అడవి తల్లికి అమ్మై!

స్నేహితులంతా కాలేజీలకు వెళ్లే సమయంలో అతను వనాల బాట పట్టాడు... అందరూ పెద్ద చదువులు చదివి జీవితంలో స్థిరపడుతుంటే ‘అడవే తనకన్నీ’ అనుకున్నాడు. చివరకు తాను అనుకున్నది సాధించాడు. ఆయన పేరు జాదవ్‌ మొలాంగ్‌ పెయాంగ్‌. తాను చేసింది ఆషామాషీ పని కాదు...

Updated : 14 Dec 2022 11:36 IST

ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా కథ ఇది..

స్నేహితులంతా కాలేజీలకు వెళ్లే సమయంలో అతను వనాల బాట పట్టాడు... అందరూ పెద్ద చదువులు చదివి జీవితంలో స్థిరపడుతుంటే ‘అడవే తనకన్నీ’ అనుకున్నాడు. చివరకు తాను అనుకున్నది సాధించాడు. ఆయన పేరు జాదవ్‌ మొలాంగ్‌ పెయాంగ్‌. తాను చేసింది ఆషామాషీ పని కాదు. అసాధారణమైంది. బ్రహ్మపుత్రా నదీ పరివాహకంలో జీవిస్తున్న అనేక జీవజాతులు అతనికెప్పుడూ రుణపడి ఉంటాయి!  అంతెందుకు.. స్వచ్ఛమైన అడవి గాలిని పీల్చుకున్న వాళ్లంతా అతనికోసారి మనసారా కృతజ్ఞతలు చెబుతారు. ఎందుకంటే ఆయన నిస్సారమైన నేలకు ఊపిరిలూదాడు.  వందలాది ఎకరాల భూమిని అడవిగా మార్చాడు... మారుస్తున్నాడు. ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా అని పిలుచుకునే పెయాంగ్‌ అడవి తల్లికి అమ్మయ్యాడు. తర్వాతి తరాలకు ఓ గట్టి సందేశమిస్తున్నాడు.
ఏనుగుల ఘీంకారాలు... పక్షుల కుహుకుహురావాలు... చిన్నాచితకా జంతునేస్తాల సందళ్లు.
రుణ్‌చాపోరీ గ్రామంలో.మనుషుల కంటే వీటిసందడే ఎక్కువేమో అన్నట్టుగా ఉండేది. అసోంలోని మజూలీ జిల్లాలో ఉంది అరుణ్చాపోరీ గ్రామం. జాదవ్‌పెయాంగ్‌ సొంత గ్రామం కూడా ఇదే. అమ్మానాన్నలకు పదమూడు మంది పిల్లల్లో అతనూ ఒకడు. కాస్తంత పాడి మాత్రమే జీవనాధారం అయిన ఆ కుటుంబం పెయాంగ్‌ని వేరే జిల్లాలో ఉన్న బంధువుల ఇంటికి పంపించేసింది. పదోతరగతి వరకూ అక్కడే చదువుకున్నాడు పెయాంగ్‌. తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోకపోవడంతో అరుణ్‌చాపోరీకి తిరిగి వచ్చిన పెయాంగ్‌కి  ఓ విషయం మరింత విషాదాన్ని మిగిల్చింది. తన స్వగ్రామానికి తిరిగి వస్తుంటే ఎన్నో పక్షులు, జంతువులు తనకి ఆప్యాయంగా స్వాగతం పలుకుతాయనుకున్నాడు. పక్షులు కాదుకదా పాములు తేళ్ల జాడ కూడా కనిపించలేదు. ఇదే విషయం ఊరిపెద్దలని అడిగితే బ్రహ్మపుత్రానదికి ఏటా వస్తున్న వరదల వల్ల ఊరు చిక్కి సగమైన క్రమంలో నదిలో కలుస్తుందని దాంతో జంతువులు, పక్షులు వలసవెళ్లిపోవడం ప్రారంభించాయని చెప్పడంతో చాలా బాధపడ్డాడు. ఊరిలో ఎక్కడా పచ్చదనం లేదు. బహుశా అందుకేనేమో ఒక్క పిట్టా పలకరించడం లేదనిపించింది పెయాంగ్‌కి. ఆ జంతువులు మాయమైనట్టు... ఆ పక్షులు అంతరించిపోయినట్టు .... మనం కూడా ఏదో ఒక రోజు భూమి నుంచి అంతరించిపోతావేమో అన్న భయం పట్టుకుంది. ఇదే విషయం ఊరివాళ్లతో చెబితే.. నవ్వి ఊరుకున్నారు. అలాగని ఉదాసీనంగా ఉండిపోలేదు. ఊరిపెద్దలు ఓ ఇరవై వెదురుమొక్కలని తెచ్చి అతని చేతిలో పెట్టి వీటిని ఓపిగ్గా పాతి అవి బతికిబట్టకడితే తర్వాత వచ్చి మాతో మాట్లాడు అన్నారు. పెయాంగ్‌ ఆ పనిని చాలా శ్రద్ధగా చేశాడు. వాటితోపాటు మరికొన్ని నాటాడు. అవి కొత్తచిగురులు తొడుగుతుంటే అప్పుడెప్పుడో వలసవెళ్లిపోయిన పక్షులు తిరిగి ఈ చెట్లపై వాలడం మొదలుపెట్టాయి. ఈ విషయం పెయాంగ్‌కే కాదు.. ఊరివాళ్లకి ఆశ్చర్యంగానే అనిపించింది. అయితే బీడువారిన భూముల్లో పచ్చని మొక్కలు మొలకెత్తించడం... వాటిని పెంచడం అంత తేలిగ్గా అయిపోలేదు. నది నుంచి మట్టికుండల్లో నీళ్లను తెచ్చి వాటికి రంధ్రాలను చేసి డ్రిప్‌ పద్ధతిలో అతి కష్టమ్మీద ఆ మొక్కలని చెట్లుగా.. ఆ చెట్లని అడవిగా మార్చాడు. ఏమైతేనేం పెయాంగ్‌లో ఆత్మవిశ్వాసం మొలకెత్తింది. పదహారేళ్ల ప్రాయంలో పచ్చదనంపై పెరిగిన ప్రేమ 30 సంవత్సరాలుగా  కొనసాగుతూనే ఉంది.

వనమాలి...

అతనితో పాటు చదువుకున్న స్నేహితులంతా ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకుని స్థిరపడుతుంటే.. పెయాంగ్‌ మాత్రం  భార్యబిడ్డలతో కలిసి ముప్పై సంవత్సరాలుగా ఆ అడవిలోనే ఉండిపోయాడు. ఆవులు, అవి ఇచ్చే పాలే అతని జీవనాధారం. కానీ ఆ రోజు తనతో చదువుకుని ఇంజినీర్లు అయిన వాళ్ల పిల్లలు మాత్రం పెయాంగ్‌ గురించి పాఠాలు చదువుకుంటున్నారు. అవును మరి అతను సాధించిన విజయం చిన్నదేం కాదు. ఒకటీ రెండూ కాదు 1400 ఎకరాల భూమిని పచ్చగా పర్యావరణానికి, జీవివైవిధ్యానికి మారుపేరుగా మార్చేశాడు. వెతికిచూద్దామన్నా కనిపించని అనేక జీవజాతులు ఇక్కడ హాయిగా, నిర్భయంగా జీవిస్తున్నాయి. ఏనుగులు, రాయల్‌బెంగాల్‌ పులులు, అరుదైన కోతులు, రాబందులు, రైనోలు  ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడం మొదలుపెట్టాయి. రావి, మద్ది, పనస, టేకు ఒక్కటేంటి ఎన్నో వేలరకాల వృక్షజాతులకు ఆ ప్రాంతం చిరునామాగా మారిపోయింది. పచ్చదనం పెరగడంతో బ్రహ్మపుత్రానది వరదల నుంచి ఊరికి ఉపశమనం దొరికింది. అయినా అతను తన ఆశయం నుంచి వెనక్కి తగ్గాలనుకోలేదు. వేల ఎకరాల నిస్సారమైన నదీ పరివాహక ప్రాంతాల భూములని పచ్చగా మార్చడమే పనిగా పెట్టుకున్నాడు. అందుకే కృతజ్ఞతగా ఆ అడవికి మొలాంగ్‌ శాంక్చురీ అనీ అతన్ని ఫారెస్ట్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా అని పిలుచుకుంటారు అసోమీవాసులు. అతని స్ఫూర్తితో ప్రభుత్వాలు అడవులని విస్తరించడం మొదలుపెట్టాయి. ఆ ప్రాజెక్టుల్లో అతను ప్రాణం పెట్టి పనిచేశాడు.  ఏడాదంతా అతని పని... విత్తనాలు, మొక్కల సేకరణే. అలా సేకరించిన వాటిని ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యలో నాటుతూ ఉంటాడు. అతని సేవలని గుర్తించిన భారతప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. చదువుకునే ప్రతి విద్యార్థి కనీసం రెండు మొక్కలు నాటాలి. దానిని కరిక్యులమ్‌లో భాగం చేయాలి. అలా కాకపోతే జీవితంలో ఫెయిల్‌ అయినట్టే అంటాడు పెయాంగ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని