నాన్నలా వెనకున్నాడు..

మా ఇద్దరి పరిచయానికి ఏడేళ్లు. అన్నయ్య అన్న పిలుపుతో మొదలైన బంధం ఒరేయ్‌, గిరేయ్‌ అనుకునేంత క్లోజ్‌ అయిపోయాం. అన్నంటే నాన్నలా వెంటే రక్షణగా నిలిచేవాడని తన కేరింగ్‌ని చూసి చెప్పొచ్చు. రక్తం పంచుకుని పుట్టకపోయినా

Updated : 08 Dec 2022 22:15 IST

మా ఇద్దరి పరిచయానికి ఏడేళ్లు. అన్నయ్య అన్న పిలుపుతో మొదలైన బంధం ఒరేయ్‌, గిరేయ్‌ అనుకునేంత క్లోజ్‌ అయిపోయాం. అన్నంటే నాన్నలా వెంటే రక్షణగా నిలిచేవాడని తన కేరింగ్‌ని చూసి చెప్పొచ్చు. రక్తం పంచుకుని పుట్టకపోయినా తోబుట్టువుల్లా కలిసిపోయాం. ఎంతలా అంటే.. నాకు ఇప్పటికీ గుర్తు. 2015 ఫిబ్రవరి 26, తన కాలేజీలో అడుగుపెట్టినప్పుడు, అందరూ వచ్చి నువ్వు వాత్సవ్‌ చెల్లివి కదా? అని అడిగినప్పుడు ఆ క్షణం నేను పొందిన అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేను. అప్పటి నుంచి నన్ను నా పేరుతో పిలిచే కన్నా వాత్సవ్‌ చెల్లి అని పిలవడంతో మనసులో తెలియని ఆనందం. ముఖంలో ఓ చిరునవ్వు. రెండూ నాకు చాలా ఇష్టం.  నా 20వ పుట్టినరోజుకి 20 బహుమతులు ఇచ్చాడు. ప్రతి రాఖీ పండగకి ఏం అడిగితే! చెల్లిగా నేను ఆర్డర్‌ వేయడమే ఆలస్యం. కొనిచ్చేవాడు. జీవితంలో చుట్టూ ఎంత మంది ఉన్నా తను ఎప్పుడూ స్పెషలే నాకు. కానీ, తన సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి కారణంగా నా అంతట నేనుగా తనకి దూరం అయ్యా. ఇలా అన్న నుంచి దూరంగా ఉండడం ఏ చెల్లికైనా బాధే. అందుకేనేమో బాధ కాస్తా కోపంగా మారింది. ఓ ఏడాది పాటు అన్నతో మాట్లాడలేదు. తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు... తీసుకున్న నిర్ణయాలు.. కొన్నే నాకు తెలుసు. తన కెరీర్‌ కోసం వెళ్తున్నావు అని అర్థం చేసుకోకుండా, కావాలని పరిస్థితుల నుంచి తప్పించుకుంటూ నాతో కూడా అలానే ప్రవర్తిస్తున్నాడు అనుకున్నా. తన జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ నాతోనే ఉండేవి. నేను వేసే ప్రతి అడుగులోనూ ఎప్పుడూ తన తోడుగా ఉంటానన్న మాటలు నాకు ఎప్పుడూ గుర్తొచ్చేవి. ఆ ధైర్యంతోనే ఏదో సాధించాలనే తపనతో నా ప్రయాణం ముందుకు సాగింది.
అదే ఏడాది నేను కావాలనే తనకి రాఖీ పంపలేదు. కోపంతో నా విలువ తనకి తెలియాలి అనుకున్నా. నేను గుర్తొచ్చి ఫీల్‌ అయ్యేలా చేయాలనుకున్నా. కానీ, అంతకు ముందు ఏడాది నేను కట్టిన రాఖీనే మళ్లీ కట్టుకుని ‘మా చెల్లి కట్టింది!’ అని ఫొటో పంపాడు. అది చూసిన క్షణం అన్నకీ, చెల్లికీ ఉన్న తేడా ఏంటో స్పష్టంగా అర్థమైంది. తనదెంత కల్మషం ఎరుగని మనసో మరో సారి ప్రూవ్‌ చేసుకున్నాడు అన్నయ్యా. ఎందుకు పంపలేదో కారణం చెప్పడానికి ప్రయత్నిస్తే.. ‘రాఖీ పంపితేనే చెల్లి కాదురా.. నువ్వు నా గురించి ఆలోచిస్తూనే ఉంటావని నాకు తెలుసు’ అని అన్నాడు. నేను చేసింది తప్పో.. ఒప్పో.. నాకు తెలియదుగానీ.. ఆ రోజు అనుకున్నా. మళ్లీ జీవితంలో అన్నయ్యకు నాకు మధ్య గ్యాప్‌ రాకూడదని. ఇప్పుడు నేనూ బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నా. ఇప్పుడు నాకు తెలుస్తోంది. నాలోనూ ఊహించని ఎన్నో మార్పులు.. ఉద్యోగంలో చేరాక అన్న మారిపోయాడు అనుకునే దాన్ని.. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు తెలిసింది. ఎన్ని తెలిసినా.. అన్నయ్యా..‘నేను నీకు సారి చెప్పాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే.. చెల్ల్లి అంతే. ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, వెక్కిరిస్తుంది.. అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడూ వదిలి వెళ్లిపోదు. ఎప్పటికీ రాక్షసిలా నిన్ను వేధిస్తూనే ఉంటా. ఈ జన్మకి సర్దుకుపో... వచ్చే జన్మలో తమ్ముడిగా పుడితే అప్పుడు చూద్దాం. వచ్చే రాఖీ పండుగకే కాదు ఇకపై ప్రతి సారీ నీ చేతికి నా రాఖీ ఉంటుంది. తొందరలోనే బెంగళూరు వస్తా.. రెడీగా ఉండు నా చేతి దెబ్బలు తినడానికి!!’

- ఇట్లు, నీ పొట్టి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని