భారతి.. హక్కుల సారథి
కడుపులో ఉన్నప్పుడే కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. ఆ పద్మవ్యూహం ఛేదించి బయటికొస్తే రాబంధువులు చిదిమేయాలని చూశారు. అన్ని వెతల్ని దాటుకుంటూ ఇప్పుడు తనలాంటి బాధితులకు అండగా నిలుస్తోంది. ఇప్పటికి పదహారు వందల బాల్య వివాహాలను అడ్డుకొని వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపింది. తనే రాజస్థాన్ యువతి కృతిభారతి. ఈమధ్యే ప్రతిష్ఠాత్మక ‘ప్రపంచ యువ హక్కుల కార్యకర్త’ పురస్కారం అందుకుంది. ఈ మొత్తం ప్రయాణాన్ని ‘ఈతరం’తో పంచుకుంది.
మాది జోధ్‌పూర్. అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేను ఆడపిల్లనని తెలిసి అమ్మను వదిలేశాడు నాన్న. నెలలు నిండక పుట్టడంతో నాకు తరచూ ఆరోగ్య సమస్యలు వచ్చేవి. ఎక్కడ నా బాధ్యత మోయాల్సి వస్తుందోనని పదేళ్లు ఉన్నప్పుడు బంధువులు నాపై విషప్రయోగం చేశారు. దాంతో రెండేళ్లు మంచానికే పరిమితమయ్యా. అమ్మే కంటికిరెప్పలా కాపాడుకోవడంతో రెండేళ్లయ్యాక నడవగలిగా. అలా నాలుగో తరగతిలో ఆగిపోయిన నా చదువుని మళ్లీ మొదలు పెట్టా. తర్వాత పట్టుదలతో న్యాయవిద్య చదివా. సైకాలజీలో పీహెచ్‌డీ చేశా.
కదిలించిన సంఘటన
డిగ్రీలో ఉన్నప్పటి నుంచే స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేసేదాణ్ని. రాజస్థాన్‌లో బాల్య వివాహాలు ఎక్కువ. చాలా కుటుంబాల్లో అమ్మాయిల్ని పసివయసులోనే చాలా పెద్ద వయసు వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తుంటారు. 15 ఏళ్లు దాటాక అత్తారింటికి పంపుతారు. దీన్ని ‘ముక్లవా’ అంటారు. ‘మా అత్తారింటివాళ్లు అస్సలు మంచివాళ్లు కాదు. నా ముక్లవాని వాయిదా వేయాల’ని అర్థించిందో అమ్మాయి ఓసారి. తర్వాతైనా వెళ్లాల్సిందేగా! అసలు ఈ బాల్య వివాహాలే పూర్తిగా రద్దు కావాలనే ఆలోచన వచ్చింది అప్పుడు. ఆ ఉద్దేశంతో ‘సారథి’ అనే స్వచ్ఛంద సంస్థను పదేళ్ల క్రితం ప్రారంభించా. ఆ సమయంలో ‘2006 బాల్య వివాహ వ్యతిరేక చట్టం’ నాకు బ్రహ్మాస్త్రంలా అనిపించింది. మొత్తానికి ఆ అమ్మాయి తరపున పోరాడి విజయం సాధించా. ఒక బాల్య వివాహం చట్టపరంగా రద్దు కావడం దేశంలోనే మొదటిసారి కావడంతో అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఈ సంఘటనని తర్వాత సీబీఎస్‌ఈలో పాఠ్యాంశంగా చేర్చారు. ఇదే ఊపుతో 1,600 బాల్య వివాహాలు ఆపి, 47 రద్దు చేయించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాను. ఈ క్రమంలో ‘నిన్ను రేప్ చేస్తాం.. చంపేస్తాం’ అంటూ చాలా బెదిరింపులొచ్చాయి. కొన్నిసార్లు కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు. తప్పుడు కేసులు పెట్టారు. అయినా నేను వెనక్కి తగ్గలేదు. వీటితోపాటు బాలికలు, అత్యాచార బాధితులు, మహిళల పునరావాస కేంద్రం ఏర్పాటు చేశాం. అందులో నలభై మంది ఆశ్రయం పొందుతున్నారు.
గుర్తింపు..
ఈ డిసెంబరు 10న అంతర్జాతీయ హక్కుల దినోత్సవం సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ‘గ్లోబల్ యూత్ హ్యూమన్ రైట్స్’ అవార్డు అందుకున్నా. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ముగ్గురికే ఈ పురస్కారం అందించారు. మనదేశం నుంచి ఎంపికైంది నేనొక్కదాన్నే. ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో కూడా ‘యువరత్న’ అనే పురస్కారం అందుకున్నా. ఇతర అవార్డులు, గుర్తింపు, ప్రశంసలు చాలానే వచ్చాయి. వీటన్నింటికన్నా ఒక అమ్మాయిని రక్షించినపుడు ఆమె ముఖంలో చూసే చిరునవ్వే ఎక్కువ సంతోషం కలిగిస్తుంది.
గుండు పాండురంగశర్మ, వరంగల్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Manchu Manoj: ట్విటర్ వేదికగా మంచు మనోజ్ ట్వీట్స్.. విష్ణును ఉద్దేశించేనా?
-
Sports News
World Boxing Championship: మహిళల బాక్సింగ్ ప్రపంచకప్‌లో నీతూకు స్వర్ణం
-
Politics News
KTR: తెలంగాణ రాష్ట్రం దేశానికే పాఠాలు నేర్పుతోంది: కేటీఆర్
-
India News
BJP: ‘అదానీతో సంబంధం లేదు.. కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే..!’
-
India News
Corona Virus: కరోనా కలవరం.. కేంద్రం మార్గదర్శకాలు
-
Movies News
Naatu Naatu Song: ‘నాటు నాటు’ కేవలం ఫాస్ట్ బీట్ మాత్రమే.. అవార్డు వస్తుందనుకోలేదు: కీరవాణి