aman sehrawa: అనాథే.. అంతర్జాతీయ పతకధారి!
చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోయారు... తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. బక్కపల్చని దేహం.. భారమైన బతుకు... ఇలాంటి దుస్థితిలోనూ కుస్తీ మే సవాల్ అన్నాడు.
చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోయారు... తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. బక్కపల్చని దేహం.. భారమైన బతుకు... ఇలాంటి దుస్థితిలోనూ కుస్తీ మే సవాల్ అన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నాడు. అతగాడే హరియాణా కుర్రాడు అమన్ సెహ్రావత్.
ఆసియా ఛాంపియన్‌షిప్ ఫైనల్. విజేత ఎవరో తేలడానికి ఇంకో 39 సెకన్లు. అప్పటికే చిరుతలా పోరాడుతున్నాడు అమన్. ప్రత్యర్థి విసిరిన ఓ ముష్టిఘాతానికి కనుబొమ్మ చిట్లిపోయి రక్తం కారుతోంది. పరుగున వచ్చి చికిత్స చేయసాగింది వైద్యబృందం. వాళ్లని పట్టించుకుంటేగా! మళ్లీ ‘స్టార్ట్’ అనగానే ఒక్క ఉదుటున లేచాడు. గెలిచి తీరాలనే కసితో రింగులోకి దూకాడు. ప్రత్యర్థి అల్మాజ్ స్మాన్‌బెకోవ్‌ని క్షణాల్లోనే మట్టి కరిపించాడు.
పోటీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా.. కడదాకా పోరాడటం అమన్ పద్ధతి. ఆటలోనే కాదు.. తనని చిన్నచూపు చూసిన విధితోనూ చిన్నప్పట్నుంచీ పోరాడుతూనే ఉన్నాడు. ఝజ్జర్ జిల్లాలోని బిరోహర్ అనే పల్లెటూరు తనది. వ్యవసాయ కుటుంబం. చదువు పెద్దగా అబ్బకపోవడంతో.. బంధువుల సలహాతో అమన్‌ని ‘అఖాడా’లో చేర్పించారు కన్నవాళ్లు. సూర్యోదయానికి ముందే మేల్కొవడం, తాడు పట్టుకుని ఎగబాకడం, బురదలో కుస్తీ పట్టడం.. ఇలాంటివన్నీ చేస్తుంటారక్కడ. ఈ శిక్షణ కొనసాగుతున్న ఏడాదిలోనే అమ్మానాన్నలిద్దరూ ఒకరి తర్వాత మరొకరు చనిపోయారు. అప్పుడు తాతయ్యే ఏకైక దిక్కుగా మారారు. ఆ సమయంలో శిక్షణ ముందుకు సాగడమూ కష్టంగా ఉండేది. అయినా గెలవాలనే ఉడుంపట్టు వదల్లేదు అమన్. కుస్తీలో గెలిస్తేనే తనకి బతుకు అని తెలుసు. కఠోరంగా సాధన చేసేవాడు. మొదట్లో అమన్‌కి కుస్తీకి కావాల్సినంత శక్తి ఉండేది కాదు. కానీ సహజసిద్ధమైన చురుకుదనం ఉండేది. దాన్ని ఆటకు అనుగుణంగా మలిచేలా తీర్చిదిద్దారు కోచ్ లలిత్‌కుమార్.
కష్టాలతోనే సావాసం చేసిన అమన్ 2018లో మొదటిసారి విజయాల రుచి చూశాడు. జూనియర్ విభాగంలో ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో ఖాతా తెరిచాడు. అక్కడినుంచి వెనుదిరిగి చూసుకోలేదు. అదే సంవత్సరం ఆసియా టైటిల్ సొంతం చేసుకున్నాడు. 2021లో జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. 2022లో అండర్ 23 ప్రపంచ టైటిల్స్‌లో కాంస్య పతకం కొల్లగొట్టాడు. ఇటీవలే జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం అందుకుని అతిపెద్ద విజయం సాధించాడు. పందొమ్మిదేళ్ల వయసులో అండర్ 23 విభాగంలో ప్రపంచ స్థాయిలో ఆడి గెలవడం మాటలు కాదు. కానీ అమన్ దాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. తొలి ప్రదర్శనలోనే ఆసియా ఛాంపియన్‌షిప్ గెలిచిన పిన్న వయసు భారతీయ రెజ్లర్‌గా ఘనత సాధించాడు. నెత్తురు కారుతున్నా లెక్క చేయకుండా మెడలోని బంగారు పతకాన్ని ముద్దాడుతున్న ఈ కుస్తీ వీరుడిని చూస్తున్నపుడు.. ‘రెజ్లింగ్ నుంచి ఒలింపిక్ పతకం గెలిచే మరో యోధుడు దూసుకొస్తున్నాడ’ంటూ క్రీడాభిమానులు ప్రశంసించారు.
సుంకి శ్రావణి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kiran Abbavaram: మాటిస్తున్నా.. మీరు గర్వపడేలా చేస్తా: కిరణ్ అబ్బవరం
-
world culture festival : మానవాళిని ఏకం చేయడంలో ఇదో విభిన్న కార్యక్రమం : రామ్‌నాథ్ కోవింద్
-
ఈ గేదె.. 3 రాష్ట్రాల్లో అందాల ముద్దుగుమ్మ!
-
ప్రపంచంలోనే అతిపెద్ద గోళాకార ఎల్ఈడీ స్క్రీన్.. నిర్మాణ ఖర్చెంతో తెలుసా?
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World Culture Festival: రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగిన ప్రపంచ సాంస్కృతిక సంరంభం..