ఆమెకి నేనంటే లవ్వా?

నేను డిగ్రీ ఫైనలియర్‌. స్నేహితులతో కలిసి ఉంటున్నా. ఆర్నెళ్ల కిందట ఓ కుటుంబం మా పక్కింట్లో దిగింది. వాళ్లకో బాబు. ఖాళీగా ఉంటే తనతో ఆడుకుంటుంటా. అందుకేనేమో ఆ బాబు .....

Published : 11 Feb 2017 01:27 IST

ఆమెకి నేనంటే లవ్వా?

* నేను డిగ్రీ ఫైనలియర్‌. స్నేహితులతో కలిసి ఉంటున్నా. ఆర్నెళ్ల కిందట ఓ కుటుంబం మా పక్కింట్లో దిగింది. వాళ్లకో బాబు. ఖాళీగా ఉంటే తనతో ఆడుకుంటుంటా. అందుకేనేమో ఆ బాబు తల్లి నాపై ప్రత్యేక అభిమానం చూపిస్తోంది. నాకే టీలు, టిఫిన్లు పెడుతోంది. నా రూమ్మేట్స్‌ ‘ఆంటీకి నువ్వంటే లవ్‌రా’ అని ఆటపట్టిస్తున్నారు. రాన్రాను నాకూ నిజమేననిపిస్తోంది. నేనూ తనతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తున్నా. కావాలనే తాకుతున్నా. తనేం అభ్యంతరం చెప్పడం లేదు. మనసంతా గందరగోళంగా ఉంది. నిజంగా ఆమెకి నేనంటే ప్రేమా?

- ఎస్‌.ఎస్‌., హైదరాబాద్‌

నీ సమస్యకు కారణం ప్రేమ వ్యసనం. ఈరోజుల్లో యువతకి ప్రేమ ఒక వ్యసనంలా తయారవుతోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కౌమారం నుంచి పాతికేళ్లలోపు వయస్కులు ఈ ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఎక్కువ. మెదడులోని సెరిబ్రల్‌ కార్టెక్స్‌ వ్యర్థ ఆలోచనలను పెంచే న్యూరాన్లను అదుపు చేయడంలో వైఫల్యం చెందడంతో కుర్రకారుకి కొత్త రుచులు ఆస్వాదించాలనే కోరిక ఎక్కువై ఇలా తయారవుతారు.

ఒక మహిళ నవ్వుతూ మాట్లాడినా, కాఫీటీలు ఇచ్చినా ప్రేమే అనుకోవడం ఈ వ్యసనం ప్రభావమే. ఆమెతో ఎక్కువసేపు మాట్లాడాలనుకోవడం, తాకాలని ప్రయత్నించడం దాని లక్షణాలే. వాస్తవానికి పెళ్లై తనకంటూ ఓ కుటుంబం ఉన్న మహిళ నీలాంటి స్థిరపడని కుర్రాడిని ప్రేమించాల్సిన అవసరం లేదు. నువ్వు తాకితే అభ్యంతరం చెప్పకపోవడానికి కారణం ఆ పరిస్థితిని ఆమె నీ దృష్టికోణంలో చూడకపోవడమే. మంచి గృహిణిగా ఉన్న ఆమెను డిస్ట్రబ్‌ చేయాలని ప్రయత్నిస్తూ నువ్వూ అలాంటి ఆలోచనలు చేయడం తప్పు.

దీర్ఘకాలిక లక్ష్యాలున్న వారికి కోరికలపై అదుపు ఉంటుంది. మితిమీరిన శృంగార వాంఛలు మాదక ద్రవ్యాలకంటే ప్రమాదకరమైనవి. ఒక వ్యక్తి ప్రేమలో పడ్డపుడు న్యూరోట్రాన్స్‌మీటర్స్‌ అతడిపై ఒత్తిడి పెంచుతాయి. ఫలితంగా వూహాతీతంగా, రహస్యంగా శృంగారపరమైన ఆకర్షణలకు లోనవుతారు. ఇది ప్రారంభంలో సంతోషం కలిగించినా క్రమేపీ ఒత్తిడి పెంచుతుంది. ఎదుటివారిని కోరికతో తాకినపుడు మనలోని ఆక్సిటోసిన్‌ రసాయనాలు ఎక్కువగా విడుదలవుతాయి. దాంతో ఆనందం కలుగుతుంది. విచక్షణ నశిస్తుంది. నువ్వు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నావు. నీ స్నేహితులు కూడా నిన్ను తప్పు దారి పట్టిస్తున్నారు. అసాధ్యమైన వాంఛలు పెంచుకోవడం, విఫలమైతే ఒత్తిడికి గురి కావడం... ఒక్కోసారి ఆత్మహత్యకు ప్రయత్నించడం మామూలే. నీ ప్రేమ వ్యసనం ఏ స్థాయిలో ఉందనేది నీవే అంచనాకు రావాలి. ప్రేమ సంబంధాలు కేవలం లైంగికపరమైనవే కానక్కర్లేదు. స్త్రీ, పురుషుల మధ్య స్నేహం కూడా ఉండొచ్చు. దానికి మన ఆలోచనల్లో పరిపక్వత అవసరం. చవకబారు ఆకర్షణలకు లోనవడం మాని, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించు. బాగా చదువుకొని జీవితంలో స్థిరపడే ప్రయత్నం చెయ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని