బోయ్‌ఫ్రెండ్‌ లేని అమ్మాయి దొరికేదెలా?

నా వయసు 28. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను గతంలో ఒకమ్మాయిని ప్రేమించా. తనూ నన్ను ఇష్టపడింది. అయితే కొన్ని కారణాలతో మేం విడిపోయాం. ఇప్పుడు సమస్య ఏమిటంటే నేను ఎవరైౖనా అమ్మాయిని చేసుకుంటే ఆమె కూడా గతంలో ఎవరైనా అబ్బాయితో లవ్‌లో పడిందేమో, కలిసి తిరిగిందేమో అనే అనుమానం కలుగుతోంది.

Published : 08 Jul 2017 01:34 IST

బోయ్‌ఫ్రెండ్‌ లేని అమ్మాయి దొరికేదెలా?

నా వయసు 28. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను గతంలో ఒకమ్మాయిని ప్రేమించా. తనూ నన్ను ఇష్టపడింది. అయితే కొన్ని కారణాలతో మేం విడిపోయాం. ఇప్పుడు సమస్య ఏమిటంటే నేను ఎవరైౖనా అమ్మాయిని చేసుకుంటే ఆమె కూడా గతంలో ఎవరైనా అబ్బాయితో లవ్‌లో పడిందేమో, కలిసి తిరిగిందేమో అనే అనుమానం కలుగుతోంది. ఎవరినీ నమ్మలేకపోతున్నా. అలా నాలుగైదు సంబంధాలు కూడా వదులుకున్నా. అందంగా ఉన్న అమ్మాయిలకైతే క¹చ్చితంగా బోయ్‌ఫ్రెండ్స్‌ ఉంటారని నా నమ్మకం. దీంతో అసలు నాకు పెళ్లి అవుతుందో, కాదో అనే సందేహం మొదలైంది. బోయ్‌ఫ్రెండ్‌ లేని... నాకు నచ్చిన అమ్మాయి దొరుకుతుందా? వాళ్లని గుర్తించడం ఎలా? నన్నేం చేయమంటారు? - ఎస్‌.ఎస్‌., గుంటూరు

నీవైతే ఇంతకు ముందే ప్రేమలో పడటం, దాన్నుంచి బయటపడటం జరిగింది కదా! మరలాంటపుడు నీకు కాబోయే భార్య ఇందుకు భిన్నంగా ఎందుకుండాలి? తనకీ ‘ఎక్స్‌పీరియెన్స్‌’ ఉంటే తప్పేంటి? దీన్నిబట్టి ఆలోచిస్తే నువ్వు ‘జెండర్‌’ పట్ల పక్షపాతం చూపిస్తున్నావని అర్థమవుతోంది. నీకే కాదు ఈ పక్షపాత భావన చాలామంది మగాళ్లకి ఉంటుంది. ఇలాంటి వివక్ష భావనతో ఉన్నవాళ్ల ఆలోచనలు కూడా ఏమంత హుందాగా ఉండవు అంటారు షా, కోస్టాన్జో అనే సైకాలజిస్టులు.

మొత్తానికి నీ ప్రేమ అనుభవాలు ఇతర అమ్మాయిలందరికీ అంటగట్టి వాళ్లను అవమానిస్తున్నావు. పచ్చ కళ్లద్దాలు పెట్టుకున్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మన మనస్తత్వం ఎలా ఉంటే మిగతా ప్రపంచమంతా అలాగే కనిపిస్తుంది. ‘అడాలసెంట్‌ సైకాలజీ’ అనే పుస్తకంలో ఇలాంటి మనస్తత్వంపైనే ఒక కథ ఉంది. ఒక పట్టణంలో ఒకచోట ఒక పెద్దాయన, మరికొంతమంది కూర్చొని పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటారు. ఇంతలో అక్కడకి ఒక కొత్త వ్యక్తి వచ్చి ‘నేను ఇక్కడ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నా. ఇంతక్రితం వ్యాపారం చేసిన వూరిలో అంతా మోసగాళ్లే. ఇక్కడి మనుషులు ఎలాంటివారు?’ అని అడుగుతాడు. దానికి ఆ పెద్దాయన ‘ఇక్కడ కూడా ఎక్కువ మంది మోసగాళ్లు, నమ్మకద్రోహం చేసేవాళ్లే. నీవిక్కడ వ్యాపారం ప్రారంభించక ఉంటేనే ఉత్తమం’ అని బదులిస్తాడు. అతడు వెళ్లిపోయాక ‘ఆ వ్యాపారి కేవలం చెడే చూస్తాడు. అలాంటివాడికి మన పట్టణంలోనే కాదు ఎక్కడా మంచి కనిపించదు. అందుకే అలా అబద్ధం చెప్పాను’ అని వివరిస్తాడు. ఈ కథ వ్యక్తుల మనస్తత్వాన్ని విశ్లేషిస్తుంది.

చివరగా చెప్పేదేమిటంటే నువ్వు వెంటనే నీ ఆలోచనా విధానాన్ని మార్చుకో. అందమైన అమ్మాయిలంతా అల్లరి చిల్లరగా తిరుగుతారనుకోవడం సమంజసం కాదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ముందు ఈ తప్పుడు ఆలోచనలకు తాళం వెయ్యి. భార్యాభర్తలది అవినాభావ సంబంధం. ఈ అనుబంధం విశ్వాసం అనే పునాదులపై నిలబడుతుంది. అపనమ్మకంపై కాదు. ఈ విషయం తెలుసుకో.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని