మీకెన్ని గుండెలు?

అమ్మ ప్రేమలో లాలన తరగనిది! నాన్న ప్రేమలో బాధ్యత బలమైంది! తోబుట్టువు ప్రేమలో తోడ్పాటు విలువైంది! స్నేహితుడి ప్రేమలో స్వచ్ఛత నిజమైంది! మరి, ప్రేమికుల ప్రేమ??? నిజం... అనుకునేలోపే అపార్థం పేరుతో ఆయువు పోతోంది! బలం... అనుకునేలోపే బాధ్యత మరిచి బ్రేక్‌అప్‌ అంటోంది! తోడ్పాటు... అందామంటే తీరు మార్చుకుని దార్లు వేరంటోంది! రోజూ చూస్తున్న ఘటనలే అందుకు నిదర్శనం!

Published : 10 Feb 2018 02:19 IST

ప్రేమించడానికి
మీకెన్ని గుండెలు?
ఆర్ట్‌ ఆఫ్‌ లవింగ్‌

అమ్మ ప్రేమలో లాలన తరగనిది!
నాన్న ప్రేమలో బాధ్యత బలమైంది!
తోబుట్టువు ప్రేమలో తోడ్పాటు విలువైంది!
స్నేహితుడి ప్రేమలో స్వచ్ఛత నిజమైంది!
మరి, ప్రేమికుల ప్రేమ???

నిజం... అనుకునేలోపే అపార్థం పేరుతో ఆయువు పోతోంది!
బలం... అనుకునేలోపే బాధ్యత మరిచి బ్రేక్‌అప్‌ అంటోంది!
తోడ్పాటు... అందామంటే తీరు మార్చుకుని దార్లు వేరంటోంది!
రోజూ చూస్తున్న ఘటనలే అందుకు నిదర్శనం!

* నో చెప్పిందని నాటు కత్తితో వేటు వేయడం చూశాం!
* కాదందని కాలం చేయడం విన్నాం!
* కన్నవారు బెట్టుచేశారని కలిసి తనువు తాలించడం కన్నాం!
* బిల్లు కట్టలేదని.. సెల్లు ఎత్తలేదని... కారణాలు వెతుక్కుని ప్రేమకి కట్‌ చెప్పేవారైతే లెక్కలేదు!!
మరైతే, నిజమైన... బలమైన... విలువైన... ప్రేమికులు లేరా?
ఎందుకు లేరు? ఉన్నారు!! కానీ, అందుకు చాలా గుండెలు కావాలి! అన్ని గుండెలు ఉంటేనే ప్రేమికులవ్వండి...
ప్రేమికుల దినోత్సవం జరుపుకోండి!!

‘మీరెవరినైనా ప్రేమించారా?’ అని ఎవరినైనా అడిగి చూడండి. లేదు... అనే సమాధానం తక్కువగా వినిపిస్తుంది. ప్రేమ మనందరికీ పరిచయమే. అమ్మ లాల పోస్తున్నప్పుడో.. టీచర్‌ నేచర్‌ కాల్సకి నవ్వుతూ పొమ్మన్నప్పుడో... టీనేజ్‌ ఫస్ట్‌ క్రష్‌ లోనో... ప్రేమ ఫైవ్‌ స్టార్‌ చాక్లెట్‌లా కొంత తీపిని పంచే ఉంటుంది. అంత వరకూ ఒకే. కానీ.. చట్రాల చదువుల్లోనో... క్యాంపస్‌ జోష్‌ల్లోనో... ఆఫీస్‌ క్యాబ్‌ల్లోనో...  సోషల్‌ అడ్డాల్లోనో... ఓ సాయంత్రం మెరుపు మెరుస్తుంది... వాన కురుస్తుంది... హృదయం తడిసి ముద్దవుతుంది... రెయిన్‌బో ఒంపుపై మెరుపు తీగకు మరదల్లా ఓ వయ్యారీ.... కట్‌..కట్‌... సినిమాల్లో కదా ఇలా జరిగేది. ఒకే యార్‌... అలా ఊహిస్తే బాగుంది కదూ! ఇంద్రధనస్సులు... మెరుపు  తీగలు... లాంటివి పక్కన పెడితే నిజ జీవితంలోనూ ఇలా జరగొచ్చు. పరిపూర్ణమైన ప్రేమ పలకరిస్తుంది. పీల్చేగాలిలో ఏదో పరిమళం తెస్తుంది. బహుశా ఆ శ్వాసలో ధ్యాసను మీరు గ్రహిస్తారు. ఏదో తేడా... తేడా... కుచ్‌  కుచ్‌ హోతా హై! అనిపిస్తుంది. ఇక్కడే... మీరు అప్పటి వరకూ చదవని శాస్త్రం ఒకటి జీవిత లైబ్రరీలో తారసపడుతుంది. అదే ప్రేమ శాస్త్రం!

ఏ శాస్త్రానికైనా ఉపోద్ఘాతం ఒక్కపేజీనే. కానీ, ప్రతి చాప్టర్‌ మిమ్మల్ని అడాప్టర్‌లా ఛార్జ్‌ చేస్తుంది. ‘ఆర్ట్‌ ఆఫ్‌ లవ్‌’ కూడా అలాంటిదే. చదువుతూ వెళుతుంటే... ప్రతి అధ్యాయంలోనూ అందమైన అనుభవాలు. ప్రతి పేజీలోనూ ఊహకు అందని మలుపులు... గెలుస్తామా? పడిపోతామా? హోల్డాన్‌... యామ్‌ ఇన్‌ లవ్‌!! అనుకునే వాళ్లంతా ఎక్కడికో వెళ్లిపోయినట్టున్నారు! మరి, ఇప్పటివరకూ ప్రేమలో పడినవాళ్ల సంగతేంటి? ‘ప్రేమంటే గుడ్డిది.. బ్లైండ్‌... ట్రాష్‌... టైం  వేస్ట్‌... యూస్‌ లెస్‌... ఎమోషనల్‌ బిజినెస్‌... ఇలా చాలానే విన్నాం. ఆర్ట్‌ ఆఫ్‌ లవింగ్‌ అనేది ఉందా?’... అని చాలా సందేహాలు వ్యక్తం చేస్తారు. యస్‌! ఆ సందేహాలకు ఆన్సర్‌ కావాలంటే? ప్రేమ శాస్త్రంలో పాస్‌ అవ్వాల్సిందే.

లవ్‌ క్వాలిఫికేషన్‌..
ఓహ్‌ఁఁఁ చదువుల్లో ఓకే. ఇక్కడ కూడానా! ఇంటర్‌, డిగ్రీ సరిపోతుందా? పీజీ తప్పనిసరా? అని అడగొద్దు. కూల్‌గా కూర్చోండి. గుండె వేగం సాధారణ స్థితికి వచ్చాక మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ప్రేమించడానికి మీకున్న అర్హతలేంటి?... ఆలోచనలో పడ్డారు కదూ! ఒక్కొక్కటిగా రాసుకోండి.. చదువు, ఉద్యోగం, డబ్బు, అందం... అన్నీ  ఉన్నాయిగా అంటూ కాలర్‌ సరిచేసుకుంటున్నారా? వెయిట్‌.. వెయిట్‌.. లిస్ట్‌లో ఏదో మిస్‌ అయినట్టుందే. ఒక్కసారి క్రాస్‌ చెక్‌ చేయండి. అదే ప్రేమకి ఆయువు... అండ... గెలుపు... ఇంకా ఆలోచిస్తున్నారా? ‘ధైర్యం’ అనే మూడక్షరాలే బాస్‌! అందుకు మీకున్న గుండెలు ఎన్ని?

మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి!

కొత్త విషయంలా చెబుతున్నారేంటి ధైర్యం లేకుండానే ప్రేమించేస్తామా? అనుకునే వారందరూ ఒకసారి మిమ్మల్ని తిరిగి ప్రశ్నించుకోండి. కట్టుకునే స్కార్ఫ్‌లు... హ్యాండ్‌ కర్చీఫ్‌లు సూటిగా సమాధానం చెబుతాయి. ‘అక్కడే నాన్న ఆఫీస్‌. నాకు భయం నేను రాలేను’... ‘అన్నయ్య ఉంటాడు. చూస్తే అంతే సంగతులు...’ అని తప్పించుకుని తిరిగిన సందర్భాలు మదిలో తప్పని సరిగా మెదులుతాయి. ఇదేనా ధైర్యం అంటే... ‘మా పరిస్థితి అలాంటిది. ఏం చేయమంటారు. కావాలని ఎదురుపడలేంగా అని సమర్థించుకుంటారు.’ గుడ్‌... కానీ, ఒకటే సూటి ప్రశ్న... మీ టైం బాగోక ఏదో రోజు వాళ్లు ఎదురుపడితే?... మీ ప్రేమకి ఎదురు నిలిచే ధైర్యం ఉండాలి. ధైర్యమంటే... కేవలం ‘ఐ లవ్యూ’ అని మధురమైన మూడక్షరాలను చెప్పేదొక్కటే కాదు. మరెన్నో గుండెలు ఉండాలి.

‘కారణాలను’ క్షమించే గుండె

ప్రేమించడానికి కారణాలు ఉండవు. అగ్నిలాగ స్వచ్ఛమైనది అంటూ ప్రేమించుకుంటారు. కాలం గడుస్తున్నకొద్దీ అదే ప్రేమ ఎన్నో కారణాలు చూపిస్తూ దూరం అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఎక్కువగా ప్రేమ పెళ్లిగా మారే సమయానికే! ఒకరి కారణాలకు మరొకరు పరిష్కారం అవుతూ వెళ్తే కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి. అంటే... ప్రేమ పరిణామ క్రమానికి వారు సిద్ధంగా లేనట్టే అని గ్రహించాలి. ‘‘ఒక్కమాటలో చెప్పాలంటే... మీకున్న గుండె ధైర్యంపైనే మీ ప్రేమ ఎత్తయిన సౌధమా? లోతైన అగాథమా? తేలిపోయే నీడి బుడగనా? అనేది తెలిసేది!

కాదుపొమ్మంటే... తట్టుకునే గుండె

నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించలేను అన్నవారే ‘విసిగించకు... నన్ను వదిలెయ్‌!!’ అంటూ దూరం పెడితే! జీవితం తల్లకిందులైనట్టుగా తల్లడిల్లిపోవద్దు. మీ నుంచి వారేం కోరుకుంటున్నారో ధైర్యంగా అడగండి. విడిపోవడమే వారి ఉద్దేశమైతే విచక్షణతో ఆలోచించండి. వద్దనే మనసుని పదే పదే మార్కెటింగ్‌ చేయడం మంచిది కాదు. అందుకే ‘విష్‌ యూ గుడ్‌లక్‌’ అని ఓ యూ టర్న్‌ తీసుకోండి. మరో రాంగ్‌ టర్న్‌ ఎదురుకాకుండా హైవేలో లైఫ్‌ సాఫీగా సాగిపోతుంది. నమ్మండి!!

అడిగితే... వేచిచూసే గుండె

  క్షణకాలంలో పుట్టిన ప్రేమ అనుక్షణం వెంటే ఉండాలంటే? ప్రేమ వేసుకున్న టీషర్టో... జడకి పెట్టుకున్న క్లిప్పో కాదన్న విషయం గ్రహించాలి. రెండు కుటుంబాలు... కల్చర్‌... కట్టుబాట్లు. వాటన్నింటినీ మెప్పించి ఒప్పించాలంటే ఎవరికైనా కాస్త సమయం పడుతుంది. ‘నువ్వు... నీ నవ్వే కావాలి!!’ అని ఎన్నో సార్లు అనుకుంటారు ప్రేమలో! ‘నువ్వు... నవ్వు’ వెనక వారికంటూ ఓ ప్రపంచం ఉందన్న విషయాన్ని గ్రహిస్తే వేచిచూసేందుకు ధైర్యం టన్నుల కొద్దీ పుడుతుంది. నిజం ఆలోచించండి!!

కెరీర్‌లో నిలదొక్కుకునే దాకా కాపాడుకునే గుండె

తొలిప్రేమ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌లానో... ఎంసీఏ మూవీలో పల్లవి మాదిరిగానో చూడగానే ప్రేమ పుట్టొచ్చు. అది ఇంటర్‌లోనైనా కావచ్చు... ఇంజినీరింగ్‌లో అయినా అవ్వొచ్చు. అయితే, ఆ ప్రేమకి కెరీర్‌ని జత చేసినప్పుడే మొక్కై మొలిచిన ప్రేమ మహావృక్షమై జీవితాంతం తోడూ... నీడని అందిస్తుంది. ఎందుకంటే ప్రేమ శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తేనే ‘డాక్టర్‌ లవ్‌’ పట్టా అందుకోవడం సాధ్యం అవుతుంది.

అర్థం చేసుకునే గుండె

ప్రేమికులు కళ్లని చూసి మనసులోని భావాల్ని ఇట్టే అర్థం చేసుకోగలరు మరి! అదే లవర్స్‌ కొంతకాలానికి ‘ఇంతలా చెబుతున్నా అర్థం చేసుకోవెందుకు?’ అని వాదించుకునే స్థితికి ఎందుకొస్తారు? మారుతున్న ఇరువురి అభిరుచుల్ని అర్థం చేసుకోకపోవడం వల్లే. ఇంటర్‌లో ఉన్న అభిప్రాయాలు... డిగ్రీలోనూ... తర్వాత పీజీలోనూ... చదువు, వయసుతో పాటు మారిపోతుంటాయి. అంటే... ఒకేలా ఆలోచిస్తామని ఇంటర్‌లో ప్రేమించుకున్నవారు డిగ్రిలో ఒకలా... తర్వాత మరోలా మారుతుంటారు. ఆ పరిణామ క్రమాన్ని ఇరువురూ అర్థం చేసుకోకుంటే అపార్థాలకు నానార్థాలు వెతుక్కోవాల్సిన అవసరం రాదు.

పేరెంట్స్‌ని ఒప్పించే గుండె

ల్లిదండ్రులకు పిల్లలకు కోరింది ప్రతీదీ ఇవ్వాలనే అనుకుంటారు. కానీ, ఇచ్చేమందు ఆలోచిస్తారు. ఒకటికి పదిసార్లు చెక్‌ చేస్తారు. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూస్తారు. ఇరువురి ప్రేమని పదుగురి ముందు పరీక్షించేందుకూ వెనకాడరు. అన్నింటికీ సిద్ధమై... అన్ని రకాలుగా మెప్పించేందుకు ‘నాన్న’ అంత ధైర్యం... ‘అమ్మ’ అంత ఓర్పు కావాలి.

ఇంత ధైర్యం మాకుందా?

ఓహ్‌ఁఁ కమాన్‌ కచ్చితంగా ఉంటుంది. మీరు చిన్నప్పుడు ఆడుకునే బొమ్మని లాక్కోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే! ధైర్యంగా ప్రతిఘటించే ఉంటారు. నాదని ఏడుస్తూ ఎదురు నిలబడుంటారు. నిశితంగా గమనించండి వాడి ధైర్యాన్ని. స్పందనలేని బొమ్మని ప్రేమించిన స్వచ్ఛమైన ప్రేమికుడు మీలో ఎప్పుడో ఉన్నాడు. నిజం కాదా? ఇంకా తెలియాలంటే ప్రేమలో పడి తేలినవారిని అడగండి. ఆ మూడు పదాల్ని చెప్పడానికి పడ్డ తిప్పల్ని గొప్పలుగా చెబుతారు. ‘నేనప్పుడు ఇంటర్‌ చదువుతున్నా? తనని చూస్తే గుండెల్లో అదోలా ఉండేది. పక్కా ప్రేమేనని ఫీల్‌ అయ్యి చెబితే వాళ్ల నాన్నకి చెప్పింది. కొన్ని రోజులు కాలేజీ ఛాయలకు పోలే. పార్కుల్లో పార్ట్‌టైం దేవదాసయ్యా!!’ అని ఒకరు... ‘అప్పుడు పీజీ చేస్తున్నా. తను నా క్లాస్‌ మేటే. ఇద్దరికీ ఇష్టమే. కొంతకాలం బాగానే ఉంది. ఓ రోజు ఇంట్లో తెలిసింది. పెద్ద పంచాయితీ. భయంతో ఏం అర్థం కాలేదు. తేరుకునేలోపే మా ప్రేమ పీహెచ్‌డీ థీసెస్‌గా మిగిలిపోయిందని’ ఇంకొకరు.. ‘తర్వాత ఏమైంది అని పొడిగించండి...’ ఫ్రీగా ఉన్నప్పుడు ఇంటికో... ఇంకెక్కడికో రమ్మంటారు. ఎందుకంటే ప్రేమలో ఎదురయ్యే ట్విస్ట్‌లు అలాంటివి మరి. గెట్‌ రెడీ టు ఫేస్‌!! ముందస్తు ‘ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు!!’

- రాజేష్‌ యడ్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని