ఆ తప్పు.. తప్పేం కాదనిపిస్తోంది

నేనో ప్రభుత్వ ఉపాధ్యాయుణ్ని. వయస్సు 36. పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నా. ఏకాగ్రత కుదరటం లేదు. నాకు ఇద్దరితో వివాహేతర సంబంధాలున్నాయి. వాళ్లను కలసినప్పుడు బాగున్నా... కొన్ని రోజులకు ఆ ఆలోచనలు నన్ను వేధిస్తున్నాయి....

Published : 11 Nov 2017 01:51 IST

మనలో మనం!
ఆ తప్పు.. తప్పేం కాదనిపిస్తోంది

నేనో ప్రభుత్వ ఉపాధ్యాయుణ్ని. వయస్సు 36. పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నా. ఏకాగ్రత కుదరటం లేదు. నాకు ఇద్దరితో వివాహేతర సంబంధాలున్నాయి. వాళ్లను కలసినప్పుడు బాగున్నా... కొన్ని రోజులకు ఆ ఆలోచనలు నన్ను వేధిస్తున్నాయి. మరోవైపు చుట్టూ ఉన్న సమాజం, మీడియా, చరిత్రలోని బహుభార్యత్వం, సినిమాల్లో అశ్లీలత.. వీటన్నింటిని చూసిప్పుడు వివాహేతర సంబంధాలు తప్పు కావనే భావన కలుగుతోంది. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదివినప్పుడు ఉన్నతి స్థితికి వెళ్లాలని, బాగా చదువుకోవాలని, సమాజానికి మేలు చేయాలని బలంగా అనుకుంటాను. కానీ ఈ శారీరక సంబంధాల వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను. నా సమస్యకు పరిష్కారం ఏమిటి?

-ఏఎంఆర్‌

కొన్ని పరిస్థితులు నీకు వక్రమైన ఆలోచనలు కలిగించినప్పటికీ అవి నిజం కావని గ్రహించాలి. కొండ గుహల్లో ఉన్న మనిషి కొన్ని నిర్ధిష్ఠమైన నియమాలతో సంఘంలో జీవించడం మొదలు పెట్టాడు. సంఘం సక్రమంగా సాగడానికి కుటుంబం అనే వ్యవస్థను స్థాపించుకున్నాడు. బహుశా మనిషి స్థాపించుకున్న అన్ని వ్యవస్థల్లో కుటుంబం అతి ఉత్తమమైనదని చాలామంది ఉద్దేశం. ఒక వేళ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటే మనిషి డార్విన్‌ సూచించిన ఏ నిచ్చెన ద్వారా ఎదిగి పైకొచ్చాడో, అదే నిచ్చెన నుంచి జారిపడి మళ్లీ జంతువైతాడనే భావన మనకు తడుతుంది. కుటుంబానికి అందుకే అంత ప్రాముఖ్యం. అక్రమ సంబంధాలు ఈ కుటుంబ జీవితాల్లో అపశ్రుతులు పలికి కుటుంబ వ్యవస్థనే దెబ్బ తీస్తాయి. ఈ ప్రపంచం ఒక చెట్టయితే కుటుంబం దాని అకు లాంటిది. చెట్టు మాడిపోతే దాని ఆకులు కూడా రాలిపోతాయి. సమాజంలోని విలువలు ఈ చెట్టుకు పోసే ఎరువులు, నీళ్ల వంటివి. విలువలు తరిగిపోతే సమాజం అనే ఈ చెట్టు ఎలా బతుకుతుంది? కుటుంబం ఎలా కొనసాగుతుంది? స్నైడార్‌ అనే సైకాలజిస్ట్‌ ఉద్దేశంలో విలువలను గౌరవించేవాడే సమాజంలో చక్కటి సర్దుబాటు చేసుకుంటాడు. విలువలను అతిక్రమించి జీవిస్తే తులసి మొక్కల్లో గంజాయి మొక్క మాదిరిగా ఎబ్బెట్టుగా జీవితాన్ని నెట్టుకురావాల్సి వస్తుంది. మీడియా, సినిమాల్లో మనం వినే విషయాలు, చూసే సన్నివేశాల్లో నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటుందో అంత నిజముంటుందని నీవు తెలుసుకోవాలి. పాతకాలంలో బహు భార్యత్వం సమాజానికి గొడ్డలి పెట్టని తేలిపోయింది. అందుకు సమాజం, న్యాయశాస్త్రం ఏనాడో ఇది తప్పని తేల్చి చెప్పాయి. నీవొక టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నావు. నీ ప్రవర్తన పిల్లలకు ఒక రోల్‌మోడల్‌గా ఉండాలి. చక్కటి ప్రవర్తన నీలో ప్రతిబింబంచాలి. అది విద్యార్థులను ప్రభావితం చేయాలి. అప్పుడే నీవు నీ ఉద్యోగానికి న్యాయం చేస్తావు.

రామకృష్ణ పరమహంస వద్దకు ఒకతను వచ్చాడట. తన కొడుకు విపరీతంగా తీపి పదార్థాలు తింటాడని, వాడిని వారించమని వేడుకొన్నాడట. దానికి గురూజీ అతన్ని ఒక నెల రోజుల తర్వాత రమ్మని చెప్పాడట. నెల తర్వాత ఆ పిల్లవానితో మాట్లాడి తీపి తినకుండా ఉండడానికి చక్కటి ఉపదేశం ఇచ్చాడట. పిల్లవాడు తీపి తినడం మానేశాడట. అప్పుడు పిల్లవాని తండ్రి ‘మీరు బాబులో మార్పు తేవడానికి నెల రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు? నెల క్రితమే ఇతన్ని వారించవచ్చు కదా?’అని అడిగాడట. దానికి సమాధానంగా నేను కూడా స్వీట్స్‌ తింటాను. నేను తింటూ అతన్ని మానేయమని ఎలా చెప్పాలి. అందుకే ఈ నెల రోజుల్లో తీపి తినడం మానేసి, ఆ తర్వాత అతన్ని తినకూడదు అని చెప్పగిలిగాను అని అన్నాడట. అందుకే చెప్పే ముందు మనం ఆచరించి చూపాలి. టీచర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న నీవు మనసా వాచా మరిపోవాలి. కావాలనుకుంటే నీ ఆలోచనల్ని మార్చుకోవడానికి ఒక క్లినికల్‌ సైకలాజిస్ట్‌ను కలువు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని