Civil Services: ఎస్‌.. మేం సాధించాం ఐఏఎస్‌, ఐపీఎస్‌!

అమ్మ కష్టాలు తీర్చేలా అతిపెద్ద కొలువు సాధించాలనుకున్నది ఒకరు... సివిల్స్‌ సర్వీసెస్‌తో శక్తిమంతమైన అధికారిగా మారొచ్చు అని నమ్మింది మరొకరు. లక్ష్యం వ్యక్తిగతమైనా.. అంతిమంగా సమాజంలో మార్పు తేవడమే వారి ధ్యేయం.

Updated : 27 May 2023 07:06 IST

అమ్మ కష్టాలు తీర్చేలా అతిపెద్ద కొలువు సాధించాలనుకున్నది ఒకరు... సివిల్స్‌ సర్వీసెస్‌తో శక్తిమంతమైన అధికారిగా మారొచ్చు అని నమ్మింది మరొకరు. లక్ష్యం వ్యక్తిగతమైనా.. అంతిమంగా సమాజంలో మార్పు తేవడమే వారి ధ్యేయం. ఆ దిశగానే అనుకున్నది సాధించారు. లక్షల మంది కలలు కనే మేటి సర్వీసు సాధించారు. ఆలోచన నుంచి గమ్యం చేరిన వైనం వారి మాటల్లోనే.

సివిల్స్‌ సర్వీస్‌ సాధించడం అంత తేలికైన విషయమేమీ కాదు. లక్షల మంది పోటీ పోడితే.. వేల మంది ముందుకెళ్తారు. దుర్భిణి వేసి మరీ మెరికల్లాంటి కొద్దిమందినే ఎంపిక చేస్తారు. ‘ఐఏఎస్‌’, ‘ఐపీఎస్‌’లాంటి మూడక్షరాల పదాన్ని గర్వంగా తమ పేరు పక్కన చేర్చుకునే అర్హత అతికొద్ది మందే సాధిస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక సర్వీసుల కోసం ఈసారి 11లక్షల 36వేల మంది పోటీ పడితే, కేవలం 933 మంది ఎంపికయ్యారు.

ఆ సంఘటన స్ఫూర్తితో..

విజేత: గంగవరపు వెంకట పవన్‌ దత్తా, ర్యాంకు: 22, ఊరు: తిరుపతి

వైద్యుడిగా సమాజంలో నాకంటూ మంచి గౌరవమే ఉంది. అయితే ఓ సంఘటన నన్ను సివిల్స్‌ వైపు మళ్లేలా చేసింది. మొదట్నుంచీ నేను మెరిట్‌ విద్యార్థిని. ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని పేరున్న కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఉన్నా.. తల్లిదండ్రులకు దగ్గరగా ఉండవచ్చనే ఉద్దేశంతో తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కళాశాలలో చేరి, వైద్య విద్య పూర్తి చేశాను. అక్కడి ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో పని చేస్తున్న సమయంలో.. ఒకరోజు జిల్లా కలెక్టర్‌ ఆసుపత్రి సందర్శనకు వచ్చారు. వైద్యులు, అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఆయన ఆదేశాలతో అప్పటికప్పుడే అక్కడి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇవన్నీ చూడగానే నాలో ఆలోచన మొదలైంది. వైద్యుడిగా జనాలకు సేవ చేసే అవకాశం ఉన్నా అది పరిమితం. కానీ పరిపాలనాధికారిగా విస్తృతంగా సేవ చేయొచ్చని అప్పుడర్థమైంది. నా లక్ష్యం ఏంటో బోధ పడింది.

యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో పరీక్షల తీరు, సబ్జెక్టుల వివరాలు సేకరించాను. సీనియర్ల సలహాతో ఆంత్రోపాలజీ సబ్జెక్టు ఎంచుకున్నా. ఏదైనా పరీక్షకు సిద్ధమవుతుంటే.. పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్లడం నాకలవాటు. దీనికీ అదే పాటించా. ఏం చదవాలి? ఎలా చదవాలి? ఏ సమయంలో చదవాలి? అనేవి డైరీలో రాసుకున్నా. సొంతంగా నోట్సు సిద్ధం చేసుకున్నా. అనవసర ఒత్తిడికి గురవడం నాకు నచ్చదు. ఒక్కోసారి రోజుకి 18 గంటలు చదివితే.. తర్వాత రెండు మూడు రోజులు ఖాళీగా ఉండేవాడిని. మెయిన్స్‌కి వచ్చేసరికి తీవ్రత పెంచాను. ఇంటర్వ్యూ కోసం అద్దంలో చూసుకుంటూ సాధన చేశా. హైదరాబాద్‌లో మాక్‌ ఇంటర్వ్యూల శిక్షణ తీసుకున్నా. పాడటమంటే నాకు చాలా ఇష్టం. మరీ తీరిక లేకుండా చదువుతున్నా అనిపించినప్పుడు, కాసేపు అన్నమయ్య కీర్తనలు ఆలపించేవాడిని. అన్నీ అనుకున్నట్టే జరిగి తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించా. వైద్యంపై ఇప్పటికీ నాకు మమకారమే. ఐఏఎస్‌ అధికారిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా మార్పులు తీసుకురావడానికి ముందు ప్రయత్నిస్తా.

మహంకాళి కిరణ్‌కుమార్‌, తిరుపతి


అమ్మ కోసం ఈ కానుక

విజేత: డోంగ్రీ రేవయ్య ర్యాంకు: 410 ఊరు: కుమురంభీం జిల్లా, తుంగెడ

నా నాలుగేళ్ల వయసులోనే నాన్న చనిపోయారు. గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయే పూరి గుడిసె మాది. ముగ్గురు పిల్లలతో అమ్మ రోజూ బతుకు పోరాటమే చేసేది. అడవిలో కట్టెలు కొట్టుకొచ్చి, ఇంటింటికీ తిరిగి అమ్మేది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో వంట పని చేసేది. సెలవుల్లో కూలి పనులకూ వెళ్లేది. ఆమెకు చదువు రాకపోయినా, చదివితేనే తల రాత మారుతుందని నమ్మేది. అదేమాట రోజూ మాతో చెప్పేది. మేం పాటించేవాళ్లం. 2012లో నాకు ప్రతిష్ఠాత్మక ఐఐటీలో సీటొచ్చింది. కానీ ప్రవేశ రుసుం రూ.22 వేలు చెల్లించాలి. ఏ రోజుకు ఆరోజు కడుపు నింపుకునే మా దగ్గర అంత డబ్బెక్కడిది? ఆ గడ్డు పరిస్థితిలో.. నాపై ఈనాడు ఓ కథనం రాసింది. అప్పటి కలెక్టర్‌ అశోక్‌ స్పందించి సాయం చేశారు. ఇతరులూ మరికొంత ఆర్థిక సాయం చేశారు. అప్పుడే నాకు ఒక సివిల్‌ సర్వెంట్‌కి ఉన్న పవరేంటో అర్థమైంది. ఆ సర్వీసు సాధించాలనే సంకల్పం మొదలైంది. నా అంతిమ లక్ష్యం సివిల్స్‌ అయినా.. ముందు కొంచెం ఆర్థికంగా స్థిరపడాలి అనుకున్నా. ఐఐటీ మద్రాసులో ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ‘గేట్‌’ రాశా. మంచి ర్యాంకు రావడంతో ఓఎన్‌జీసీలో రూ.22లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. ఐదేళ్లు అక్కడ చేశాక, నా కలల కొలువు కోసం సిద్ధమయ్యా. 2021లో తొలిసారి సివిల్స్‌ పరీక్షలు రాసి ఇంటర్వ్యూ వరకూ వెళ్లా. కానీ సర్వీసు రాలేదు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని సీనియర్ల సాయంతో దాన్ని అధిగమించా. హైదరాబాద్‌లోని బాలలత గారి దగ్గర కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నా. రెండోసారి గురి తప్పలేదు. నాకొచ్చిన 410 ర్యాంకుకి ఐపీఎస్‌ రావొచ్చు. ఆర్థిక చేయూత లేక చాలామంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నారు. నా పరిధిలో అలాంటి వారికి ముందుగా సాయం చేయాలనుకుంటున్నా. 

చొక్కాల రమేశ్‌, ఆసిఫాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని