టెక్కు చూపిస్తేనే అమ్మాయిలకిష్టమా?

ఇంటర్‌ చదువుతున్నా. నాన్నది బడ్డీకొట్టు. కాలేజీ లేనపుడు నన్ను అది చూసుకొమ్మంటారు. మామూలపుడు ఫర్వాలేదుగానీ మా కాలేజీలో....

Published : 03 Jun 2017 01:37 IST

టెక్కు చూపిస్తేనే అమ్మాయిలకిష్టమా?

* ఇంటర్‌ చదువుతున్నా. నాన్నది బడ్డీకొట్టు. కాలేజీ లేనపుడు నన్ను అది చూసుకొమ్మంటారు. మామూలపుడు ఫర్వాలేదుగానీ మా కాలేజీలో చదివే అమ్మాయిలు ఎవరైనా చూసినపుడు నాకు నామోషీగా ఉంటుంది. మరోవైపు నా స్నేహితుల్లో కొందరికి లవర్స్‌ ఉన్నారు. క్లాస్‌గా ఉంటేనే అమ్మాయిలు పడతారని వారంటున్నారు. మాది చిన్న కొట్టు కావడంతో ఏ అమ్మాయీ నన్నిష్ట్టపడదని నా అనుమానం. అలాగని షాపులో కూర్చోనని నాన్నకు తెగేసి చెప్పలేను. నన్నెవరూ చిన్నచూపు చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

* నీవేం చేయాల్సిన అవసరం లేదు. వెంటనే నీ ఆలోచనా విధానం మార్చుకోవాలి. ‘ఆలోచనలు సవ్యంగా ఉంటే అవి మన ఎదుగుదలకు నిచ్చెనలా ఉపయోగపడతాయి. అపసవ్యంగా ఉంటే మనిషిని మట్టికరిపిస్తాయ’ని ఆరెన్‌బెక్‌, ఆల్బర్ట్‌ ఎల్లిస్‌ అనే మానసిక నిపుణులు చెప్పారు. ఆధునిక దుస్తులు వేసుకుంటే, హై-ఫైగా కనిపిస్తేనే గుర్తింపు ఉంటుందనే ఆలోచన సరైంది కాదు. విద్యార్థి ప్రవర్తన, చదువుకు ఇచ్చే ప్రాముఖ్యత, సామాజిక నైపుణ్యాలే గుర్తింపునిస్తాయి. వేషధారణ ఎలా ఉన్నా ప్రవర్తన తప్పుల తడకగా ఉంటే వాళ్లు అందరిలో చులకనవుతారు.నీడలో ఉన్న పూలమొక్క కచ్చితంగా వెలుగువైపే తిరుగుతుంది. అది దానికి ప్రాణావసరం. అలాగే విద్యార్థి దశలో ఉన్నపుడు మనసు కేవలం చదువుపైనే ఉండాలి. ప్రేమ, ఆకర్షణల వైపు కాదు. ఆలోచనలు పక్కదారి పడితే జీవితంలో ఎదగడం అసాధ్యం. ఈ దశలో చదువు, అందుక్కావలసిన నైపుణ్యాలు, కొత్తకొత్త విషయాలు విద్యార్థులను ఆకట్టుకోవాలి.

ప్రతి ఒక్కరి మధ్య ఆర్థిక తేడాలుంటాయి. అది సహజం. ఈ స్టేటస్‌ విద్యార్థుల ఆలోచనా ధోరణిపై ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా ఆర్థిక తారతమ్యాల గురించి ఆలోచించే వాళ్లలో న్యూనతా భావాలు ఎక్కువనీ, జీవితంలో ఎదగాలనే తపన తక్కువ స్థాయిలో ఉంటుందని ఈ ఫలితాలు తెలుపుతున్నాయి. దీనికి భిన్నంగా వెళ్తేనే రాణించగలవు.

మీ నాన్న కొట్టులో కూర్చోవడానికి నీకు సిగ్గెందుకు? అది మీ జీవనాధారం. దాన్ని తక్కువ అంచనా వేస్తే నీ కుటుంబాన్ని, మీ నాన్నను అవమానించినట్టే కదా! మనం తప్పు చేసినపుడే తల దించుకోవాలి. మీ నాన్నకి చేదోడువాదోడుగా ఉన్నానని గర్వంగా ఫీలవ్వు. అప్పుడు ఏ న్యూనతా భావాలు నిన్ను ఓడించవు. ప్రేమ, ఇతర విషయాలపై దృష్టి్ట మరల్చి చదువుతూ, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ సాగిపో. నీకు నీవే ఒక రోల్‌మోడల్‌గా నిలుస్తావు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని