షేరింగ్‌లో... అంత స్పీడొద్దు

వాట్సప్‌... ట్విట్టర్‌... ఫేస్‌బుక్‌ దేంట్లో ఏది కనిపించినా.. స్పీడ్‌గా ఫార్వర్డ్‌... రీట్వీట్‌.. షేర్‌ చేయడమేనా? ఆగి ఆలో చించే తీరిక లేదా? ఎందుకంత తొందర? మీరు ఫార్వర్డ్‌ చేస్తున్నవి ఏ రకమైన ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాయ్‌! అది వార్తా?... దాని వెనుక దాగున్న మాల్వేర్‌ లింకా? వీటి పర్యవసానాలేంటి? జరగకూడంది ఏదైనా జరిగితే! అనర్థాలకు మీరే జవాబుదారీ! విచక్షణతో ఆలోచించి సోషల్‌ వేదికలపై షేర్‌ చేయండి!..

Published : 02 Jun 2018 03:59 IST

షేరింగ్‌లో... అంత స్పీడొద్దు

వాట్సప్‌... ట్విట్టర్‌... ఫేస్‌బుక్‌ దేంట్లో ఏది కనిపించినా.. స్పీడ్‌గా ఫార్వర్డ్‌... రీట్వీట్‌.. షేర్‌ చేయడమేనా? ఆగి ఆలో చించే తీరిక లేదా? ఎందుకంత తొందర? మీరు ఫార్వర్డ్‌ చేస్తున్నవి ఏ రకమైన ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాయ్‌! అది వార్తా?... దాని వెనుక దాగున్న మాల్వేర్‌ లింకా? వీటి పర్యవసానాలేంటి? జరగకూడంది ఏదైనా జరిగితే! అనర్థాలకు మీరే జవాబుదారీ! విచక్షణతో ఆలోచించి సోషల్‌ వేదికలపై షేర్‌ చేయండి!

 
మస్య ఏదైనా నేటి మిలీనియల్స్‌ చేతిలో ఉన్న అస్త్రం సోషల్‌ మీడియా. హ్యాష్‌ ట్యాగ్‌తో ఎంతటి నిశ్శబ్దాన్నైనా బ్రేక్‌ చేసేస్తున్నారు. సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు సోషల్‌ అడ్డాలనే వేదికలుగా చేసుకుంటున్నారు. క్షణాల్లోనే సమస్య తీవ్రతని వెలుగులోకి తెస్తున్నారు. మంచిదే!! ఇదంతా నాణేనికి ఒకవైపే. మరోవైపు సున్నితమైన సమాజంలోకి నకిలీ సమాచారం చేరిపోతుంది. మాల్వేర్‌లు మాటేసుకుని సిస్టమ్‌లో కూర్చుంటున్నాయి. వాస్తవాలేంటో తెలుసుకోకుండా చూసిందే తడువుగా..  నిశిత పరిశీలన లేకుండా వాట్సప్‌ గ్రూపుల్లో... పొట్టి వేదికల ట్వీటుల్లో ఫార్వర్డ్‌ చేస్తున్నా సమాచారం సమాజానికి క్షణాల్లో చేరిపోతుంది. భయాందోళనలకు గురి చేస్తూ  ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది. దీనికి ఫలితంగా విచక్షణ కోల్పోతున్న జనం చేతుల్లో కొందరు అమాయకులూ బలవుతున్నారు. ఇంకొందరైతే తమ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లకు సమర్పించుకుంటున్నారు. ఇందుకు ఈ మధ్య చోటు చేసుకుంటున్న ఘటనలే నిదర్శనాలు..* పొడవైన కత్తులు... కలవరపెట్టే లుక్‌తో గ్యాంగ్‌లు... వేరే రాష్ట్రం నుంచి వచ్చారని.. అత్యంత కిరాతంగా దాడులకు పాల్పడుతూ పిల్లల్ని ఎత్తుకెళ్లిపోతున్నారని.. ఇలాంటి వారు ఎక్కడ కనిపించినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓ హెచ్చరిక. వైరల్‌ అవుతూ అన్ని సోషల్‌ వేదికల్లో పలు పోస్టింగ్‌ల హల్‌చల్‌!
* ఎఫ్‌బీ వాల్‌పై షేరింగ్‌లు ఇలా... మీరు ఎనభై ఏళ్ల తర్వాత ఎలా ఉంటారు? మీ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలా? మీరు ఏ సెలబ్రిటీతో మ్యాచ్‌ అవుతారు? ఆసక్తికరంగా అనిపించే వీటిని క్షణాల్లో క్లిక్‌ చేస్తారు. ప్రయత్నించి చూస్తారు. తిరిగి వాటిని ఇతరులకు తెలుపుతూ వాల్‌పై షేర్‌ చేస్తుంటారు.
* యాభైవేలు ఖరీదున్న ఫోన్‌ రూ.499. భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌. ఇప్పుడే చెక్‌ చేసుకోండి. గోల్డెన్‌ యానివర్సరీ సందర్భంగా అమెజాన్‌లో అంటూ వాట్సాప్‌  మెసేజ్‌.  చూసీచూడగానే.. నిజమో కాదో తెలుసుకోకుండానే ఫార్వర్డ్‌ చేసేస్తారు.
... ఇలాంటి వాటిని షేర్‌ చేసే ముందు ఎప్పుడైనా ఆలోచించారా? వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహించారా? ఒకరి నుంచి మరొకరి ఫార్వర్డ్‌ అవుతూ వైరల్‌గా మారిన కిడ్నాప్‌ గ్యాంగ్‌ల సమాచారం ఎంతటి దుమారాన్ని రేపుతోందో? ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీసిందో రోజూ చూస్తున్నాం. చదువుతున్నాం. స్మార్ట్‌పోన్‌ చేతిలో ఉంది.. డేటా అందుబాటులో ఉంది కదా! అని వచ్చిన మెసేజ్‌లన్నీ షేర్లు, పోస్టులు చేసుకుంటూ పోతే చాలా ప్రమాదముంది. ప్రతి ఒక్కరూ కోరుకునేది సమాజ  హితమే. కానీ, ఇలాంటి ఫార్వర్డ్‌ మెసేజ్‌ల ద్వారా సాధించేదేంటి? ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకునేంతల భయాందోళనల్ని ప్రేరేపించడమా? ఈ రక‌మైన చర్యలు ఏ  మాత్రం సొసైటీకి మేలు చేసేవి కాదని పోలీసు వ్యవస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా యువత ఇలాంటి వాటిని చూసే దృష్టికోణాన్ని మార్చుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే స్మార్ట్‌ ఫోన్లు ఎక్కువగా వాడేది వీరే.

అవగాహన అవసరం

 ఎంత స్మార్ట్‌  ఫోన్‌ అయినా అత్యుత్సాహానికి పోతే హ్యాకర్‌ వలకి కచ్చితంగా చిక్కుతారు. మీకొచ్చిన ఫార్వర్డ్‌ మెసేజ్‌ ఏదైనా నిశితంగా పరిశీలించండి. దాంట్లో ఏవైనా లింక్‌లు ఉంటే గూగుల్‌లో వెతికి చూడండి. అవి అధికారికమైనవో కాదో చెక్‌ చేసుకోండి.  నకిలీలను వెతికి పట్టే థర్డ్‌పార్టీ సర్వీసులూ నెట్టింట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో https:/heck4spam.com/ వెబ్‌ సర్వీసు ఒకటి. వాట్సప్‌లో వైరల్‌ అవుతున్నవాటిలో ఏవి  నకిలీలో విభాగాల వారీగా వెతికి చూడొచ్చు.
* ఆకట్టుకునేలా ప్రకటనలు ఏవైనా వస్తే వాస్తవ దృక్పథంతో ఆలోచించాలి. ఉదాహరణకు రూ.50,000 ఖరీదున్న ఫోన్‌ని కేవలం కూ.499కే ఇస్తున్నాం అంటే నమ్మొద్దు.  అంత హైఎండ్‌ ఫోన్‌ని చౌకగా ఎలా అమ్మకానికి పెడతారనే స్పృహ ఉండాలి.
* చికిత్స నిమిత్తం సాయం ఆశిస్తూ ఏదైనా మెసేజ్‌ వస్తే. దాంట్లోని నిజమెంతో తెలుసుకోండి. కాంటాక్ట్‌ వివరాల్లో ఎవ్వరూ స్పందించకుంటే మెసేజ్‌ని డిలీట్‌ చేయాలి  తప్పితే మరొకరికి ఫార్వర్డ్‌ చేయొద్దు.
* నకిలీ మెసేజ్‌ మీరు క్రియేట్‌ చేయనప్పటికీ ఎవరో క్రియేట్‌ చేసిన దాన్ని నమ్మి మీరూ ఇతరులతో పంచుకుంటే ఆ మోసంలో మీరూ భాగస్వాములవుతారని గుర్తుంచుకోవాలి.

- సీహెచ్‌ఏఎస్‌ మూర్తి, జాయింట్‌ డైరెక్టర్‌, సీ-డాక్‌

ఇది ఒక రకమైన రుగ్మత

ఇలాంటి ఫేక్‌ మెసేజ్‌లు సృష్టించేవారికి యాంటి సోషల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ ఉంటుంది. వీరు తమ వల్ల ఇతరులు బాధపడితే సంతోషపడిపోతారు. ఇక షేర్‌ చేసేవారు... తమ వల్ల ఎంతో మంది మేలు జరుగుతుందని ఆలోచించకుండా చేస్తుంటారు. కొన్ని మెసేజ్‌ల్లో ఎంత నిజముందో తెలుసుకోకుండా అందరికీ పంపించేస్తారు. ఇలా వ్యక్తిగతంగా తాము గొప్పవారమని తృప్తి పడుతుంటారు. కుల, మతాల వంటి సెన్సిటివ్‌ విషయాలను షేర్‌ చేసేటప్పుడు కొంచెమైనా ఆలోచించాలి. ముఖ్యంగా యువతకు తొందరపాటు ఎక్కువ... అందరికంటే ముందు ఈ విషయాన్ని మేమే చేరవేయాలని ఆత్రుతలో చెక్‌ చేసుకోరు. దీనివల్ల ఎదురయ్యే ఫలితాల గురించి ఆలోచించరు. ముందు సమాచారం చేరవేశామా? లేదా? అని కాకుండా, పంచుకుంటున్నది సరైనదేనా అని చెక్‌ చేస్తే మేలు జరుగుతుంది.

- వీరేందర్‌, సైకాలజిస్ట్‌

ముందు ఆలోచించండి

వాట్సప్‌, ఇతర సోషల్‌ మీడియా వేదికల్లో షేర్‌ అవుతున్న ఒక పోస్టింగ్‌ని ఈ సందర్భంగా కచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అదేంటంటే... ఒకతను తన కొడుకు బడికి వెళ్తుండగా తప్పిపోయాడని, కనిపిస్తే ఈ అడ్రస్‌కి పంపాల్సిందిగా కోరుతూ వాట్సప్‌ గ్రూపులో మెసేజ్‌ పెడతాడు. సాయింత్రానికల్లా కొడుకు జాడ తెలుస్తుంది. ఆనందపడతాడు.  కానీ, తర్వాత రోజు నుంచే అసలు సమస్య మొదలవుతుంది. అదేంటంటే... వాట్సప్‌ గ్రూపులో పెట్టిన మెసేజ్‌ ఊర్లో చాలా మందికి చేరిపోతుంది. దీంతో కొడుకు స్కూల్‌ వెళ్తూ దారిలో ఎవరికి కనిపించినా తీసుకొచ్చి ఇంటి అడ్రస్‌లో దిగబెట్టేస్తుంటారు. ఇలా ఫార్వొర్డ్‌ మేసేజ్‌ పిల్లాడి స్కూల్‌కి ఓ గండంగా తయారవుతుంది. ఇదే మాదిరి  ఎన్నో రకాల ఫార్వర్డ్‌ మెసేజ్‌లు. ఆర్థిక సాయం కోరుతూ... ఉచితం అంటూ.. ఆఫర్లంటూ.. ఇలా చేస్తే మ్యాజిక్‌ జరుగుతుందంటూ ఇన్నా.. అన్నా!! వీటన్నింటి  వెనకున్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే. ఎక్కువ మందికి మెసేజ్‌ చేరేలా చేయడం. దీంతో ఏ హ్యాకర్‌ అయితే మెసేజ్‌ని సోషల్‌ మీడియా సముద్రంలోకి వదిలాడో అతని లక్ష్యం  నెరవేరుతుంది. ఇక నకిలీ మెసేజ్‌ల్లోని యూఆర్‌ఎల్‌ లింకుల గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఎఫ్‌బీ వాల్స్‌పై అప్పుడప్పుడు కనిపించే ఆసక్తికరమైన ప్రకటనలూ అలాంటివే.  సూపర్‌ ఆఫర్‌ అంటూ క్లిక్‌ చేస్తే అంతే సంగతులు. మీకు తెలియకుండానే ఫోన్‌లో ‘స్పై’లా చేరిపోతారు. ఫోన్‌ అంతా హ్యాకర్‌ కంట్రోల్‌లోనే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని