Happy life secrets: జపాన్‌ బాటలో.. సంతోషాల వేట!

‘మేడ్‌ ఇన్‌ జపాన్‌’ పదం వింటేనే కుర్రకారులో ఓ వైబ్రేషన్‌. వాచీల నుంచి గ్యాడ్జెట్ల దాకా జపాన్‌లో తయారైన ప్రతీదీ ఇష్టపడతారు.

Published : 22 Jun 2024 01:35 IST

‘మేడ్‌ ఇన్‌ జపాన్‌’ పదం వింటేనే కుర్రకారులో ఓ వైబ్రేషన్‌. వాచీల నుంచి గ్యాడ్జెట్ల దాకా జపాన్‌లో తయారైన ప్రతీదీ ఇష్టపడతారు. మరలాంటప్పుడు జపాన్‌ వాళ్లు సంతోషం, మానసిక ప్రశాంతత కోసం అనుసరించే పద్ధతులు పాటించకపోతే ఎలా?

వాబీ-సాబీ

ఇది ఒక జపనీస్‌ తత్వం. చెడులో కూడా మంచి చూడటమే ఇందులోని పరమార్థం. మార్పు, వైఫల్యం, ఓటమి, మరణం.. ఇలా ప్రతీ దాన్ని అంగీకరించాలి. ఓటమి తప్పదని తెలిసినప్పుడు హుందాగా అంగీకరించడం.. తప్పును ఒప్పుకోవడం.. గుండెలోంచి బరువును దించేస్తుంది. దాన్ని స్వాగతించినప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు.

ఇకిగాయ్‌

ఇది జగమెరిగిన కాన్సెప్ట్‌. ప్రతి వ్యక్తీ ఈ భూమ్మీదకి రావడానికి ఒక కారణం, ప్రయోజనం ఉంటుంది. అది తెలుసుకోవాలి. ప్రతి పనిలో ఆనందం వెతుక్కోవాలి. విలువలు పాటించాలి. చెడును పరిహరించాలి. మంచికి చోటివ్వాలి. ప్రతిరోజుకీ జీవితంలో అర్థం ఉండాలి. ఇకిగాయ్‌ తోడుంటే ఆనందం మీ వెంటే అన్నట్టుగా ఈ కాన్సెప్ట్‌ ప్రతిరోజునీ సంతోషమయం చేస్తుంది. 

కింత్సుగి

విరిగిన వాటిని అతికించడం ఈ కాన్సెప్ట్‌ ఉద్దేశం. అది ఇంట్లోని వంట పాత్రలు కావచ్చు. అందమైన ప్రతిమలు కావచ్చు. ఆ ముక్కలను బంగారం, వెండి, ప్లాటినమ్‌ పూతలు, గమ్‌లతో కలిపి అతికించి ప్రదర్శనకు ఉంచాలి. ఇందులో ఒక నిగూఢార్థం ఉంది. ప్రతి మనిషికీ మనసు ఎన్నోసార్లు ముక్కలవుతుంది. ఎన్నో అవలక్షణాలు, వైఫల్యాలు ఉంటాయి. ఎవరూ నూటికి నూరుశాతం కరెక్ట్‌ కాదు. ఆ లోపాలకు మరమ్మతు చేయాలి. ఉపశమనం పొందాలనే విషయం తెలియజేస్తుంది.

షిన్‌రిన్‌-యోకు

ఈ కాన్సెప్ట్‌ ప్రకృతి ఒడిలోకి వెళ్లడం. ఆ అడవిలో రణగొణధ్వనులు ఉండవు. పక్షుల కిలకిలరావాలు వినిపిస్తాయి. ప్రకృతిని ముద్దాడొచ్చు. వీలైతే అక్కడి సెలయేటిలో స్నానం చేయాలి. ప్రశాంతంగా గడపాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి, రక్తపోటు తగ్గడమే కాదు.. అప్పటికప్పుడే మూడ్‌ మారిపోతుందని చాలా అధ్యయనాల్లో నిరూపితమైంది కూడా. 

మోనో నో అవేర్‌

ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరి హడావుడి వారిది. ఈ విధానం మారాలన్నదే ‘మోనో నో అవేర్‌’. ఇది చుట్టూ ఉన్న సమాజం, ప్రపంచాన్ని పట్టించుకొమ్మంటుంది. నాది, నేను అనే స్వార్థభావాన్ని విడనాడా లంటుంది. అవసరాల్లో ఉన్నవారికి సాయం చేయడం అనే మంచి మాటను తెలియజేస్తుంది. ఈ పని చేసినప్పుడు మానసిక ప్రశాంతత కలగడం సహజమే కదా! 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు