Published : 31 Dec 2022 01:11 IST

మననం చేద్దాం.. మనసారా

టైమ్‌ మెషీన్‌తో ప్రయాణించి గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేంగానీ.. గత అనుభవాలే పెట్టుబడిగా భవిష్యత్తుకు వారధి వేసుకోవచ్చు మనం. ఒక్కసారి మనల్ని మనం తడిమి చూసుకుంటూ.. గడిచిన ఏడాది జయాపజయాలను రివ్యూ చేసుకుంటూ ముందుకు సాగుదామిలా..

* సానుకూల ఉత్సాహంతో..: ఒక్కసారి 365 రోజుల్ని వెనక్కి తిప్పితే... అందులో కొన్నైనా మధుర జ్ఞాపకాలుంటాయి. ప్రాంగణ నియామకాల్లో కొలువు సాధించడం.. ఇష్టపడ్డ అమ్మాయి మనసు గెల్చుకోవడం.. కలల వేటలో.. సరిహద్దులు దాటి విదేశాలకు రెక్కలు చాచడం.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో తీపి గురుతు ఉండే ఉంటుంది. కానీ ప్రతి విజయం వెనకా బోలెడంత కష్టం ఉంటుంది. ఆ సక్సెస్‌ కోసం మీరు ఎలా శ్రమించారో ఒక్కసారి మననం చేసుకోండి. విజయం వెనక దాగి ఉన్న కసిని ఒడిసి పట్టండి. విజయం తాలూకు అనుభూతుల్ని ఆస్వాదిస్తూ.. దాని కోసం పడ్డ కష్టాన్ని కొత్త ఏడాదికి పెట్టుబడిగా పెట్టండి. కొత్త సంవత్సరం శుభప్రదంగా మొదలవుతుంది.

* ప్రతికూల పాఠాలతో: మెరుపులే కాదు.. 2022లో వైఫల్యాల మరకలూ మన మనసుని పీడించే ఉంటాయి. కొన్ని స్వయంకృతాపరాధాలు అయితే, మరిన్ని మన ప్రమేయం లేనివి. విజయాలు మనం జీవితంలో ముందుకెళ్లడానికి తోడ్పడితే.. అపజయాలు మనం ఎలా ఉండకూడదో గుణపాఠాలు నేర్పిస్తాయి. ‘ఛ.. నేను అలా చేయకుండా ఉండాల్సింది...’, ‘చేజేతులా తప్పుడు నిర్ణయం తీసుకున్నా’, ‘ఈ సందర్భంలో ఇలా ప్రవర్తించి ఉండాల్సింది’ ఇలా ఎన్నోసార్లు అనుకునే ఉంటాం. ఆ తప్పిదాలు మరోసారి జరగకుండా చూసుకుంటే కొత్త ఏడాది సాఫీగా మొదలైనట్టే. ఇక అడుగడుగునా మన ఎదుగుదలను అడ్డగించే చెడ్డ అలవాట్లను పాత ఏడాదిలోనే పాతరేస్తే.. విజయానికి అడుగు దగ్గరైనట్టే.


ఇలా ప్రశ్నించుకోండి…

* గడిచిన పన్నెండు నెలలు నాకు నచ్చినట్టుగానే బతికానా? ఎందుకు రాజీ పడాల్సి వచ్చింది?
* ఈ ఏడాదిలో గర్వంగా అనిపించిన క్షణం ఏంటి? అందుక్కారణాలు..
* అత్యంత సవాల్‌గా నిలిచిన సందర్భం? దాన్ని ఎదుర్కొన్న వైనం..
* మనల్ని గాయపరిచిన, బాధ పెట్టిన సందర్భాలు.. కోపం వచ్చిన క్షణాలు. మళ్లీ రాకుండా ఏం చేయాలి?
* గతేడాది పెట్టుకున్న లక్ష్యాలేంటి? ఎంతవరకు సఫలీకృతం అయ్యాం?
* ఇష్టమైన వ్యక్తులు, పెద్దవాళ్ల నుంచి పొందిన ప్రశంసలు.. కెరియర్‌లో ఎదుగుదల.
* జీవితానికి, కెరియర్‌కి పనికి వచ్చేలా చేసుకున్న మంచి అలవాట్లు, నైపుణ్యాలు, నేర్చుకున్న పాఠాలు ఏంటి?


సాగిపోవడమే..

గతేడాది నాకు చేదు, తీపిల మిశ్రమంలా ఉంది. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగానికి ఎంపికవడం మర్చిపోలేని సందర్భం. ఆప్తులు కొందరు తీవ్ర అనారోగ్యం పాలవడం బాధాకర విషయం. అయినా మన చేతుల్లో లేని దాని గురించి బాధ పడటం అనవసరం. జీవితం ఎలాంటి కష్టాలు ఇచ్చినా కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లిపోవడమే. కొత్త ఏడాదికి ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయాలేం లేవు. అన్నింటినీ ఆహ్వానిస్తూ ఆ ఫ్లోలో వెళ్లిపోవడమే. 

రిషిత, బీటెక్‌ ఫైనలియర్‌


సంతృప్తికరంగా...

ఒకరకంగా చెప్పాలంటే 2022 సంతృప్తికరంగానే గడిచింది. మనలో సానుకూల ఆలోచనలు ఉంటే.. అంతా సవ్యంగానే సాగుతుందనేది నా అభిప్రాయం. ప్రస్తుతం సీఏ చివరి మెట్టు మీదున్నా. ఫైనల్‌ గ్రూప్‌ 2 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నా. పాస్‌ అయ్యి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలనేది నా ఆశయం. కొత్త ఏడాదిలో క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌ పెంచుకోవాలని నిర్ణయించుకున్నా.

ఎస్‌.రామకృష్ణ, సీఏ ఫైనల్‌


మనసున్న వైద్యురాలిగా..

మా తాతయ్య కోరిక, స్ఫూర్తితో ఎంబీబీఎస్‌ సీటు సంపాదించాను. ఇంటర్న్‌గా బెంగళూరులో ఒక ఆసుపత్రిలో పని చేస్తున్నాను. అక్కడే సామాన్య జనం సాధకబాధకాలేంటో ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నా. మనదేశంలో క్యాన్సర్‌ బాధితులు పెరిగిపోతున్నారు. ఆంకాలజిస్టుల కొరత తీవ్రంగా ఉంది. పీజీలో ఆ స్పెషలైజేషన్‌ చేయాలనుకుంటున్నా. గతేడాది నా సుదీర్ఘ ప్రయాణంలో కొంతవరకు ముందుకెళ్లా. మంచి మనసున్న డాక్టర్‌ అని పేరు తెచ్చుకోవాలనేది నా ఆశయం.

అనుశ్రీరెడ్డి, ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని