స్మార్ట్‌ఫోన్‌ కొంప ముంచేస్తోంది!

డిగ్రీ సెకండియర్‌ విద్యార్థిని. పుట్టిన రోజుకి నాన్న స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చారు. అప్పట్నుంచి నాకదే లోకం...

Published : 18 Mar 2017 01:41 IST

స్మార్ట్‌ఫోన్‌ కొంప ముంచేస్తోంది!

* డిగ్రీ సెకండియర్‌ విద్యార్థిని. పుట్టిన రోజుకి నాన్న స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చారు. అప్పట్నుంచి నాకదే లోకం. ఈమధ్యే ‘పోర్న్‌ చిత్రాలు’ చూడటం అలవాటైంది. మొదట్లో వెగటుగా, భయంగా ఉండేది. ఇప్పుడు వాటిని చూడకుండా ఉండలేని స్థితి. వరుసలు మర్చిపోయి దగ్గరి వాళ్లతో శృంగారంలో పాల్గొంటున్నట్టు కలలు కంటున్నా. ఒక్కోసారి సిగ్గుగా అనిపిస్తోంది. బయటివాళ్లతో చెప్పుకోలేను. ఈ సమస్య నుంచి బయటపడేదెలా?

- ఎస్‌.ఎం., ఒంగోలు

దురదృష్టవశాత్తు చాలామంది విద్యార్థులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌, అంతర్జాలం విపరీతంగా ఉపయోగిస్తూ వాటికి బానిస అవుతున్నారు. పోర్న్‌ చిత్రాలు చూసేవాళ్లంతా మొదట్లో నీలాగే వెగటు, భయానికి లోనవుతారు. తర్వాత భయం తగ్గి ఇదొక భయంకర అలవాటుగా మారే ప్రమాదం ఉంది. మనిషి అలవాట్ల సముదాయమే అతడి వ్యక్తిత్వం అంటాడు జాన్‌ బి.వాట్సన్‌ అనే ప్రముఖ సైకాలజిస్టు. దీనర్థం అలవాట్లు చెత్తగా ఉంటే అతడి వ్యక్తిత్వం మున్సిపల్‌ చెత్తకుండీలా తయారవుతుంది. చెడు అలవాట్లకు లొంగిపోతే చదువు చట్టుబండలు అవుతుంది. చదువేకాదు... ఇతర సామాజిక నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కోల్పోతావు. ఫలితంగా నీ సాంఘిక సర్దుబాటు అస్తవ్యస్తమవుతుంది.
ప్రఖ్యాత సైకో అనలిస్ట్‌ సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ మనిషి వ్యక్తిత్వంలో ఇడ్‌, ఈగో, సూపర్‌ఈగో అనే మూడు విభాగాలు ఉంటాయంటాడు. సూపర్‌ ఈగో నైతిక సూత్రాలకు కట్టుబడి ఉంటుంది. మనిషి అనైతికంగా ప్రవర్తిస్తే పశ్చాత్తాప భావాలు రగిలించి అతన్ని శిక్షిస్తుంది. ఈ భావాల తీవ్రత పెరిగితే తీవ్ర ఒత్తిడికి గురై మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మరి చేజేతులా ఈ దుస్థితి తెచ్చుకోవడం ఎందుకు? దీన్ని లెక్కచేయకుండా ఇదే విధంగా పోర్న్‌ చిత్రాలు చూస్తూ పోతే ఈ అలవాటు మరింత బలంగా మారుతుంది. దీన్నే ‘హ్యాబిట్‌ స్ట్రెంగ్త్‌’ అంటారు. తర్వాత ఈ దుస్థితి నుంచి బయటపడటం దాదాపు అసాధ్యం. అందుకే నువ్వు ఇప్పుడే జాగ్రత్తపడాలి. సమస్య ముదరక ముందే స్మార్ట్‌ఫోన్‌ వదిలెయ్‌. దాన్ని అమ్మానాన్నలకు ఇచ్చెయ్‌. మనసుని కేవలం చదువుపైనే నిలుపు. మొదట్లో కొంత ఇబ్బంది అనిపించినా పట్టించుకోవద్దు. ఎలాంటి కవ్వింపులకు తలవంచకు. మనిషి గట్టిగా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే. ఇప్పుడే ఆ ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో నిన్ను డీ అడిక్షన్‌ సెంటర్‌లో చేర్చే ప్రమాదం రావొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు