‘కారు’చీకటి చీల్చుకొని..

బాల్యంలో ఓ ప్రమాదం శరబతినాథ్‌ ఆశలపై నీళ్లు చల్లింది. ఆ కుర్రాడి ఎడమకన్ను దెబ్బతింది. అప్పటి నుంచి ఆ కన్ను చూడటం మానేసింది.

Updated : 14 Dec 2022 11:00 IST

వీధిలోకి కారు వస్తే పిల్లలకు ఓ ఆనందం.. బడికెళ్లే దారిలో కారు కనిపిస్తే ఓ ఆరాటం.. ఎప్పుడు పెద్దవాడినవుతానా..? ఎప్పుడు కారు నడుపుతానా..? ఇలాంటి ఆలోచనలు పిల్లలందరికీ సహజం. తమిళనాడు మదురైకి చెందిన 26 ఏళ్ల శిరబతినాథ్‌ కూడా అలా కలలు కన్నవాడే!

కానీ...

బాల్యంలో ఓ ప్రమాదం శరబతినాథ్‌ ఆశలపై నీళ్లు చల్లింది. ఆ కుర్రాడి ఎడమకన్ను దెబ్బతింది. అప్పటి నుంచి ఆ కన్ను చూడటం మానేసింది. అయినా ఆ పిల్లాడు కలత చెందలేదు. బాగా చదువుకున్నాడు. మంచిస్థితికి చేరుకున్నాడు. కారులో తిరిగే స్థాయికి వెళ్లాడు. కానీ, ఒకటే వెలితి. చిన్నప్పటి ముచ్చట ముచ్చటగానే మిగిలిపోతుందని బాధ. కారు నడపాలన్న తన కోరిక నెరవేరదని ఆవేదన. స్నేహితుల సహకారంతో కారు నడపడం నేర్చుకున్నాడు. అయినా ఏం లాభం! అధికారికంగా నడపలేని పరిస్థితి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ రానిదే స్టీరింగ్‌ పట్టుకునే అవకాశం లేదు. అది జరగాలంటే.. నిబంధనలు అడ్డు!
లైసెన్స్‌ కోసం వెళ్తే.. ఒంటికన్ను చూపుతో రాదన్నారు. అయినా ప్రయత్నం ఆపలేదు శరబతినాథ్‌. ఈ క్రమంలో తమిళనాడు రవాణా మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఓ ప్రకటన అతనిలో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఒకే కన్ను చూపు ఉన్నా.. సంబంధిత వైద్య పరీక్షలను పూర్తి చేస్తే.. లైసెన్సుకు అర్హులని దాని సారాంశం. స్నేహితుడి ద్వారా ఈ విషయం తెలుసుకున్న శరబతినాథ్‌. తన సంకల్పం నెరవేర్చుకోవాలనుకున్నాడు. లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో నిబంధనల మేరకు నిర్వహించిన వైద్య పరీక్షలన్నింటిలో ఫస్ట్‌గా పాసయ్యాడు. అధికారుల ముఖాముఖి పరీక్షలో నెగ్గాడు. కారుచీకటి చీల్చుకొని.. అలవోకగా ఎనిమిదంకె వేశాడు. లైసెన్స్‌ పొందాడు. తమిళనాడులో.. ఒకే కన్ను చూపుతో నాలుగు చక్రాల వాహనం డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు.

టి.ప్రభాకర్‌, ఈనాడు డిజిటల్‌, చెన్నై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని