Ramesh Eligeti: నా బలం.. బలగం.. మా అమ్మే!
ఒక సినిమాకి జన్మనిచ్చేది కథా రచయిత.. ఆ కథకుడిని ఈ భూమ్మీదికి తీసుకొచ్చేది అమ్మ. తన ఊహలకి రెక్కలిచ్చి.. ప్రేక్షకుడి మనసులు గెలిచేలా రాసేది రైటర్... అతడి తలరాత రాసి.. జీవితాన్ని తీర్చిదిద్దేది ఓ మాతృమూర్తి.
ఒక సినిమాకి జన్మనిచ్చేది కథా రచయిత.. ఆ కథకుడిని ఈ భూమ్మీదికి తీసుకొచ్చేది అమ్మ. తన ఊహలకి రెక్కలిచ్చి.. ప్రేక్షకుడి మనసులు గెలిచేలా రాసేది రైటర్... అతడి తలరాత రాసి.. జీవితాన్ని తీర్చిదిద్దేది ఓ మాతృమూర్తి. ‘బలగం’తో మనసుని కదిలించే కథ అల్లిన రమేశ్ ఎలిగేటి విజయం వెనకా ఓ అమ్మే ఉంది. రేపు మాతృ దినోత్సవం సందర్భంగా.. అమ్మతో తనకున్న అనుబంధం గురించి అతడి మాటల్లోనే...
‘బలగం’కి కథే అసలైన బలం అని మెచ్చుకుంటూ ఇప్పటికీ నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. కానీ మా అమ్మే లేకపోతే నా కథ మీదాకా వచ్చేదే కాదు. ఆ మాటకొస్తే.. నా బలం, బలగం ఆమేనని చెబుతాను. మా అమ్మ పేరు భూదేవి. పేరుకి తగ్గట్టే.. ఆమెకి భూదేవంత ఓర్పు. మా ఊరు మంచిర్యాల జిల్లా మందమర్రి. నాన్న సింగరేణిలో మజ్దూర్ వర్కర్‌గా పని చేసేవారు. అది కూలి పని లాంటిదే. నాకు ఎనిమిది, తమ్ముడికి ఐదేళ్ల వయసున్నప్పుడు ఆయన చనిపోయారు. నాన్న పని అమ్మకిచ్చారు. అమ్మది చిన్నవయసే అయినా.. బంధువులు ఎంతోమంది చెబుతున్నా.. మా కోసం మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కానీ భర్త చనిపోయిన ఒంటరి మహిళగా, ఏ తోడూ లేక ఎన్నో కష్టాలు అనుభవించింది. అవన్నీ మాకోసమేనని తెలుసు.
నాపై ఎంతో నమ్మకం
ఎందుకో తెలియదు చిన్నప్పట్నుంచీ సినిమాలంటే నాకు విపరీతమైన అభిమానం. మూడేళ్లు ఉద్యోగం చేశాక అటువైపు వెళ్లాలనుకున్నా. బంధువులు, సన్నిహితులు వద్దన్నారు. అమ్మ కూడా కొంచెం బాధ పడ్డా.. నేను మంచి పనే చేస్తానని పూర్తి నమ్మకం ఉండేది. ‘నీకు నచ్చింది చెయ్.. కానీ అది ఎవరినీ నొప్పించకుండా ఉండాలి’ అని చెప్పింది. దానికితోడు నా భార్య సహకారం ఉండటంతో ఉద్యోగం మానేసి ధైర్యంగా వచ్చేశాను. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ‘గోల్కొండ హైస్కూల్’ సినిమాకి సహాయ దర్శకుడిగా చేశాను. అక్కడే ప్రొడక్షన్, ప్రి ప్రొడక్షన్ సహా పలు విభాగాల్లో మెలకువలు నేర్చుకున్నా. తర్వాత ‘ఉయ్యాల జంపాల’, ‘పిట్టగోడ’, ‘నరుడా డోనరుడా’ చిత్రాలకు పనిచేశా.
అప్పులు చేసి మరీ..
అమ్మకి చదువు రాదు. అయినా చదువు విలువ బాగా తెలుసు. బాగా చదివితేనే బతుకు మారుతుందని చెప్పేది. అప్పులు తెచ్చిమరీ మమ్మల్ని మంచి స్కూళ్లు, కాలేజీల్లో చేర్పించింది. అవీ తీరేదాకా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడింది. ఓయూలో నా ఇంజినీరింగ్ పూర్తవగానే టీసీఎస్‌లో మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. అప్పుడు తనని పని మానెయ్యమని అడిగా. ‘నా శక్తి ఉన్నంతవరకూ నా కాళ్లపై నేను నిలబడతా. ఒకరిపై ఆధారపడటం నాకు నచ్చదు’ అని చెప్పింది.
ఇలా కుదిరింది..
దర్శకుడిగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న సమయంలో ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ ద్వారా జబర్దస్త్ వేణు పరిచయం అయ్యాడు. మా ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉండటంతో కలిసి పని చేయాలనుకున్నాం. వేణు దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటే నేను కథా విస్తరణ, స్క్రీన్‌ప్లేతోపాటు మరో రచయిత నాగరాజు మడూరితో కలిసి మాటలు రాశాను. పుస్తకాలతోపాటు మనుషులు, సమాజాన్ని బాగా చదివే అలవాటుండేది నాకు. అదే కథ బాగా రాయడానికి దోహదపడింది. దీంతోపాటు ‘ఎంత తిట్టుకున్నా.. కొట్టుకున్నా.. రక్త సంబంధీకులు కలిసే ఉండాలి. వాళ్లే బలం, బలగం..’, ‘తెల్లవారి లేస్తే మొహం చూసేవాళ్లతో మనం అసలు గొడవ పడొద్దు’ అని అమ్మ తరచూ చెప్పే మాటలు నాకు బాగా గుర్తుండేవి. ఇలాంటివన్నీ నా కథ, సంభాషణల్లో ఎక్కడో ఒకచోట చెప్పే ప్రయత్నం చేశాను. సినిమా ప్రతి ఫ్రేములోనూ అమ్మ ప్రభావం కనిపిస్తుంటుంది. నా తొలి సినిమాతోనే ఇంత పేరు రావడంలో ఆమెది కీలక పాత్ర. మా అమ్మ అనే కాదుగానీ ప్రపంచంలోని ప్రతి తల్లీ గొప్ప వ్యక్తే. వాళ్లందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
సతీష్, ఈటీవీ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TTD: గరుడ వాహనంపై మలయప్పస్వామి.. భక్త జనసంద్రంగా తిరుమల
-
Manchu Lakshmi: నా సంపాదన.. నా ఖర్చు.. మీకేంటి నొప్పి: మంచు లక్ష్మి ట్వీట్
-
Antilia Case: అంబానీని భయపెట్టేందుకే.. ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు!
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి
-
Jagadish Reddy: సూర్యాపేటలో 26న ఐటీ జాబ్ మేళా: జగదీశ్‌రెడ్డి