Mister India: కండబలంతో..మిస్టర్‌ ఇండియాగా..!

సరదాలు.. వదిలేశాడు! సినిమాలు.. చూడటం మానేశాడు! సోషల్‌ మీడియా.. అటు వెళ్లనే లేదు! స్నేహితులు.. దూరం పెట్టాడు! రోజూ ఒకే ధ్యాస.. కండలు పెంచడం. ఇరవై రెండేళ్ల కథ పవన్‌ది నాలుగేళ్లుగా ఇదే దినచర్య. మరి ఇంత కష్టపడితే ఏమయ్యాడు? ఐసీఎన్‌ పోటీల్లో ‘మిస్టర్‌ ఇండియా’గా నిలిచాడు. ఆ కండరగండడి ప్రయాణమిది.  

Updated : 01 Jun 2024 07:56 IST

సరదాలు.. వదిలేశాడు! సినిమాలు.. చూడటం మానేశాడు! సోషల్‌ మీడియా.. అటు వెళ్లనే లేదు! స్నేహితులు.. దూరం పెట్టాడు! రోజూ ఒకే ధ్యాస.. కండలు పెంచడం. ఇరవై రెండేళ్ల కథ పవన్‌ది నాలుగేళ్లుగా ఇదే దినచర్య. మరి ఇంత కష్టపడితే ఏమయ్యాడు? ఐసీఎన్‌ పోటీల్లో ‘మిస్టర్‌ ఇండియా’గా నిలిచాడు. ఆ కండరగండడి ప్రయాణమిది.  

ఒకే ధ్యాస 

బాడీ బిల్డింగ్‌ అంత తేలికేం కాదు. తీరైన రూపం రావాలంటే ఏళ్లకొద్దీ కఠోరంగా శ్రమించాల్సిందే. ఆహారం, శిక్షణ కోసం భారీగా వెచ్చించాలి. ప్రోటీన్లు, సప్లిమెంట్లు.. ఉన్న ఆహారం తీసుకోవడానికే రోజుకి రూ.వెయ్యి వరకు ఖర్చయ్యేది. పవన్‌ది మధ్యతరగతి కుటుంబం. అయినా ఇతర అవసరాలు మానుకొని మరీ.. తమ సంపాదనలో అత్యధికం అతడికే కేటాయించే వారు అమ్మానాన్నలు. స్నేహితులు సైతం సాయం చేసేవారు. అలా డిగ్రీ తొలి ఏడాదిలో మొదలు పెట్టి, న్యాయనిర్ణేతలతో ‘వావ్‌’ అనిపించే రూపం రావడానికి మూడేళ్లకుపైగా కష్టపడ్డానంటున్నాడు పవన్‌. ఉదయం, సాయంత్రం కలిపి రెండున్నర గంటలు సాధన చేసేవాడు. స్క్వాట్, బర్పీ, ప్లాంక్, బెంచ్‌ప్రెస్, ట్రెడ్‌మిల్‌ స్ప్రింట్‌లు.. వీటితోపాటు బాడీవెయిట్‌ వర్కవుట్లు, డంబెల్స్‌ ఎత్తే స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు.. ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా చేసేవాడు. కొవ్వులున్న ఆహారం, జంక్‌ఫుడ్, స్వీట్లూ వదిలేశాడు. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే డైట్‌ తీసుకునేవాడు. ఇంతేనా..! సరదాలు లేవు. థియేటర్‌ వైపు వెళ్లింది లేదు. టూర్లు, షికార్లు అన్నీ బంద్‌. క్షణం ఖాళీగా ఉన్నా జిమ్‌లో దూరిపోయేవాడు. పోటీకి మూడు నెలల ముందు కౌశిక్‌ అనే బాడీబిల్డర్‌ పరిచయం కావడం అతడికి కలిసొచ్చింది. చాలా పోటీల్లో పాల్గొన్న అతడిని గురువుగా భావించి, శిక్షణ తీసుకున్నాడు. పోటీలో నాలుగైదు స్థానాల్లో ఉన్నా చాలనుకుంటే.. ఏకంగా విజేత అయ్యాడు.

బాడీ బిల్డింగ్‌ అంటే కండల ప్రదర్శనే కాదు. ఇదొక ఫిట్‌నెస్‌ ప్రక్రియ. కండలు పెంచి, చురుగ్గా ఉంటే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. నేను కఠోరంగా శ్రమించి  సిద్ధమవుతుంటే.. ‘చదువుకునే వయసులో ఇవన్నీ అవసరమా? అంత ఖర్చు చేసి ఏం సాధిస్తావ్‌?’ అంటూ నిరుత్సాహ పరిచారు కొందరు. ఇప్పుడు వాళ్లే  మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం నా దృష్టంతా వరల్డ్‌ నేచురల్‌ బాడీబిల్డింగ్‌ ఫెడరేషన్‌ పోటీలపైనే ఉంది. దుబాయ్‌లో జరిగే ఈ పోటీలో పాల్గొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎవరైనా సహకరిస్తే వెళ్లి, తప్పకుండా పతకంతో తిరిగొస్తా.

ఐసీఎన్‌ (ఐ కంపీట్‌ నేచురల్‌).. బాడీబిల్డింగ్‌ పోటీలకు దేశవ్యాప్తంగా పేరున్న సంస్థ. తమ సత్తా ఏంటో చూపించాలనుకునే కండల వీరులు ఇక్కడ తప్పకుండా పోటీ పడుతుంటారు. ఫిట్‌నెస్‌ మోడల్, మెన్స్‌ ఫిజిక్, క్లాసిక్‌ ఫిజిక్, బాడీ బిల్డింగ్, మజిల్‌ మోడల్, స్ట్రీట్‌ మోడల్‌.. ఇలా పలు విభాగాల్లో పోటీలుంటాయి. మూడు విభాగాల్లో బరిలోకి దిగాడు. మూడింట్లోనూ నెంబర్‌వన్‌గా నిలిచి ‘మిస్టర్‌ ఇండియా’గా మెరిశాడు ఈ వైజాగ్‌ వాసి. ఈమధ్యే గోవాలో జరిగిన ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి 1,300 మంది వచ్చారు. పవన్‌తోపాటు మరో ముగ్గురు మాత్రమే  ‘ప్రొ కార్డు’ గెల్చుకొని అంతర్జాతీయ బాడీ బిల్డింగ్‌ పోటీలకు అర్హత సాధించారు. ఈ విజేతకు స్ఫూర్తి వాళ్ల నాన్నే. ఆయనా బాడీ బిల్డింగ్‌ పోటీల్లో జాతీయస్థాయి పతకాలు గెలిచారు. నాన్న చొరవతోనే పవన్‌లో కండల కలవరం మొదలైంది.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని