Para Cyclist: గుండె బలంతో.. అంతర్జాతీయ పోటీకి!

చిన్నప్పుడే.. విధి నాన్నని పొట్టన పెట్టుకొంది. కారు ప్రమాదంలో కాలు పోయింది. వైకల్యం ఆత్మవిశ్వాసాన్నీ మింగేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నిలబడితేనే గొప్ప! అలాంటిది ఆ ఇక్కట్లను అధిగమించి అంతర్జాతీయ పోటీలకూ ఎంపికయ్యాడు కొమ్మోజి పవన్‌ కుమార్‌.

Updated : 01 Jun 2024 00:56 IST

చిన్నప్పుడే.. విధి నాన్నని పొట్టన పెట్టుకొంది. కారు ప్రమాదంలో కాలు పోయింది. వైకల్యం ఆత్మవిశ్వాసాన్నీ మింగేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నిలబడితేనే గొప్ప! అలాంటిది ఆ ఇక్కట్లను అధిగమించి అంతర్జాతీయ పోటీలకూ ఎంపికయ్యాడు కొమ్మోజి పవన్‌ కుమార్‌.

సాగర తీర విశాఖ నగరంలో ఉండే పవన్‌కి నేవీలో చేరాలని కల. చిన్నప్పుడే నాన్న చనిపోతే అమ్మే అన్నీ తానై పెంచిది. నావికాదళంలో పెద్ద ఉద్యోగం సంపాదించి, ఆమె కష్టం తీర్చాలనుకున్నాడు. కానీ.. 2021లో కాలేజీ నుంచి తిరిగొస్తుండగా అతడ్ని కారు ఢీకొంది. నుజ్జునుజ్జు కావడంతో కుడికాలు తీసేశారు. తల్లి, తమ్ముడి బాధ్యతలు మోయాలనుకుంటే.. తనే వాళ్లకి భారమయ్యానని కుమిలిపోయాడు. కాలు లేదని అందరూ హేళన చేస్తారని ఇంట్లోంచి బయటికి వచ్చేవాడు కాదు. ఎవరైనా ఇంటికొస్తే దాక్కునేవాడు. ఇలా బతకడం ఎలా అని ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆ సమయంలో స్నేహితులు మణికంఠ, హేమంత్‌ అతడికి ధైర్యం చెప్పే వారు. బయటకు తీసుకువెళ్లేవారు. దాంతో మెల్లమెల్లగా అతడిలో మార్పు మొదలైంది. 

సామాజిక మాధ్యమాల ద్వారా హైదరాబాద్‌లోని ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ గురించి తెలిసింది. వాళ్లని ఒప్పించి చేరాడు పవన్‌. అక్కడ తనలాంటి ఎంతోమంది ఎలాంటి బాధా లేకుండా, తమ పనులు తాము చేసుకోవడం గమనించాడు. మొదట్లో నాలుగు అడుగులు వేయడానికే ఇబ్బంది పడ్డ పవన్, వాళ్ల స్ఫూర్తితో సొంతంగా నడక ప్రారంభించాడు. ప్రతి చిన్న పనికీ మరొకరిపై ఆధారపడే తనే.. కొన్నాళ్లకే అన్ని పనులూ సొంతంగా చేసుకునే స్థాయికి చేరాడు. తర్వాత మెల్లగా ఫౌండేషన్‌ సహకారంతో క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు. అక్కడ శిక్షణ పొంది విశాఖ ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి జూనియర్‌ షాట్‌పుట్‌ పోటీల్లో స్వర్ణం నెగ్గాడు. గుజరాత్‌లో జాతీయ జూనియర్‌ షాట్‌పుట్, జావెలిన్‌త్రో పోటీల్లో ర్యాంకులు సాధించాడు. 

సైక్లింగ్‌ బాట పట్టి

ఫౌండేషన్లో చేరాక కర్నూలుకు చెందిన హర్షద్‌ షేక్‌ ఒంటికాలితో సైకిల్‌ తొక్కడాన్ని గమనించాడు పవన్‌. ఆయన ఒంటికాలితోనే భగీరథీ పర్వతం ఎక్కాడు. తనలా నేనూ ఎందుకు చేయలేననే పట్టుదల పవన్‌లో పెరిగింది. కృత్రిమ కాలుతో సైక్లింగ్‌ సాధన ప్రారంభించాడు. ‘ఇంకాస్త కష్టపడితే నువ్వు పారా సైక్లింగ్‌లోనూ రాణిస్తావు’ అని గురువు చెప్పిన మాటలు మంత్రంలా పని చేశాయి. గతేడాదంతా ప్రాక్టీస్‌ చేసి దిల్లీలో ఏషియన్‌ ట్రాక్‌ పారా సైక్లింగ్‌ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. జూన్‌ 5 నుంచి 12 వరకు కజకిస్థాన్‌లో జరగనున్న 12వ ఏషియన్‌ పారా సైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికయ్యాడు. ‘అవిటితనం వల్ల అనామకుడిలా మిగిలిపోతానని మొదట్లో చాలా బాధ పడేవాడిని. తర్వాత నాకూ అవకాశాలున్నాయని తెలిశాక అలా ఉండిపోవద్దు అనుకున్నా. ఇప్పుడు నాముందు ఉన్న లక్ష్యం ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించడం. పారా సైక్లింగ్‌లో సత్తా చాటి స్వర్ణం సాధించడం. అది తప్పకుండా నెరవేరుతుంది. నాలాంటి వాళ్లకీ ఎన్నో అవకాశాలున్నాయి. వాటిని అందిపుచ్చుకుంటే.. మనం ఎవరికీ తక్కువ కాదని నిరూపించుకోవచ్చు’ అంటున్నాడు పవన్‌ ఆత్మవిశ్వాసంతో.
వై సురేష్, ఈజేఎస్‌ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని