Published : 18 Mar 2023 00:13 IST

వన్నెల వ్యాఖ్యానం.. అలా ఆస్కారం

నింగిలోని చుక్కల్లాంటి సినీ తారలంతా ఒక్కచోటికి చేరిన వేళ.. మిరుమిట్లు గొలిపే వెలుగు జిలుగుల వేదిక.. ప్రపంచమంతా కళ్లప్పగించి చూసే వేడుక.. ఆస్కార్‌ ప్రదానోత్సవం. ఇంత ముఖ్యమైన సంరంభానికి వన్నెల వ్యాఖ్యానం జోడైనప్పుడే.. కార్యక్రమం మరింత రక్తి కడుతుంది. సభికుల్లో ఉత్సాహం చెలరేగుతుంది. కానీ మాటలతో కనికట్టు చేస్తూ.. ఒడుపుగా పంచ్‌లు విసురుతూ.. విజేతల్ని ఆకాశానికి ఎత్తేసేలా.. అందరి ముందు గళంతో మాయ చేయడం అంటే మాటలు కాదు. ఈ వ్యాఖ్యాత అవకాశం అంటే.. ఆస్కార్‌ దక్కినంత గొప్ప కాదుగానీ.. ఇదీ ఓ అరుదైన గుర్తింపే. ఈసారి అకాడెమీ వేడుకల్లో తన వన్నెల వ్యాఖ్యానంతో ఆకట్టుకుంది మన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె. ఏడేళ్లు వెనక్కి వెళ్తే.. ప్రియాంకా చోప్రా సైతం తన మాటలతో వేదికపై సందడి చేసింది. వీళ్లిద్దరి కన్నా ముందు వ్యాఖ్యాతగా మెప్పించిన మన నటి పెర్సిస్‌ ఖంభట్టా. ఆకర్షణీయమైన అందం.. ఆకట్టుకునే మాట తీరుతోపాటు చెప్పలేనంత ఫేం ఉన్నప్పుడే.. ఎవరికైనా ఈ ప్రతిష్ఠాత్మకమైన పాత్ర దక్కుతుంది. ప్రస్తుతం దీపిక బాలీవుడ్‌లో టాప్‌ కథానాయిక. ఈమధ్యే తను నటించిన ‘పఠాన్‌’ వసూళ్లతో దూసుకెళ్తోంది. అంతకుముందు ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌లో వరుస సినిమాలు, రియాలిటీ షోలతో ఉన్నప్పుడే అవకాశం వరించింది. మిస్‌ ఇండియాగా మురిపించిన పెర్సిస్‌కీ ఆస్కార్‌ వేదికపై హోస్ట్‌గా వ్యవహరించే ఛాన్స్‌ వచ్చింది. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలూ అరుదైన సందర్భాన్ని తమకు అనుకూలంగా మలచుకొని సినీ జగత్తుని మెప్పించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు