అందగత్తె ముందు.. మెదడు గోవిందా!

ఓ అందమైన అమ్మాయి కనపడగానే కుర్రాళ్ల ఒంట్లో ఏదేదో జరిగిపోవడం కామన్‌. తను ఓ ఓరచూపు విసిరిందా.. ఇక అంతే. మాటలు తడబడతాయి.

Published : 25 Mar 2023 00:09 IST

అందమైన అమ్మాయి కనపడగానే కుర్రాళ్ల ఒంట్లో ఏదేదో జరిగిపోవడం కామన్‌. తను ఓ ఓరచూపు విసిరిందా.. ఇక అంతే. మాటలు తడబడతాయి. మెలికలు తిరిగిపోతుంటారు. ఇంతేనా.. ఆ సమయంలో అసలు మగాళ్లకు కొద్దిసేపు మెదడు పని చేయడమే మానేస్తుందట. ఇదేదో మేం ఆషామాషీగా చెబుతోంది కాదండోయ్‌.. నెదర్లాండ్స్‌లోని రాడ్‌బౌండ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో తేలిన వాస్తవం ఇది. ఈ వివరాల్ని ‘ఎక్స్‌పెరిమెంటల్‌ అండ్‌ సోషల్‌ సైకాలజీ’ అనే జర్నల్‌లో ఈమధ్యే ప్రచురించారు. సూదంటు చూపుల అందగత్తె సమక్షంలో కొద్ది నిమిషాలున్నా.. ఈ పరిస్థితి ఏర్పడుతుందట. ఇదెలా తెలిసిందంటే.. పరిశోధకులు నలభై మంది మగాళ్లతో ఒక ప్రయోగం చేశారు. వీళ్లని ఏడు నిమిషాల చొప్పున సాటి మగాళ్లతో ఓసారి, అందమైన అమ్మాయిలతో మరోసారి మాట్లాడించారు. వెంటనే జ్ఞాపకశక్తి పరీక్ష నిర్వహించారు. ఆశ్చర్యంగా.. అమ్మాయిలతో మాట్లాడిన వాళ్లలో అత్యధికులు తక్కువ స్కోరు సాధించారు. ఎందుకిలా అంటే.. అతివల ఆకర్షణలో పడిపోయిన కుర్రాళ్లు ఆ సమయంలో మెదడులోని ‘కాగ్నిటివ్‌ ఫంక్షన్‌’ని తాత్కాలికంగా కోల్పోవడమేనట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని