Published : 31 Dec 2022 01:11 IST

ఆకట్టుకున్నారు.. కనికట్టు చేశారు!

మాటతోనో, ఆటతోనో, నడకతోనో, నడతతోనే.. ఆకట్టుకొని మెరిసినవాళ్లు ఎందరో.. అందులోంచి ముచ్చటగా ఈ ముగ్గురు..


జగం మెచ్చిన మెస్సియ్య

పదిహేడేళ్ల తర్వాత అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన సిసలైన విజేత లయోనల్‌ మెస్సీ గురించి చెప్పుకోకుండా ఈ ఏడాదిని ముగించలేం. పేద కుటుంబంలో పుట్టి.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని.. వైకల్యాన్ని జయించి.. ఫుట్‌బాల్‌ ఆణిముత్యంగా ఎదిగాడు మెస్సి. వరుస ఓటములతో కుంగిపోయి ఒకానొక సందర్భంలో ఆటకే గుడ్‌బై చెప్పినా... అభిమానుల ఒత్తిడితో తిరిగి మైదానంలోకి వచ్చి రెచ్చిపోయాడు. ఆటలోనే కాదు.. పోటీదారులను గౌరవించడంలో.. సమాజాన్ని ప్రేమించడంలో.. అభిమానులకు స్ఫూర్తినివ్వడంలో మేటి అనిపించుకున్న ఇతగాడ్ని పలు పత్రికలు, మ్యాగజైన్లు.. ‘స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా కీర్తించాయి.


స్టైల్‌ రాణి.. జాన్వీ

పట్టుమని పది సినిమాలు చేయకపోయినా ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది జాన్వీ కపూర్‌. తను ఈ ఏడాది నటించిన ‘గుడ్‌లక్‌ జెర్రీ’, ‘మిలీ’ సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. అన్నింటికన్నా ముఖ్యంగా అభిమానులు, ఫ్యాషన్‌ పండితుల నుంచి ‘స్టైలిష్‌ స్టార్‌’ అని పొగడ్తలు అందుకుంది. సంప్రదాయం, ఆధునికం, కొత్త ట్రెండ్‌, పార్టీ, సినిమా కార్యక్రమం... సందర్భం ఏదైనా తనలో సొగసు ఉట్టిపడాల్సిందే. తన ఇన్‌స్టా ఖాతా తెరిస్తే.. తనెంత స్టైలిష్‌నో అర్థమవుతుంది.


మిస్టర్‌ 360.. సూర్యకుమార్‌ యాదవ్‌

చేతిలో ఉన్నది క్రికెట్‌ బ్యాటా.. మంత్రదండమా? అన్నట్టుగా ఈ ఏడాది చెలరేగిపోయాడు సూర్యకుమార్‌ యాదవ్‌. ముఖ్యంగా టీ20 పొట్టి క్రికెట్‌లో అతడు చెలరేగిపోయిన తీరు నభూతో... 2022లో 47 సగటుతో 1,164 పరుగులు చేసి రెండో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. పవర్‌ హిట్టింగ్‌, 360 డిగ్రీ కోణంలో బ్యాటింగ్‌.. అతడి శైలి. క్రికెట్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌గా వారసుడిగా పేరొందిన సూర్య ఈ ఏడాది అత్యధిక సిక్స్‌లు (68) బాదాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు