సదాశయంతో..విజయ తీరాలకు!

మా అంకురానికి స్టార్టప్‌ ఇండియా పథకంలో భాగంగా కేంద్రం నుంచి మంచి సహకారం అందుతోంది. మా వెబ్‌సైట్‌లో సంప్రదిస్తే డ్రోన్ల ద్వారా అత్యంత వేగంగా ఔషధాలు చేరవేస్తాం.

Updated : 28 Jan 2023 03:16 IST

పరిశోధనలు అందరూ చేస్తారు.. దానికి సదాశయం తోడైతే ఫలితం మిన్నగా ఉంటుంది. వ్యాపారం ఉద్దేశం లాభమే.. దాంతో జనాలకు కొంచెం మేలు జరిగితేే.. పదుగురి మెప్పు పొందుతుంది. అలా పరిశోధన, వ్యాపారానికి సత్సంకల్పం జోడించి విజయం సాధించారు ముగ్గురు యువకులు. ఆ ప్రస్థానం ఈతరంలో ఈవారం.

ఊహలనే డ్రోన్లుగా మార్చి...

మా అంకురానికి స్టార్టప్‌ ఇండియా పథకంలో భాగంగా కేంద్రం నుంచి మంచి సహకారం అందుతోంది. మా వెబ్‌సైట్‌లో సంప్రదిస్తే డ్రోన్ల ద్వారా అత్యంత వేగంగా ఔషధాలు చేరవేస్తాం. కొత్త, సృజనాత్మక దారిలో వెళ్తుంటే అది అందరికీ నచ్చదు. కొందరు విమర్శిస్తారు. ఇంకొన్నిసార్లు వైఫల్యాలూ పలకరిస్తాయి. అయినా కుంగిపోవద్దు. వైఫల్యాలను సమీక్షించుకుంటూ వెళ్తే విజయం మన సొంతమవుతుంది.

‘ఉన్నత చదువు ఉంటేనే మంచి జీతం.. లక్షలు, కోట్లు పెట్టుబడి పెడితేనే సృజనాత్మక వ్యాపారం’.. ఇలాంటి అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అది తప్పని నిరూపించాడు నిజామబాద్‌ జిల్లా దబ్బు యువకుడు మన్నూరి వంశీకృష్ణ. నామమాత్రం చదువుతోనే లక్షల జీతం సంపాదించే స్థితికి ఎదిగాడు. తన ఆలోచనలు, తెలివితేటలనే పెట్టుబడిగా మలచి డ్రోన్లతో ఔషధాలు సరఫరా చేసే సృజనాత్మక అంకురసంస్థ ప్రారంభించాడు.

చిన్నప్పుడే వంశీకృష్ణ తండ్రి చనిపోయారు. ఇంటికి పెద్దదిక్కుని కోల్పోవడంతో వంశీ చదువు ఆగిపోయింది. కుటుంబ భారం మోయడానికి నెలకు రూ.500 వేతనంతో ఒక మెడికల్‌ షాప్‌లో పనికి కుదిరాడు. వినియోగదారుల్ని తన మాటతీరుతో ఆకట్టుకోవడం.. అన్నిరకాల ఔషధాలపై పట్టు సాధించడంతో దుకాణం యజమానికి నమ్మిన బంటుగా మారాడు. కొన్నేళ్లు అక్కడ పని చేశాక ఒక హోల్‌సేల్‌ వ్యాపారి ప్రోత్సాహంతో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా మారాడు. చొరవ, మాటతీరుతో అంచెలంచెలుగా ఎదిగి రీజినల్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగాడు. ఈ రంగంలో తనకి పద్దెనిమిదేళ్ల అనుభవం ఉంది. దీన్నే పెట్టుబడిగా పెట్టి ఒక సరికొత్త అంకురసంస్థ ప్రారంభించాలనుకున్నాడు. డ్రోన్లతో మందులు సరఫరా చేస్తే బాగుంటుందని భావించాడు. దీనికి ఉన్న భవిష్యత్తు గుర్తించాడు. అయితే ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. ఆలోచనను ఆచరణలో పెట్టడం తీవ్ర ఇబ్బందిగా అనిపించింది. దీంతో రూ.లక్షకు పైగా వేతనం వచ్చే ఉద్యోగం వదులుకున్నాడు.

ఆలోచన బాగానే ఉన్నా.. పెట్టుబడి సమస్యగా మారింది. తనలాంటి ఆశయం ఉన్న మధుసూదన్‌, విజయలక్ష్మి, నవీన్‌తో కలిసి ఒక జట్టుగా మారాడు. వ్యాపార ప్రణాళిక, విస్తరణపై వీళ్లు ఆర్నెల్లు అధ్యయనం చేశారు. ఒక సంస్థలో మూడు నెలలు శిక్షణ పొందారు. చివరికి గతేడాది ఫిబ్రవరిలో ‘మెడ్‌కార్ట్‌’ పేరుతో స్టార్టప్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగేయలేదు. కొన్నిసార్లు రోగికి సరైన సమయంలో ఔషధాలు అందక ప్రాణాలే కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఔషధాలను వేగంగా, సకాలంలో సరఫరా చేయడానికి డ్రోన్లను వినియోగిస్తుందీ అంకురసంస్థ. దాదాపు 25 కిలోల బరువు మోసే డ్రోన్లను వీరు తయారు చేయించారు. ఇవి ఉపగ్రహం ఆజ్ఞలతో, విమానాల రాకపోకలను నియంత్రించే ఏటీసీ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) ఆధీనంలోనే పని చేస్తాయి. భూమికి 400 అడుగుల ఎత్తులో ఎగురుతూ వేగంగా ప్రయాణిస్తాయి. క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా నిర్ణీత ప్రదేశానికి చేరతాయి. వీటిని లాంఛనంగా ప్రారంభించినప్పుడు నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌కు మందులు తీసుకెళ్లి అందించాయి. ప్రస్తుతం నిజామాబాద్‌, హైదరాబాద్‌ నగరాల్లో సేవలు అందిస్తుందీ స్టార్టప్‌.
పెంటు రమేష్‌, నిర్మల్‌ పట్టణం


‘నేచర్‌’ మెచ్చిన పరిశోధన..

అత్యాధునిక పరిజ్ఞానం, సమస్త వనరులు అందుబాటులో ఉన్నా చమురు, గ్యాస్‌ నిక్షేపాలున్న ప్రదేశాన్ని కచ్చితంగా కనుగొనడం ఇప్పటికీ కత్తిమీద సామే. దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసి బావి తవ్వితేనేగానీ అక్కడ హైడ్రోకార్బన్లు ఉన్నదీ, లేనిదీ తెలుసుకోలేం. కానీ తూర్పుగోదావరి జిల్లాకి చెందిన మిత్రద్వయం మహదాసు నాగేంద్రబాబు, అంబటి వెంకటేష్‌లు వీటి గుర్తింపులో సులువైన పద్ధతి కనుగొన్నారు. దీనిపై రాసిన పరిశోధక పత్రం ప్రఖ్యాత ‘నేచర్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. వీళ్ల పరిశోధనను ఐఐటీ మద్రాసు వెబ్‌సైట్‌లోనూ పొందుపరిచారు.

నాగేంద్రది తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు.వెంకటేశ్‌ది కాకినాడ జిల్లా ఆర్యవటం. పీహెచ్‌డీ కోసం ఇద్దరూ ఐఐటీ మద్రాసుకి చేరారు. అక్కడే ఒకరికొకరికి పరిచయం. పీహెచ్‌డీలో భాగంగా అందరికీ ఉపయోగపడే పరిశోధక అంశం ఎంచుకోవాలనుకున్నారు. లిథోఫేసిస్‌ అనాలసిస్‌లో భాగంగా ‘సిస్మిక్‌ ఇంటర్‌ప్రిటేషన్‌’పై పని చేయాలనుకున్నారు. సాధారణంగా నిక్షేపాల అన్వేషణ, వెలికితీత కోసం చమురు కంపెనీలు అందుబాటులో ఉన్న భూగర్భ సమాచారం, డేటా ఆధారంగా ప్రయత్నాలు ప్రారంభిస్తాయి. గుజరాత్‌, కేజీ బేసిన్‌, అస్సాం, తమిళ నాడులాంటి కొన్నిచోట్ల చమురు, గ్యాస్‌ నిక్షేపాలున్నట్టు గతంలోనే కనుగొన్నారు. అయితే అవి కచ్చితంగా ఏ ప్రదేశంలో ఉన్నాయో తెలియదు. అందుబాటులో ఉన్న సమాచారం, డేటా, భౌగోళిక పరిస్థితులు, సముద్ర భూగర్భంలోని స్థితిగతులు.. వీటిన్నింటిని విశ్లేషించి, ఒక్కొక్కరు ఒక్కోరకంగా అన్వయించుకుంటారు. అయితే భూగర్భంలో జరిగే కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా కొన్నిసార్లు పరిస్థితి మారిపోతుంటుంది. అప్పుడు హైడ్రోకార్బన్లు ఎక్కడ పోగుపడి ఉన్నాయో తెలుసుకోవడం కష్టం. ఇలాంటి సందర్భంలో నదీ తీరాల్లోని భూగర్భంలో ఒక బావి తవ్వడానికి రూ.80 కోట్లు, సముద్ర గర్భంలో అయితే రూ.170 కోట్లు ఖర్చు చేసినా.. ఒక్కోసారి అది నిష్ఫలమే అవుతుంది. అయితే వీళ్లు ‘పాయిజన్‌ ఇంపీడెన్స్‌’ విధానంలో పరిశోధన చేసి ఒక విధానం రూపొందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాని విశ్లేషించి ఏ ప్రాంతంలో చమురు, నీరు, షేల్‌ ఉన్నాయో చెబుతారు. ఈ పద్ధతి ఉపయోగించడం ద్వారా హైడ్రోకార్బన్లను తేలికగా గుర్తించవచ్చు అంటున్నారు. దీనికోసం అస్సాం అరకన్‌ బేసిన్‌పై పరిశోధన చేశారు. ఆయిల్‌ కంపెనీలు ఉపయోగిస్తున్న సంప్రదాయ పద్ధతులకన్నా తమ విధానం ఎలా సమర్థంగా పని చేస్తుందో పోల్చి చూపారు. ఐదేళ్లు కష్టపడి పరిశోధన పత్రం సమర్పించారు. ప్రస్తుతం నాగేంద్ర ఓఎన్‌జీసీలో ఉన్నతోద్యోగంలో చేరగా, వెంకటేష్‌ జెంబ్లేన్స్‌ అనే అంకుర సంస్థలో పని చేస్తున్నాడు.
మల్లిడి వెంకట కృష్ణారెడ్డి, బిక్కవోలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని