Thouti Eshwar: కూలి పనుల శాస్త్రవేత్త

కూలి పనులకెళ్తూ అక్షరాలు దిద్దాడు... ఒంటిపూట తింటూనే గొప్పగా చదివాడు... తాపీ పనులు చేస్తూనే భవిష్యత్తు నిర్మించుకున్నాడు... అన్ని కష్టాలూ దాటి శాస్త్రవేత్తగా ఎదిగాడు... తనే తౌటి ఈశ్వర్‌.

Updated : 01 Apr 2023 03:23 IST

కూలి పనులకెళ్తూ అక్షరాలు దిద్దాడు... ఒంటిపూట తింటూనే గొప్పగా చదివాడు... తాపీ పనులు చేస్తూనే భవిష్యత్తు నిర్మించుకున్నాడు... అన్ని కష్టాలూ దాటి శాస్త్రవేత్తగా ఎదిగాడు... తనే తౌటి ఈశ్వర్‌.

ఈశ్వర్‌ తండ్రి ఇంటింటికీ తిరిగి కట్టెలమ్మితే వచ్చే అరకొర ఆదాయమే తన కుటుంబానికి ఆధారం. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన కుర్రాడు ఐఐటీలో చదివి మంచి శాస్త్రవేత్తగా ఎదుగుతాడని ఎవరూ ఊహించి ఉండరు. దాన్నే సుసాధ్యం చేసి చూపించాడు ఈశ్వర్‌.

నేపథ్యం

ఆదిలాబాద్‌ జిల్లా ఫకీర్‌గుట్టవీధి ఈశ్వర్‌ సొంతూరు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలోనే చదువు సాగింది. ప్రతి తరగతిలోనూ ఫస్ట్‌క్లాసే. ఇదీగాక సెలవు రోజుల్లో కన్నవాళ్లకు సాయపడేందుకు కూలి పనులకెళ్లేవాడు.

చదువుతూనే పని

ఎంసెట్‌, జేఈఈ రాసి మంచి కాలేజీలో ఇంజినీరింగ్‌ చేయాలనేది ఈశ్వర్‌ ఆశ. శిక్షణ తీసుకోవడానికే కాదు.. కనీసం పుస్తకాలూ కొనలేని పరిస్థితి తనది. చేసేదేం లేక ఆదిలాబాద్‌లో ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాడు. చదువుకుంటూనే తాపీ మేస్త్రీ పనులకెళ్లాడు. మంచి ర్యాంకుతో ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో చేరాడు. ఆపై ఎంతోమంది కలలుగనే ప్రతిష్ఠాత్మక దిల్లీ ఐఐటీలో ప్రవేశం సంపాదించాడు. ఎనర్జీ సైన్స్‌లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు. 

శాస్త్రవేత్తగా

పీహెచ్‌డీ పూర్తవగానే 2016లో సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జూనియర్‌ శాస్త్రవేత్త ఉద్యోగానికి ఎంపియ్యాడు. రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న ఈ ఇన్‌స్టిట్యూట్‌కి కంప్యూటర్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగించే సెమీకండక్టర్లు, చిప్‌ల తయారీ, అభివృద్ధి, పరిశోధనల్లో దేశవ్యాప్తంగా మంచి పేరుంది. కొలువులో చేరిన కొన్నాళ్లకే ఫ్లెక్సిబుల్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో సోలార్‌ సెల్స్‌, ఎలక్ట్రానిక్‌ స్కిన్‌ ఉత్పత్తుల పరిశోధనలో కీలక పాత్ర పోషించాడు ఈశ్వర్‌. ఇతర శాస్త్రవేత్తలతో కలిసి సెమీ కండక్టర్‌ డివైజెస్‌, ఐసీ చిప్స్‌ ఆవిష్కరణలో చేసిన పరిశోధనలు విజయవంతం కావడంతో 2020లో సీనియర్‌ సైంటిస్ట్‌గా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం అక్కడే సైన్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ స్కిన్‌, నానో టెక్నాలజీ అంశాలపై పరిశోధనలు చేస్తున్నాడు.
రహీమొద్దీన్‌, ఉట్నూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని