ఇద్దరమ్మాయిలతో అయోమయం!

బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నా. పేద కుటుంబం కావడంతో నా ధ్యాసంతా చదువుపైనే ఉండేది.

Published : 25 Feb 2017 01:23 IST

ఇద్దరమ్మాయిలతో అయోమయం!

* బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నా. పేద కుటుంబం కావడంతో నా ధ్యాసంతా చదువుపైనే ఉండేది. ఇదిలా ఉండగా కొన్నాళ్ల కిందట ఒకమ్మాయి ప్రపోజ్‌ చేసింది. ఒప్పుకోలేదు. ‘నువ్వు చేతకానివాడివి. జీవితంలో ఏ అమ్మాయీ నిన్నిష్టపడదు. లైఫంటే చదువొక్కటే కాదు’ అంది. బాధపడ్డా. తను తప్పని నిరూపించడానికి ఇంకో అమ్మాయి వెంటపడ్డా. కొద్ది రోజులు కష్టపడి ఆమెకు నమ్మకం కలిగించి ఐలవ్యూ చెప్పా. ‘నీకంత సీన్‌లేదు. బుద్ధిగా చదువుకో’ అందామె. ఇద్దరి మాటలతో చదువుపైనే ఇంట్రెస్ట్‌ పోయింది. ప్రేమకు, పెళ్లికీ పనికి రానేమోనని, నన్నెవరూ ఇష్టపడరని భయమేస్తోంది. నేనేం చేయాలి?

- ఎస్‌.ఎస్‌., ఈమెయిల్‌

మీ చేయకూడదు. కేవలం చదువుకోవాలి. పుస్తకాలపై ధ్యాస తగ్గడానికి కారణం నీలోని అపసవ్య ఆలోచనలు. మొదటమ్మాయి చదువే ముఖ్యం కాదనడంతో నీలో కలవరం మొదలైంది. బహుశా అది నిజం కావొచ్చని నమ్మి నీ మనసు పెడదారి పట్టింది. రెండో అమ్మాయి నీకంత సీన్‌లేదని వ్యాఖ్యానించి నీ ఆత్మగౌరవాన్నే దెబ్బతీసింది. దీంతో న్యూనతా భావాలు చెలరేగి నీలో డిప్రెషన్‌ మొదలైంది. ఈ దెబ్బతో చదువా? ప్రేమా? అనే ఆత్మసంఘర్షణ మొదలైంది.
ప్రతి మనిషి జీవితంలో కొన్ని దశలుంటాయి. ప్రతిదశలో కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. వీటినే ప్రయారిటీస్‌ అనొచ్చు. విద్యార్థి దశలో చదువుకోవడం ముఖ్యం. చదువుతూనే జీవితానికి అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవాలి. అదే జీవిత పరమార్థం అనుకోవచ్చు. కానీ కొందరి జీవితాల్లో కొన్ని అపసవ్య మార్పులు గమనిస్తుంటాం. చదువు వదిలి ప్రేమలో పడటం అందులో ఒకటి. ‘అయ్యో.. నీకు బోయ్‌ఫ్రెండ్‌ లేడా? గాళ్‌ఫ్రెండ్‌ లేదా?’ అనే చులకన మాటలు ఈ అపసవ్య మార్పును ప్రోత్సహిస్తాయి.
మనుషుల్లో రెండురకాలుంటారు. ఇతరుల మాటలు, చేతలకు ప్రభావితం అయ్యేవాళ్లు (ఫీల్డ్‌ డిపెండెంట్‌), సొంత వ్యక్తిత్వం కలిగినవాళ్లు (ఫీల్డ్‌ ఇండిపెండెంట్‌) అంటాడు హెర్మాన్‌ విట్కిన్‌ అనే మానసిక తత్వవేత్త. మొదటివారు సామాజిక పరిస్థితులకు తొందరగా దాసోహం అయితే, రెండోరకం వ్యక్తులు ఎవరికీ తలవంచకుండా సొంత వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మొదట్లో రెండో కేటగిరీలో ఉన్నా.. ఇతరుల మాటలకు ప్రభావితమై మొదటి రకానికి చేరావు. ఇప్పటికైనా సత్యం గ్రహించు. మొదటి అమ్మాయి మాటలతో నీ ప్రయారిటీ మార్చుకోకు. రెండో అమ్మాయి మాటలకు చిత్తైపోకు. ఎవరి ఆత్మస్థైర్యం వాళ్ల చేతుల్లోనే ఉండాలి. పొగిడితే పొంగిపోవడం, తప్పు పడితే కుంగిపోవడం సమంజసం కాదు. గత సంఘటనలు మర్చిపోయి చదువుకుంటూ వెళ్లు. జీవితంలో ఎదుగుతావు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని