస్తూ బిజీగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని