Rishi Singh: గళమే.. కల నెరవేర్చింది!

తన గళంతో నవ్వించాడు.. గాత్రంతో కళ్లు చెమర్చేలా చేశాడు... పాటతో అతిథుల్ని పాత జ్ఞాపకాల్లోకి లాక్కెళ్లిపోయాడు.. ఆటతో ఉర్రూతలూగించాడు... మెలోడీ, ర్యాప్‌, బీట్‌.. ప్రతి జానర్‌లో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు... ఆల్‌రౌండర్‌గా అందరి మనసులు గెలిచి.. ‘ఇండియన్‌ ఐడల్‌ 13’ విజేతగా నిలిచాడు. అంతా చేస్తే తనది రెండు పదుల వయసే.

Published : 08 Apr 2023 03:39 IST

తన గళంతో నవ్వించాడు.. గాత్రంతో కళ్లు చెమర్చేలా చేశాడు... పాటతో అతిథుల్ని పాత జ్ఞాపకాల్లోకి లాక్కెళ్లిపోయాడు.. ఆటతో ఉర్రూతలూగించాడు... మెలోడీ, ర్యాప్‌, బీట్‌.. ప్రతి జానర్‌లో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు... ఆల్‌రౌండర్‌గా అందరి మనసులు గెలిచి.. ‘ఇండియన్‌ ఐడల్‌ 13’ విజేతగా నిలిచాడు. అంతా చేస్తే తనది రెండు పదుల వయసే. ఏమాత్రం సంగీత నేపథ్యం లేని కుటుంబం... అయినా సంగీత సునామీలా దూసుకొచ్చిన తనే రిషీ సింగ్‌. తన గళంతో నవ్వించాడు.. గాత్రంతో కళ్లు చెమర్చేలా చేశాడు... పాటతో అతిథుల్ని పాత జ్ఞాపకాల్లోకి లాక్కెళ్లిపోయాడు.. ఆటతో ఉర్రూతలూగించాడు... మెలోడీ, ర్యాప్‌, బీట్‌.. ప్రతి జానర్‌లో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు... ఆల్‌రౌండర్‌గా అందరి మనసులు గెలిచి.. ‘ఇండియన్‌ ఐడల్‌ 13’ విజేతగా నిలిచాడు. అంతా చేస్తే తనది రెండు పదుల వయసే. ఏమాత్రం సంగీత నేపథ్యం లేని కుటుంబం... అయినా సంగీత సునామీలా దూసుకొచ్చిన తనే రిషీ సింగ్‌.

నిత్యం శ్రీరామ నామస్మరణతో మార్మోగే అయోధ్య.. రిషీ సొంతూరు. దేశవ్యాప్తంగా లక్షలమంది ఔత్సాహికులు కలలు కనే.. సోనీ టీవీ నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఐడల్‌ విజేతగా నిలిచాక దేశంలో ఓ సంచలనంగా మారాడు. పాటపై మమకారమే అతడిని మేటిగా నిలిపింది.

తనని తాను తీర్చిదిద్దుకొని..

రిషీది సంగీత నేపథ్యం లేని కుటుంబం. ఆమాటకొస్తే శాస్త్రీయ సంగీతంలో శిక్షణనిప్పించే స్తోమత కూడా కన్నవాళ్లకి లేదు. తల్లి పొద్దంతా రొట్టెలు చేసి అమ్మేవారు. తండ్రి చిన్నచిన్న పనులు చేసేవారు. మరెలా పాటపై అంత ఇష్టం అంటే.. వాళ్ల కుటుంబానికి దేవుడంటే అమితమైన భక్తి. ఏడేళ్ల వయసు నుంచే రిషీతో ఇంట్లో రోజూ భక్తి పాటలు పాడించేవారు. అంతేకాకుండా చుట్టుపక్కల గుళ్లలోకి వెళ్లి భజనలు చేసేవాడు. గురుద్వారాలో కీర్తనలు పాడేవాడు రిషీ. అలా గమకాలపై పట్టు సాధించాక.. మెల్లమెల్లగా స్థానికంగా పాటల పోటీల్లో పాల్గొనేవాడు. పతకాలతో తిరిగొచ్చేవాడు. అయోధ్యలో ఏడాదికోసారి స్థానిక రామ్‌కథా మ్యూజియంలో పెద్దఎత్తున సంగీత పోటీలు జరిగేవి. 2019లో తొలిసారి వేదికనెక్కి, పాడి బహుమతి గెలిచాడు. ఇవేవీ రిషీ తల్లిదండ్రులు రాజేంద్రసింగ్‌, అంజలీలకు సంతృప్తినిచ్చేవి కావు. తను బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలన్నది వాళ్ల ఆశ. ఎలాగో వాళ్లని ఒప్పించి.. పోటీలకు వెళ్లసాగాడు. అందరూ బహుమతులు గెలవడానికి పోటీలకు వెళ్తుంటే.. రిషీ మాత్రం న్యాయనిర్ణేతలు, అతిథులు, సంగీత స్రష్ఠలు చెప్పే సలహాలు, అనుభవాల కోసం ఎదురు చూసేవాడు. ఎందుకంటే తను ఎప్పుడూ గురువు సమక్షంలో సంగీతం నేర్చుకోలేదు. అలా తనని తాను తీర్చిదిద్దుకున్నాక.. ఎలాంటి జానర్‌ అయినా పాడగలను అని నమ్మకం కుదిరాక.. ‘హమ్‌ జీ లేంగే’, ‘ఆసూమియా’, ‘ఇత్తేజా మేరీ’ అని సొంతంగా ఆల్బమ్‌లు రూపొందించి యూట్యూబ్‌లో విడుదల చేశాడు. కపిల్‌శర్మ షోలో ఒకసారి పాల్గొన్నాడు. మూడు బాలీవుడ్‌ సినిమాల్లో కోరస్‌ పాడాడు. తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది.

పట్టు వదలకుండా..

ప్రతి ఔత్సాహిక గాయకులకు సోనీ టీవీ నిర్వహించే పాటల పోటీ ‘ఇండియన్‌ ఐడల్‌’లో పాల్గొనడం ఒక కల. పాటతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆ వేదిక ఎక్కాలనుకుంటారు. అక్కడ విజేతగా నిలిస్తే రాత్రికి రాత్రే స్టార్‌ అవుతారు. పాట ప్రేమికులను కనికట్టు చేస్తూ టీవీ సెట్లకే కట్టిపడేసే వేడుక ఇది. దేశంలోని ప్రధాన నగరాల్లోంచి వేలమంది పోటీ పడే కార్యక్రమం. విజేతకి రూ.25లక్షల నగదు బహుమతి, ఖరీదైన కారుతోపాటు సినిమా అవకాశాలు... మ్యూజిక్‌ కంపెనీలతో ఒప్పందాలు.. చాలానే ఉంటాయి. ఇక్కడ మెరిస్తే తన గానం, గళం.. జనం నోళ్లలో నానుతుంది. రూపం ఔత్సాహికుల గుండెల్లో అచ్చవుతుంది. అందుకే ఇండియన్‌ ఐడల్‌కి అంత క్రేజ్‌. ఇందులోనూ తన ప్రతిభ నిరూపించుకోవాలని 2019లో తొలిసారి దరఖాస్తు చేశాడు. దురదృష్టవశాత్తు తుది పోటీదారుల జాబితాలో చోటు సాధించలేకపోయాడు. అయినా పట్టు వదలకుండా మరోసారి ప్రయత్నించి గతేడాది చివరి 15 మందిలో నిలిచాడు. ఐదు నెలలపాటు జరిగిన పోరులో అసమాన ప్రతిభ ప్రదర్శించి తాజాగా విజేత అయ్యాడు.

ఐడల్‌ అనుభూతులు

పదిహేను మందితో పోటీ రసవత్తరంగా మొదలైంది. అందులో ఎక్కువమంది రిషీకన్నా వయసులో పెద్దవాళ్లు. ఏళ్లకొద్దీ శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నవాళ్లు. దాంతో మొదట్లో కొంచెం తడబడ్డాడు. అతడిలోని ప్రతిభను గుర్తించి న్యాయనిర్ణేతలు విశాల్‌ దడ్లానీ, నేహా కక్కర్‌, హిమేష్‌ రేషమ్మియాలు ప్రోత్సహించినకొద్దీ తన గొంతుతో మాయ చేయడం మొదలు పెట్టాడు. ఈ పోటీలకు చాలామంది సెలెబ్రిటీలు అతిథులుగా వచ్చారు. ‘కేసరియా..’ పాట పాడగానే గెస్ట్‌గా వచ్చిన హీరో రణ్‌బీర్‌సింగ్‌.. రిషీని కౌగిలించుకొని ‘భారతీయ సినిమాల్లోకి మరో గొప్ప సింగర్‌ వస్తున్నాడు’ అని మెచ్చుకున్నాడు. ‘తేరా యార్‌ హూ.. మై’.. పాడుతున్నప్పుడు కార్తీక్‌ ఆర్యన్‌ తన కెరియర్‌ తొలి రోజుల్ని గుర్తుకు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతిథిగా వచ్చిన దర్శకుడు రాకేశ్‌ రోషన్‌ ‘నా కొడుకు హృతిక్‌ రోషన్‌ నీకు పెద్ద ఫ్యాన్‌. ఇండియన్‌ ఐడల్‌లో నువ్వు పాడిన ప్రతి పాటనీ మిస్‌ కాకుండా చూస్తాడు’ అని చెప్పడంతో వేదిక చప్పటతో మార్మోగిపోయింది. భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి రిషీని ఇన్‌స్టాలో అనుసరించడమే కాదు.. తను పాడిన కొన్ని పాటల్ని షేర్‌ చేశాడు. అద్భుతంగా పాడుతున్నావంటూ మెసేజ్‌ చేశాడు. రణ్‌వీర్‌సింగ్‌ అయితే రిషీ పాడుతుంటే వేదికపైకి వచ్చి ఆ పాటకి స్టెప్పులేశాడు. కేవలం పాటకే కాదు.. ఆటకు, అభినయానికి, ఆహార్యానికీ ఇక్కడ మార్కులుంటాయి. ఆర్‌ఆర్‌ఆర్‌లోని ‘నాచోనాచో’కి అచ్చంగా స్టెప్పులు దించేశాడు రిషీ. ఇలా ప్రతీ ఎపిసోడ్‌కి తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేసిన రిషీ ప్రేక్షకులు, అభిమానులు, న్యాయనిర్ణేతల్ని మెప్పించి ఆఖరికి విజేతగా నిలిచాడు.

తల్లిదండ్రులకు తను కన్నకొడుకు కాదు.. దత్తత కొడుకని షో మధ్యలో ఉండగానే రిషీకి తెలిసింది. దుఃఖాన్ని దిగమింగుకుంటూనే సాధన చేశాడు.

ఇండియన్‌ ఐడల్‌కి ముందు వందల్లో ఉండే రిషీ ఇన్‌స్టా ఫాలోయర్ల సంఖ్య విజేత అయ్యాక 9.32లక్షలకు చేరింది.

తను సింగర్‌ మాత్రమే కాదు.. పాటలు బాగా రాస్తాడు. ఏఆర్‌ రెహమాన్‌, అరిజీత్‌సింగ్‌లను ఆరాధిస్తాడు. మాధురీ దీక్షిత్‌, రణ్‌బీర్‌ కపూర్‌లకు పెద్ద అభిమాని.

ప్రస్తుతం డెహ్రడూన్‌లోని ఓ కాలేజీలో ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌ థర్డియర్‌ చదువుతున్నాడు.

విజేత కాగానే ‘మొత్తం సంగీత ప్రపంచం, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రజలు నిన్ను చూసి గర్వపడుతున్నార’ంటూ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ రిషీని ప్రశంసించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు