Dolly Chaiwala: సెలబ్రి‘టీ!’

సెలెబ్రిటీ కనిపిస్తే.. అంతా సెల్ఫీలు తీసుకుంటారు. కానీ ఏ సెలెబ్రిటీ అయినా అతడితో సెల్ఫీ దిగాల్సిందే! వెకేషన్‌కి వెళ్తే ఎవరైనా అక్కడి అందాల్ని ఆస్వాదిస్తారు. అతగాడు విహారయాత్రకు వెళ్లినా.. జనమంతా అతడి చుట్టు మూగాల్సిందే! అంతలా అందర్నీ ఆకర్షిస్తున్న అతగాడే డాలీ చాయ్‌వాలా! చదివింది మూడు.. నడిపేది టీకొట్టు.. సంపాదనేమో నెలకి అక్షరాలా రూ.10లక్షలు పైనే! అంతర్జాలం తాజా సంచలనంగా మారిన డాలీ గురించి తెలుసుకోవాల్సిన సంగతులివి.

Updated : 22 Jun 2024 05:35 IST

సెలెబ్రిటీ కనిపిస్తే.. అంతా సెల్ఫీలు తీసుకుంటారు. కానీ ఏ సెలెబ్రిటీ అయినా అతడితో సెల్ఫీ దిగాల్సిందే! వెకేషన్‌కి వెళ్తే ఎవరైనా అక్కడి అందాల్ని ఆస్వాదిస్తారు. అతగాడు విహారయాత్రకు వెళ్లినా.. జనమంతా అతడి చుట్టు మూగాల్సిందే! అంతలా అందర్నీ ఆకర్షిస్తున్న అతగాడే డాలీ చాయ్‌వాలా! చదివింది మూడు.. నడిపేది టీకొట్టు.. సంపాదనేమో నెలకి అక్షరాలా రూ.10లక్షలు పైనే! అంతర్జాలం తాజా సంచలనంగా మారిన డాలీ గురించి తెలుసుకోవాల్సిన సంగతులివి.

ఏప్రిల్లో అపర కుబేరుడు బిల్‌గేట్స్‌ భారత్‌ వచ్చారు. ‘వన్‌ చాయ్‌’ అని డాలీని అడిగి మరీ గరమ్‌గరమ్‌ చాయ్‌ తాగారు. ఆ వీడియో బాగా వైరల్‌ అయ్యింది. తర్వాత డాలీ విమానంలో టూరుకెళ్తుంటే.. ఓ బాలీవుడ్‌ స్టార్‌ స్వయంగా వచ్చి డాలీతో ఫొటోలు దిగాడు. ఆపై మాల్దీవుల్లో విమానం దిగగానే సముద్రం ఒడ్డున ఓ టీకొట్టు తెరిచాడు. అతడితో ఫొటోలకు జనం ఎగబడ్డారు. ఇంతేనా.. దుబాయ్, మలేసియా, సింగపూర్‌.. ఎక్కడికెళ్లినా అతడికి అభిమానులు కోకొల్లలు. ఫంకీ డ్రెస్, రంగు రంగుల కళ్లద్దాలు, మెడలో లావుపాటి బంగారు గొలుసు, చిత్రమైన హెయిర్‌స్టైల్‌తో లోకల్‌ సెలెబ్రిటీగా ఉండే డాలీ.. గేట్స్‌తో ములాఖత్‌ అయ్యాక గ్లోబల్‌ తారగా మారాడు. ఇప్పుడతడిని ఇన్‌స్టాలో 35లక్షల మంది అనుసరిస్తున్నారు. నడిపేది టీకొట్టే అయినా ఖరీదైన కార్లలో తిరుగుతాడు. టీవీ యాడ్స్, సామాజిక మాధ్యమాల ద్వారా అతడికొచ్చే ఆదాయం అక్షరాలా నెలకు రూ.10లక్షలకు పైనే. 
డాలీ అసలు పేరు సునీల్‌ పాటిల్‌. చదివింది మూడో తరగతే. పెద్దన్నయ్య శైలేష్‌ చాయ్‌ కొట్టు నడిపించేవాడు. ఓసారి ఆయన అనారోగ్యం పాలవడంతో డాలీ రంగంలోకి దిగాడు. తనకి రజనీకాంత్‌ అంటే పిచ్చి. ఆయన మేనరిజమ్స్‌ని బాగా అనుకరించేవాడు. అదే అలవాటుతో పాల ప్యాకెట్‌ని స్టైల్‌గా చించడం, కెటిల్‌ నుంచి టీని గ్లాసుల్లోకి ఒడుపుగా పోయడం.. కస్టమర్లని భయపెట్టేలా, ఆశ్చర్యానికి గురి చేసేలా అందించడం.. ఇలా ప్రతి దశలో రకరకాల మేనరిజమ్స్‌ చూపించేవాడు. 2007లో ఇది మొదలైంది. ఓరోజు ఓ కస్టమర్‌ దీన్ని వీడియో తీసి అంతర్జాలంలో పెట్టాడు. అది వైరల్‌ కావడంతో గిరాకీ పోటెత్తింది. సంపాదన నెలకి రూ.లక్షపైనే ఉండేది. గత నెలలో అతడికి ఒక కాల్‌ వచ్చింది. ‘నువ్వు ఒక ఫారినర్‌కి చాయ్‌ తయారు చేసివ్వాలి. మేం దాన్ని షూట్‌ చేస్తాం’ అని’. టీకొట్టు సెటప్‌తో సహా నాగపుర్‌ నుంచి హైదరాబాద్‌కి వచ్చేశాడు. అవతలి వ్యక్తి ‘వన్‌ కప్‌ చాయ్‌ ప్లీజ్‌’ అన్నారు.

డాలీ.. ఎప్పట్లాగే అలవోకగా తేనీరు సిద్ధం చేసి ఆ అతిథికి అందించాడు. ఆఖర్లో తనతో సిగ్నేచర్‌ స్టైల్‌ పోజు పెట్టించుకున్నాడు. ఆయన మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ అనీ.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అని తనకేమాత్రం తెలియదు. ఈ షార్ట్‌ వీడియో వైరల్‌ కావడంతో డాలీ చాయ్‌వాలా రాత్రికి రాత్రే సెలెబ్రిటీగా మారిపోయాడు. తర్వాత వాణిజ్య, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల ఒప్పందాలు వరుసకట్టాయి. పలువురు బాలీవుడ్‌ తారలు, హరియాణా సీఎం, విదేశీ రాయబారులు.. ఇలా ఎందరో అతడి చాయ్‌ని ఆస్వాదించిన వాళ్లే. సృజనాత్మకత, నైపుణ్యం వీటినే నమ్ముకుంటూ అందరినీ తనవైపు తిప్పుకుంటున్న డాలీ ఆత్మవిశ్వాసానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ప్రస్తుతం తను తల్లితో కలిసి ఉంటున్నాడు. ఇప్పటికే ఎందరినో మెప్పించిన ఈ చాయ్‌వాలా.. ఎప్పటికైనా ప్రధాని మోదీకి తన టీ రుచి చూపించడమే లక్ష్యమంటున్నాడు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని