Cement Free Homes: సిమెంట్‌ లేని ఇళ్లు.. ఈ జంట ప్రతిభకి ఆనవాళ్లు

సిమెంట్‌ లేకుండా చిన్న నిర్మాణాన్నీ ఊహించలేం. అలాంటిది పుణె యువ జంట ధ్రువంగ్‌ హింగ్‌మైర్‌, ప్రియాంక గుంజికార్‌ ఏకంగా ఫామ్‌హౌజ్‌లు, బహుళ అంతస్తుల బంగ్లాలే నిర్మిస్తున్నారు. ఏసీ అమర్చినట్టు లోపల చల్లచల్లగా ఉండటం వీటి మరో ప్రత్యేకత.

Updated : 08 Apr 2023 11:46 IST

సిమెంట్‌ లేకుండా చిన్న నిర్మాణాన్నీ ఊహించలేం. అలాంటిది పుణె యువ జంట ధ్రువంగ్‌ హింగ్‌మైర్‌, ప్రియాంక గుంజికార్‌ ఏకంగా ఫామ్‌హౌజ్‌లు, బహుళ అంతస్తుల బంగ్లాలే నిర్మిస్తున్నారు. ఏసీ అమర్చినట్టు లోపల చల్లచల్లగా ఉండటం వీటి మరో ప్రత్యేకత.

ధ్రువంగ్‌, ప్రియాంకలు మామూలు వ్యక్తులేం కాదు. ముంబయిలో నెలకి లక్షల జీతం అందుకునే పేరున్న ఆర్కిటెక్ట్‌లు. వందల ఇళ్లకు డిజైన్‌ చేసిన అనుభవం ఉంది. ఓసారి మహారాష్ట్రలోని ఓ మారుమూల పల్లెకు వెళ్లినప్పుడు అక్కడ ఒక మహిళ మట్టితో సొంతంగా చిన్న ఇంటిని నిర్మించుకోవడం గమనించారు. గోడలు దృఢంగా ఉండటానికి ఆమె మట్టిలో చేతిగాజులు కలిపానని వాళ్లతో చెప్పింది. ఆ మాట వాళ్లలో ఆసక్తి రేపింది. తమకున్న అనుభవంతో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి అనుకున్నారు. రకరకాల ప్రయోగాలు చేసి.. మట్టి, ఇసుక, సున్నం మిశ్రమంతో సిమెంటుకి ప్రత్యామ్నాయం రూపొందించారు. ఇటుకలు, బురద, నాపరాయి, బ్లాక్‌స్టోన్‌, స్థానికంగా దొరికే కలప, మట్టిపెంకులతో పుణెకి సమీపంలోని కమ్షెట్‌లో ఒక ఇంటిని నిర్మించారు. పునాది తీయడం నుంచి కప్పు వేయడం వరకు ప్రతి దశలో ప్రయోగాలు చేశారు. అతి తక్కువ ఖర్చయ్యే ప్రణాళికలు అమలు పరిచారు. మామూలు కూలీలకు బదులు స్థానిక చేతి వృత్తి నిపుణులను ఈ పనిలో భాగస్వాములను చేశారు. దాంతో ఈ సరికొత్త నిర్మాణం పూర్తవడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. సిమెంట్‌ పూర్తిగా వాడకపోవడం, సహజంగా గాలి ప్రసరించేలా డిజైన్‌ ఉండటంతో ఇంటి లోపల ఉష్ణోగ్రత బయటికన్నా పది నుంచి పదిహేను డిగ్రీలు తక్కువగా ఉంటుంది. దీంతో ఏసీలు, ఫ్యాన్ల అవసరమే ఉండదు. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవడంతో మామూలు ఇంటితో పోల్చుకుంటే సగం ఖర్చుతోనే నిర్మాణం పూర్తైంది. మొదటి ప్రాజెక్టు సూపర్‌ సక్సెస్‌ కావడంతో ఆ ఉత్సాహంతో మరో ఆరు ఇళ్లను నిర్మించిందీ జంట. ఇంకొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ పూర్తి సమయాన్ని ఈ సృజనాత్మక ఇళ్ల నిర్మాణం కోసమే కేటాయిస్తున్నారు. మంచి హోదా, లక్షల జీతం వదులుకొని ఈ పని ఎందుకు చేస్తున్నారు అని ఎవరైనా అడిగితే.. ‘దీన్ని మేం త్యాగంలా భావించడం లేదు. ప్రకృతితో మమేకం అవుతూ.. పర్యావరణానికి మేలు కలిగించేలా మేం చేస్తున్న ప్రయత్నం మాకు అంతులేని ఆనందాన్ని ఇస్తోంది. ఈ పనిని గర్వంగా, గౌరవంగా భావిస్తున్నాం’ అంటారిద్దరూ. సృజనాత్మకత, సమాజహితాన్ని సమ్మిళితం చేసి ముందుకు సాగుతున్నారు కాబట్టే అంతర్జాలంలో వీళ్ల పేరు మార్మోగిపోతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని