మనసారా.. విహరిస్తారా

ప్రేమికులంటే.. ప్రేమ పక్షులే. ఊసులాడుకోవడానికి.. గుసగుసలు చెప్పుకోవడానికి.. వాళ్ల మనసులు ఏకం కావడానికి ఏకాంతం కావాలి. ఇలాంటి జంటలకు స్వాగతం పలకడానికి కొన్ని నగరాలు, ప్రాంతాలు బాగా ఫేమస్‌. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అలాంటివి కొన్ని.

Published : 11 Feb 2023 00:16 IST

ప్రేమికులంటే.. ప్రేమ పక్షులే. ఊసులాడుకోవడానికి.. గుసగుసలు చెప్పుకోవడానికి.. వాళ్ల మనసులు ఏకం కావడానికి ఏకాంతం కావాలి. ఇలాంటి జంటలకు స్వాగతం పలకడానికి కొన్ని నగరాలు, ప్రాంతాలు బాగా ఫేమస్‌. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అలాంటివి కొన్ని.

* ప్యారిస్‌ (ఫ్రాన్స్‌): ఫ్యాషన్ల రాజధాని ప్యారిస్‌ని ‘సిటీ ఆఫ్‌ లవ్‌’ అని కూడా అంటుంటారు. అక్కడ ఉండే ఈఫిల్‌ టవర్‌ సాక్షిగా మనసుపడ్డ వారికి ప్రపోజ్‌ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. దానికి తగ్గట్టే ఆ నగరం ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. సీనె నది అందాలు.. క్యాండిల్‌లైట్‌ డిన్నర్లతో వెల్‌కమ్‌ పలికే హోటళ్లు.. అడుగడుగునా అందాల ఉద్యానవనాలు ఆకట్టుకుంటూనే ఉంటాయి.
*వెనిస్‌ (ఇటలీ): ప్రపంచ ప్రేమికుల కలల ప్రదేశంలో ఈ నగరానికి తప్పకుండా చోటుంది. కాలువలే నగర వీధుల్లా ఉండే ఈ ప్రాంతంలో జంటగా పడవల్లో విహరించడం ప్రేమికులకు ఓ మధురానుభూతి. అందుకే ఏడాదికి 2 కోట్ల మంది యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. అందులో అత్యధికం పడుచు ప్రేమికులేనంటున్నారు.
* రోమ్‌ (ఇటలీ): రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలంటారు. రొమాంటిక్‌ ప్రేమికులు అనిపించుకోవాలన్నా ఈ నగరాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలనే ప్రాచుర్యం ఉంది. ఘనమైన వాస్తు సంపద.. రుచికరమైన పదార్థాలు వడ్డించే కేఫ్‌లు.. విహార ప్రదేశాలు.. కొండ ప్రాంతాలతో అలరారుతుంటుంది.
* బాలీ (ఇండోనేషియా): ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలకు నెలవైన బాలీ ప్రేమికుల్నీ ఎక్కువగా ఆకర్షిస్తోంది. సుందరమైన సముద్ర తీరాలు.. సూర్యాస్తమయాల్లో బీచ్‌లలో గుడారాల్లాంటి విడిది కేంద్రాల్లో కూర్చొని  సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు.
* బార్సిలోనా (స్పెయిన్‌): సుదీర్ఘమైన సముద్ర తీరం, ప్రేమికుల్ని ఆకర్షించే హోటళ్లు, అడుగడుగునా వినిపించే మంద్రమైన సంగీతం, కెఫేలు.. పికాసో మ్యూజియం.. ఈ నగర ప్రత్యేకతలు ఎన్నని చెప్పగలం? ప్రపంచ ప్రేమికుల ఫేవరెట్‌లలో ఇదొకటి.
* క్యోటో (జపాన్‌): సంస్కృతి, వారసత్వాల మేటి కలయిక    ఈ నగరం. ప్రేమికులకు ఈ నగరాన్ని రొమాంటిక్‌ గేట్‌ వేగా భావిస్తుంటారు. దగ్గర్లోని ఆరాషియామా వెదురు తోటలు ప్రేమికులను అత్యధికంగా ఆకట్టుకుంటున్నాయి. ఫుషిమి              ఇనారి దేవాలయాలు సైతం ప్రశాంతత కోరుకునే జంటలకు నెలవుగా మారాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు