అతడో అనుమాన పిశాచి... అయినా తనే కావాలంటోంది!

మా అక్క పీజీ చదివేటప్పుడు ఓ కానిస్టేబుల్‌ని ప్రేమించింది. అతడ్నే పెళ్లాడతానని గొడవ.

Published : 22 Jul 2017 01:42 IST

అతడో అనుమాన పిశాచి... అయినా తనే కావాలంటోంది!

* మా అక్క పీజీ చదివేటప్పుడు ఓ కానిస్టేబుల్‌ని ప్రేమించింది. అతడ్నే పెళ్లాడతానని గొడవ. తను స్థిరపడలేదు. మా కులం కాదు. అయినా కూతురి కోసం నాన్న వెళ్లి మాట్లాడితే భారీ కట్నం, పొలం డిమాండ్‌ చేశాడు. అడిగినంతా ఇచ్చుకోలేమంటే వేరే అమ్మాయిని చేసుకుంటానని బెదిరించాడు. మరోవైపు అతడ్నిచ్చి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్‌మెయిల్‌ చేసి అక్క అతను అడిగింది ఇచ్చేలా ఒప్పించింది. తర్వాత అతడి గురించి చాలా విషయాలు తెలిశాయి. తనకి అనుమానం ఎక్కువ. వేరే నెంబర్‌ నుంచి కాల్‌ చేసి అది లిఫ్ట్‌ చేస్తే ‘వేరే కుర్రాడు అనుకొని లిఫ్ట్‌ చేశావా?’ అని అక్కని టార్చర్‌ పెడతాడు. ఇంతకుముందు కూడా ఒకమ్మాయిని ఇలాగే అనుమానిస్తే తను బ్రేకప్‌ చెప్పింది. అక్క ఫ్రెండ్స్‌ ద్వారా తెలిసిందేంటంటే ఓసారి అతడితో డేట్‌కి వెళ్లి తప్పటడుగు వేసిందట. అందుకే తనని పెళ్లాడి ఎలాంటి కష్టమైనా భరిస్తానంటోంది. చూస్తూచూస్తూ ఒక వెధవకి ఇచ్చి కట్టబెట్టడానికి మనసొప్పడం లేదు. ఏం చేయాలో సలహా ఇవ్వండి.

- ఎస్‌.ఎస్‌.ఆర్‌., ఈమెయిల్‌

* మీరు భావిస్తున్నట్టుగా ఇది ఒకే సమస్య కాదు. ఒకటి మీ అక్కకీ, ఆమె కోరుకుంటున్న వ్యక్తికీ మధ్య. మరోటి ఆమెకు, మీ కుటుంబానికి మధ్య ఉన్న అనుబంధం. వయసులో ఉన్న పిల్లలు రకరకాల కారణాలతో ఆకర్షణల వలలో చిక్కుకోవడం ఈమధ్య కాలంలో తరచూ చూస్తున్నదే. కానీ అవతలి వ్యక్తి తన చెడు స్వభావాన్ని బయట పెట్టిన తర్వాత కూడా అతనితోనే జీవితం పంచుకుంటానని భావించే పరిస్థితి ఇప్పడు లేదు. ముందుగా మీరు మీ అక్కకూ మీ కుటుంబ సభ్యులకూ మధ్య సంబంధాలు మెరుగు పరచుకోవాలి. మీరూ, మీ కుటుంబ సభ్యులూ ఆమె నమ్మకాన్ని పొందాలి. ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యమైంది కానీ పూర్తిగా సమయం మించిపోలేదు.

మీరు అతడికిచ్చి పెళ్లి చేయకపోవడానికి కారణం కుటుంబం పరువుకు సంబంధించిన కారణాలు కాదనీ.. కేవలం ఆమె భద్రత కోసమనీ, భవిష్యత్తులో ఆమె సుఖంగా ఉండటం కోసమనీ నమ్మకం కలిగేలా చెప్పాలి. ‘నీవల్ల మాకు సమస్యగా ఉంది. అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాం’ అని కాకుండా ‘నీ కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాం. నీ సుఖం, భద్రత మాకు ముఖ్యం’ అనే ధోరణిలో మాట్లాడాలి. మీ బంధువులు, సన్నిహితుల్లో ఎవరైనా పోలీసుశాఖలో ఉంటే ఆ కానిస్టేబుల్‌ వల్ల మీ అక్క పడుతున్న సమస్యల గురించి చెప్పండి. మితిమీరిన ప్రవర్తన అతని ఉద్యోగానికే ప్రమాదమని అతడికి తెలియాలి. ఎప్పుడో జరిగిన పొరపాటుకు జీవితం బలి పెట్టుకోవాల్సిన పనిలేదు.

జాగ్రత్తగా ప్రయత్నిస్తే కింది దశల్లో మీ అక్క సమస్యకి పరిష్కారం దొరకొచ్చు.
* అతడ్ని పెళ్లాడితే మంచి కన్నా చెడే ఎక్కువని మీ అక్క తనకు తానుగా గ్రహించాలి. అతడ్ని పెళ్లాడాలనే ఆలోచన విరమించుకునేలా మీరు చేయాలి.
* పెళ్లైనా, కాకపోయినా కుటుంబం ఆమెనో సమస్యగా, గుదిబండగా భావించడం లేదనే నమ్మకాన్ని ఆమెలో కలిగించాల్సిన బాధ్యత మీదే.
* అతడి నిర్వాకం గురించి పోలీసు డిపార్ట్‌మెంట్‌లోని ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయండి.
* ఒకవేళ వేరే సంబంధం కుదుర్చుకోవాలి అనుకుంటే జరిగిందంతా చేసుకోబోయేవాళ్లకు ముందే చెప్పడం మంచిది. అర్థం చేసుకునేవాళ్లు తప్పకుండా దొరుకుతారు.ఆల్‌ ది బెస్ట్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని