ప్రేమంటే ఓకే.. పెళ్లే అడ్డంకా?

నా పేరు అహ్మద్‌. చిన్నప్పట్నుంచి ఒకమ్మాయి, నేను ప్రాణంగా ప్రేమించుకున్నాం.

Published : 14 Oct 2017 01:57 IST

ప్రేమంటే ఓకే..
పెళ్లే అడ్డంకా?

మనలో మనం
నా పేరు అహ్మద్‌. చిన్నప్పట్నుంచి ఒకమ్మాయి, నేను ప్రాణంగా ప్రేమించుకున్నాం. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదాని హద్దులు దాటాం. మా సంగతి వాళ్లింట్లో తెలిసింది. నన్ను ఇంకోసారి కలిస్తే కుటుంబమంతా ఉరేసుకొని చనిపోతామని బెదిరించారు. నాతో జీవితం పంచుకోవాలనే ఆశను చంపేసుకొని నన్ను మర్చిపో అంటోంది తను. ఆమె ఒక ప్రభుత్వఉద్యోగి. నేను కొలువు కోసం ప్రయత్నిస్తున్నా. తనకి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చట్టం ద్వారా మేమేమైనా రక్షణ పొందగలమా? దయచేసి ఏం చేయాలో చెప్పండి.

- అహ్మద్‌, ఈమెయిల్‌

దైనా జటిల సమస్య ఎదురైనపుడు దాన్ని మన కోణంలోనే చూడటం, ఆలోచించడం సామాన్యులు చేసే పని. ప్రస్తుతం నీవు కూడా సమస్యను నీ కోణంలోనే చూస్తున్నావు. మీ మధ్య ఉన్న ప్రేమ నిజమే అయినా దాన్ని నువ్వు చూస్తున్న కోణం, ఆమె చూస్తున్న కోణం, ఆమె కుటుంబం చూసే కోణం, సమాజం చూసే కోణం వేర్వేరుగా ఉంటాయి. మీ ప్రేమ విషయంలో మీ కుటుంబం ఎలా స్పందిస్తుందో, వారి అభిప్రాయాలేంటో చెప్పలేదు.
వయసులో ఉన్న యువతీయువకుల మధ్య ఆకర్షణ లేదా ప్రేమ ఏర్పడటం.. అది శారీరక సాన్నిహిత్యానికి దారి తీయడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఆ ప్రేమ, ఆకర్షణ శాశ్వతం కావు. శాశ్వతమైన ప్రేమకు మానసికమైన అనుబంధం పునాది. అలాంటి మానసికమైన అనుబంధం మీ ఇద్దరి మధ్యా ఉన్నట్లైతే మీ పెళ్లిని పెద్దలు సైతం అడ్డుకోలేరు. అలాంటి అనుబంధం మీ మధ్య ఉందా? లేదా? అని తేల్చుకునేందుకు ఇదే సరైన సమయం. మంచి అవకాశం.
ఆమెకు వేరొకరితో బలవంతంగా వివాహం చేస్తారనే భయం వద్దు. ఆమె నిన్ను గాఢంగా ప్రేమిస్తుంటే తన వివాహాన్ని వాయిదా వేసుకోగలదు. తల్లిదండ్రుల పట్టుదల కారణంగా ఆమె నీతో తనకున్న సంబంధాన్ని కొనసాగించడానికి సంబంధించిన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటూ ఉండవచ్చు. ఆమెకు తగిన సమయం ఇవ్వడమే నీకు కూడా మంచిది. మీ మధ్య ఉన్న శారీరక సంబంధం సంగతి మర్చిపోయి మానసికంగా ఆమెకూ ఆమె కుటుంబ సభ్యులకూ నీమీద గట్టి నమ్మకం కలిగించగలిగితేనే ప్రయోజనం ఉంటుంది. ఒక విద్యావంతురాలు, ఉద్యోగస్తురాలు అయిన యువతిని కేవలం ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ ద్వారా ఆమె ప్రేమించిన వ్యక్తి నుంచి ఎక్కువకాలం దూరంగా ఉంచడం ఆమె తల్లిదండ్రులకు కూడా సాధ్యం కాదు. అలాగే శారీరక సంబంధాన్ని సాకుగా చూపి ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేసి ఆమెను పొందడం నీకు మంచిది కాదు. తల్లిదండ్రుల ఒత్తిడితో ఆమె నీతో ఉన్న సంబంధాన్ని కొనసాగించాలనే నిర్ణయాన్ని పునరాలోచించుకుంటూ ఉండొచ్చు. ఈలోగా నీవు నీ ఉద్యోగం మీద, ఆర్థిక భద్రత మీద దృష్టిపెట్టు. మగాళ్లకి సరైన ఉద్యోగం, ఆర్థిక భద్రత లేకపోవడంతో అత్యధికశాతం ప్రేమ పెళ్లిళ్లు విఫలం అవుతున్నాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. మీ ప్రేమ విజయవంతం కావాలంటే నువ్వు తగిన ఉద్యోగం చూసుకోవడం అత్యవసరం.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని