తీపి జ్ఞాపకాలు.. చేదు గుళికలు

కనురెప్ప మూసి తెరిచేలోగానే ఏడాది కరిగిపోయింది. 2022లోకి ఒక్కసారి తొంగి చూస్తే మనసుని మురిపించే జ్ఞాపకాలున్నాయి. కలవరానికి గురిచేసే చేదు గుళికలూ కనిపిస్తున్నాయి.

Published : 31 Dec 2022 01:10 IST

నురెప్ప మూసి తెరిచేలోగానే ఏడాది కరిగిపోయింది. 2022లోకి ఒక్కసారి తొంగి చూస్తే మనసుని మురిపించే జ్ఞాపకాలున్నాయి. కలవరానికి గురిచేసే చేదు గుళికలూ కనిపిస్తున్నాయి. అన్నీ శుభసూచకాలే అన్నట్టుగా సవ్యంగానే మొదలైందీ ఏడాది. కరోనా పీడ విరగడయ్యాక.. కుర్రకారు కాలేజీ క్యాంపస్‌లలో స్వేచ్ఛగా సందడి చేయడం మొదలుపెట్టింది ఈ ఏడాదే. ఇప్పుడే ఉద్యోగులు పదోన్నతుల నిచ్చెనలు ఎక్కారు. సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌, ఫిన్‌టెక్‌, మార్కెటింగ్‌ రంగాలు కొలువులు కుమ్మరించాయి. ఐటీ బూమ్‌ మళ్లీ వచ్చిందా అన్నట్టుగా.. ఉద్యోగులకు నీరాజనాలు పట్టాయి సంస్థలు. సత్తా ఉన్నవాళ్లని ఏరికోరి మరీ అధిక వేతనాలిచ్చి చేర్చుకున్నాయి. యాభైలలో ఉన్నవాళ్లు లక్షలకు ఎగబాకారు. లక్షల్లో ఉన్నవారు మరింత ఎత్తుకు ఎదిగారు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటుండగానే ద్వితీయార్థంలో ఆర్థిక మాంద్యం కమ్ముకొస్తోంది అనే గగ్గోలు మొదలైంది. ఐటీ, కార్పొరేటు కంపెనీలు కొలువుల్ని తెగ్గోస్తున్నాయనే వార్తలు వినిపించాయి. లేఆఫ్‌ల గుబులు మొదలైంది. ఆ భయాలకు అభయమిచ్చేలా ‘నకిలీ సర్టిఫికెట్లు పెట్టి కుదురుకున్నవాళ్లకే తప్ప నిఖార్సైన ప్రతిభావంతులకు వచ్చిన ఢోకాయేం లేద’ని నిపుణులు సెలవిచ్చారు. ఇంతలో ‘లక్ష’ణంగా కొలువులిస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 4లతో భారీ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. అందమైన జీవితం అందాలంటే.. సర్కారీ ఉద్యోగాలు పొందడమే ఏకైక మార్గం అని తీర్మానించేసిన ఔత్సాహికులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మరోవైపు అంకురాలదే భవిష్యత్తు అని అంతా ఎప్పట్నుంచో మొత్తుకుంటున్నా.. ఆ నినాదానికి గండి కొట్టేలా.. గత ఐదేళ్లలో స్టార్టప్‌ల పెట్టుబడుల్లో వేగం నెమ్మదించింది ఈ ఏడాదే అనే చేదు వార్త వినాల్సి వచ్చింది. అయినా ఈ సంవత్సరం భారతీయ స్టార్టప్‌లు 2.3లక్షల ఉద్యోగాలిచ్చాయి అనే శుభవార్త చెప్పింది ‘స్లైడ్‌ వన్‌’ అనే సంస్థ అధ్యయనం. చివర్లో మళ్లీ కరోనా వార్తల భయాలు కలవరపెట్టినా.. కొంచెం కష్టంగా ఎంతో ఇష్టంగా 2022 ముగిసిపోయింది.



ఫిట్‌నెస్‌ ఆన్‌లైన్‌ బాట

2022ని టెక్నాలజీ నామ సంవత్సరం అనొచ్చు. ఈ ఏడాది వేరబుల్‌ గ్యాడ్జెట్లు కుర్రకారు మణికట్టు, ముంజేతులకు కంకణాల్లా మారాయి. స్మార్ట్‌ వాచీలు, హార్ట్‌ రేట్‌ మానిటర్లు, ఫిట్‌నెస్‌ ట్రాకర్లపై కుర్రకారు అత్యధికంగా మనసు పారేసుకున్నారు. స్మార్ట్‌వాచీలతోనే సర్వం నడిపిస్తూ మురిసిపోయారు. ముంజేతి ఫిట్‌నెట్‌ ట్రాకర్లతో కేలరీలను కరిగించే పనిలో పడ్డారు. కరోనా మిగిల్చిన వెతల పుణ్యమా అని స్మార్ట్‌ ఫిట్‌నెస్‌ పరికరాలు అగ్రాసనం అందుకున్నాయి. జిమ్‌లకు వెళ్లి భారీ కసరత్తులు చేయకపోయినా.. జాగింగ్‌ కింగ్‌లు.. వాకింగ్‌ క్వీన్‌లు కావాలనే తపన యువతలో ఎక్కువే అయ్యింది. గంటలకొద్దీ వ్యాయామం చేయలేని వాళ్లకు మినీ వర్కవుట్లు అంటూ కొత్త కసరత్తులు వచ్చి చేరాయి. రోజులో ఎప్పుడైనా వీలును బట్టి ఐదు నుంచి పది నిమిషాల్లో ముగిసే మినీ వర్కవుట్ల ట్రెండ్‌ ఊపందుకుంది. ఈ ఏడాది డిజిటలైజేషన్‌ జిమ్‌ల వరకూ చేరింది. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఎక్సర్‌సైజ్‌ల కార్యక్రమాల జోరు పెరిగింది. ఈ ఉత్సాహానికి మరింత ఊపునిచ్చేలా తారలూ సందడి చేశారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అక్షయ్‌కుమార్‌, షారుక్‌ఖాన్‌ తదితర కథానాయకులు చొక్కాలు విప్పి కండలు చూపించగా.. వాటికి చలించిపోయి.. జిమ్‌లా బాట పట్టిన కుర్రాళ్లూ ఉన్నారు.


సామాజిక మాధ్యమాల జోరు

మిలీనియల్స్‌.. జనరేషన్‌ జెడ్‌లు 2022లో సామాజిక మాధ్యమాలకు మరింతగా అతుక్కుపోయారనే చెప్పొచ్చు. గణాంకాలు చూస్తుంటే అది నిజమే అనక మానదు. ఫేస్‌బుక్‌ మెటాగా మారాక మరిన్ని మెరుపులు సంతరించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సేద తీరకపోతే నెటిజన్లు సిటిజన్లే కాదన్నంతగా చెలరేగిపోయింది ఇన్‌స్టా. చాట్లాటలకి.. సందేశాలకి.. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి చిరునామాగా మారింది వాట్సప్‌. సంస్థకీ, ఉద్యోగార్థికి సంధానకర్త పాత్ర పోషించేందుకు వడివడిగా దూసుకొచ్చింది లింక్డ్‌ఇన్‌. దానికి తగ్గట్టే.. బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తూ వాట్సప్‌ చూడటం.. ప్రతి సందర్భాన్ని ఫొటో తీసి ఇన్‌స్టాలో పంచుకోవడం.. ఆఫీసులో ఫేస్‌బుక్‌ పోస్టులు ఆరా తీయడం.. ఏమాత్రం ఖాళీ దొరికినా యూట్యూబ్‌లో వీడియోలు చూడటం యువతకి పరిపాటిగా మారాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని