entrepreneur: సేవే లక్ష్యం.. దారులు భిన్నం

సాయం చేయాలనుకునే మనసున్నవాళ్లు చాలామందే ఉంటారు. ఆచరణలోకి దిగేవాళ్లు మాత్రం అతికొద్దిమందే! ఈ ముగ్గురూ ఆ కోవలోకే చెందుతారు.

Updated : 23 Feb 2024 17:02 IST

రూ.లక్షల జీతం వదిలి..

సాయం చేయాలనుకునే మనసున్నవాళ్లు చాలామందే ఉంటారు. ఆచరణలోకి దిగేవాళ్లు మాత్రం అతికొద్దిమందే! ఈ ముగ్గురూ ఆ కోవలోకే చెందుతారు. పోరాట విద్యలు నేర్పుతూ అమ్మాయిల్లో భరోసా కల్పిస్తున్నది ఒకరైతే... సగం సంపాదనని సాయానికే కేటాయిస్తున్న సేవాతత్పరుడు మరొకరు... రూ.లక్షల కొలువు వదిలి రోడ్డు గుంతలు పూడుస్తున్న కార్యోన్ముఖుడు ఇంకొకరు... స్ఫూర్తి పంచే వారి సేవా ప్రయాణం ఇది.

యువత కలలు కనే ఐటీ కొలువు, తన ఈడు కుర్రాళ్లు కుళ్లుకునేన్ని సౌకర్యాలు.. అన్నీ వదిలి ఓ సదాశయానికి కదిలాడు రాంచీ యువకుడు సౌరభ్‌కుమార్‌. నగరాల్లోని రహదారుల్లో ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చడానికి సీరియల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ప్రతాప్‌ భీమసేనరావుతో కలిసి ‘పాట్‌హోల్‌ రాజా’గా మారాడు.

రోడ్డుపై గుంతల కారణంగా నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో బాధితుల్ని చూసి అయ్యో పాపం అనుకుంటాం. ఓసారి ఇలాగే ఓ గొయ్యి కారణంగా ఒక మహిళ కిందపడి దుర్మరణం పాలైంది. అది చూసి తీవ్రంగా చలించిపోయాడు సౌరభ్‌. అప్పటికప్పుడే సిద్ధమై సమీపంలోని ఒక గుంతను ఎంచుకొని.. తనకు తోచిన విధంగా ఇసుక, కంకర, సిమెంటు, తారుతో పూడ్చాడు. అది పూర్తి చేశాక ‘మీరు చాలా మంచి పని చేశారు. దీనివల్ల జనానికి చాలా ప్రయోజనం’ అని ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా సౌరభ్‌కి కృతజ్ఞతలు చెప్పాడు. అది విన్న క్షణం అతడి ఆనందానికి హద్దుల్లేవు. ఉద్యోగం చేస్తూనే మెల్లగా పరిశోధన ప్రారంభించాడు. అప్పటికే ఈ సమస్యపై పని చేస్తున్న విజిటింగ్‌ ప్రొఫెసర్‌, ఇన్వెస్టర్‌ భీమసేన రావు గురించి తెలిసింది. ఇద్దరూ కలిసి మూడేళ్ల కిందట ‘పాట్‌హోల్‌ రాజా’ ప్రారంభించారు. బెంగళూరులోని రోడ్లపై ఒక్క గుంతా కనిపించొద్దు అనే లక్ష్యంతో పని చేయడం ప్రారంభించారు. ఈ అంకుర స్వచ్ఛంద సంస్థ తరఫున ఓ వెబ్‌సైట్‌, యాప్‌ రూపొందించారు. చాలారకాల ప్రయోగాల తర్వాత ఈ గుంతల్ని పూడ్చడానికి ప్రి-మిక్స్‌, ఎకోఫ్రెండ్లీ అస్ఫాల్ట్‌ని తయారు చేశారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారైన ఈ మిశ్రమాన్ని గుంతలు ఉన్నచోట పోసి రోడ్డుతో కలిసిపోయేలా చేస్తారు. ఇదిగాక కొత్తరోడ్లు వేయడానికి రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌తో గ్రిడ్‌మ్యాట్‌లు రూపొందించారు. ఇవి మామూలు సిమెంటు మిశ్రమంతో పోలిస్తే 25శాతం తక్కువ ఖర్చుతోనే తయారవుతాయి.

ఈ పనిలో ఇంకా చేయాల్సింది చాలా ఉందని తెలిశాక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలనుకున్నాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకున్నాడు సౌరభ్‌. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా తనది అప్పటికే ఆరంకెల జీతం. అయినా తృణప్రాయంగా కొలువు వదిలేశాడు. ప్రస్తుతం ఈ సంస్థ తరఫున బెంగళూరు సహా ఇతర పట్టణాల్లో ఐదు వేలకు పైగా గుంతలు పూడ్చారు. వీళ్ల ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు టొయోటో, బోష్‌లు సహకారం అందిస్తున్నాయి. ఈ సామాజిక సేవా దృక్పథాన్ని ఒకవైపు కొనసాగిస్తూనే.. ప్రైవేటు సంస్థలకు రోడ్లు వేయడం, రహదారుల నిర్వహణ ద్వారా దీన్నో సృజనాత్మక బిజినెస్‌ మోడల్‌గా తీర్చిదిద్దారు. ఈ అంకుర సంస్థ మరో ప్రత్యేకత ఏంటంటే.. సమాజంలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్న ట్రాన్స్‌జెండర్లను తమ పనుల్లో భాగస్వాములను చేస్తూ వాళ్లకి సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తున్నారు. ‘దేశంలో చాలామందికి గుంతలను ఎలా పూడ్చాలో కూడా కనీస అవగాహన లేదు. మా
www.potholeraja.com/ వెబ్‌సైట్‌ ద్వారా సమగ్రమైన సమాచారం తీసుకొని తమ తమ ప్రాంతాల్లో మెరుగైన రోడ్లను నిర్మించవచ్చు’ అంటున్న సౌరభ్‌ జాతి నిర్మాణంలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు.


సగం ఆదాయం సేవలకే..

కోటికి పడగలెత్తేవారు ఒకవైపు.. కూటికి గతిలేని పేదలు మరోవైపు. ఎవరో ఒకరు చేయూతనిస్తేనే వారి బతుకులు బాగు పడతాయి. ఆ ఒక్కడి పాత్ర నేనే ఎందుకు పోషించకూడదు అనుకున్నాడు పాపిజెన్ని రామకృష్ణారెడ్డి. ఆ ఆలోచనతోనే ‘వివేకానంద ఫౌండేషన్‌’ ప్రారంభించి రకరకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు.

రామకృష్ణారెడ్డిది కడప జిల్లా తెల్లపాడు. పేదరికం కారణంగా చిన్నప్పట్నుంచీ కష్టాలు అనుభవించిన నేపథ్యం. రైల్వే గేట్‌మ్యాన్‌గా ఉద్యోగంలో స్థిరపడ్డాక తనలాంటి వాళ్లకి సాయపడాలనే ఉద్దేశంతో.. కొందరు స్నేహితులతో కలిసి 2010లో వివేకానంద ఫౌండేషన్‌ ప్రారంభించాడు. అప్పట్నుంచి ఆదాయంలో సగం సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తున్నాడు. ‘చేయూత’, ‘బాసట’, ‘వితరణ’ పేరుతో కార్యక్రమాలు రూపొందించి ఫౌండేషన్‌ ద్వారా సాయం చేస్తున్నాడు. అభాగ్యులను చేరదీయడం, దుప్పట్ల పంపిణీ, పేదలకు ఆర్థిక సాయం, వైద్య సేవలు, నిరుపేద వృద్ధులకు చిన్న ఇళ్లను నిర్మించి ఇవ్వడం.. ఇలాంటివెన్నో చేస్తున్నారు. కరోనా సమయంలోనూ వెలకట్టలేని సేవలు అందించారు. అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంతోపాటు నిత్యావసర సరుకులు అందిస్తూ అండగా నిలిచారు. రక్తదాన, నేత్రదాన శిబిరాలూ నిర్వహించారు.

విద్యావంతులైన పౌరులతోనే మెరుగైన సమాజం ఏర్పడుతుందనే ఉద్దేశంతో గ్రామీణుల కోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ‘బాసట’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రాత పుస్తకాలు, సంచులు, విద్యా సామగ్రి, ప్రతిభావంతులకు నగదు అందించారు. విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కలిగిస్తూ 2,200 మంది విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌ పుస్తకాలను ఉచితంగా అందించారు. యువతలో మానవతా విలువలు పెంపొందించేందుకు వందకుపైగా అవగాహన సదస్సులు నిర్వహించారు.

అనాథల కోసం..

అందరూ ఉన్నవారే ఒక్కోసారి ఒంటరితనంతో బాధ పడుతుంటారు. మరి ఎవరూ లేని అనాథల పరిస్థితేంటి? పైగా వృద్ధాప్యం, రకరకాల రుగ్మతలతో బాధ పడేవారి పరిస్థితి వర్ణనాతీతం. వారి కోసం ఓబులాపురం సమీపంలో దాతల సాయంతో వివేకానంద సేవాశ్రమం నిర్మించారు. అందరూ ఉండి ఆశ్రయం కోరి వచ్చిన అభాగ్యులను సైతం చేరదీస్తున్నారు. తర్వాత వారి కుటుంబ సభ్యులను పిలిచి, కౌన్సిలింగ్‌ ఇచ్చి కొందరిని ఇంటికి పంపిస్తున్నారు.

గ్యార అనిల్‌, ఈజేఎస్‌


అతివలకు అండగా...

అమ్మాయి లపై అత్యా చారాలు, అఘా యిత్యాలు పెచ్చరిల్లుతున్న కాలమిది. వాళ్లని వాళ్లు కాపాడుకోవాలంటే కర్రసాము, కత్తిసాములాంటి పోరాట విద్యలు నేర్చుకోవాల్సిం దేనంటున్నాడు కడప యువకుడు జయచంద్ర. ఒకవైపు సాయం చేస్తూనే అంతరించిపోతున్న ఆ కళను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు.

యచంద్ర తండ్రి కర్రసాము నిపుణుడు. ఆయన ప్రోత్సాహంతో మూడోతరగతి నుంచే తానూ నేర్చుకోవడం మొదలు పెట్టాడు. క్రమం తప్పకుండా సాధన చేసేవాడు. డిగ్రీలో ఓసారి ఎన్‌సీసీ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆ వేదికపై కర్రసాము, కత్తిసాముని ప్రదర్శించడంతో అందరూ శెభాష్‌ అన్నారు. అప్పట్నుంచి అవకాశం వచ్చిన ప్రతిచోటా తన ప్రతిభ నిరూపించుకుంటూనే ఉన్నాడు. అయితే తనకి పేరొచ్చినా ఈ విద్యను పదిమందికి నేర్పించినప్పుడే అసలైన ప్రయోజనం అని భావించాడు. ముఖ్యంగా ఆడపిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్న తరుణంలో వాళ్ల ఆత్మరక్షణ కోసం ఈ పోరాట విద్యలు బాగా ఉపయోగపడతాయని భావించాడు. నేర్చుకోవడానికి ఎవరైనా తన దగ్గరికి వస్తే ఉచితంగా శిక్షణనివ్వసాగాడు. కొన్ని కళాశాలలకు తనంతట తానే వెళ్లి ట్రైనింగ్‌ ఇస్తున్నాడు. కడప ఎస్పీ కోరిక మేరకు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శన కోసం పదహారు మంది మహిళా పోలీసులకు పోరాట విద్యల్లో మెళకువలు నేర్పించాడు. ‘వీరసింహారెడ్డి’ చిత్ర ఆడియో లాంచ్‌లో తన ప్రతిభ ప్రదర్శించి అందరి మెప్పు పొందాడు.  విజయవాడలో ఇటీవల జరిగిన యూత్‌ ఫెస్టివల్‌లోనూ ఆకట్టుకున్నాడు. ‘అంతరించి పోతున్న ఈ కళని కాపాడుతూనే మహిళలకు ఆత్మస్థైర్యం పెరిగేలా చేయాలన్నదే నా లక్ష్యం’ అంటున్నాడు జయచంద్ర.

సుంకి శ్రావణి, ఈజేఎస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని