కార్మికుడే..కండల వీరుడు

పగడాల సంతోష్‌ కుమార్‌... తను పనిలోకి దిగినప్పుడు వీధులన్నీ తళతళలాడతాయి. బాడీబిల్డింగ్‌లో పాల్గొంటే.. పతకాలు వెంట నడిచి వస్తాయి... పారిశుద్ధ్య కార్మికుడిగా ఉంటూనే.. జాతీయ స్థాయి పోటీలలో నెగ్గిన ఘనత అతడి సొంతం.

Updated : 04 Mar 2023 03:46 IST

పగడాల సంతోష్‌ కుమార్‌... తను పనిలోకి దిగినప్పుడు వీధులన్నీ తళతళలాడతాయి. బాడీబిల్డింగ్‌లో పాల్గొంటే.. పతకాలు వెంట నడిచి వస్తాయి... పారిశుద్ధ్య కార్మికుడిగా ఉంటూనే.. జాతీయ స్థాయి పోటీలలో నెగ్గిన ఘనత అతడి సొంతం. సైనికుడిగానూ సత్తా చూపించాడు. ప్రస్తుతం ఔత్సాహికులకు శిక్షణనిస్తూ వస్తాదుల్లా తయారు చేస్తున్నాడు ఈ పార్వతీపురం మట్టిలో మాణిక్యం.

* ఆసక్తి: సంతోష్‌ అన్నయ్యలు రోజూ జిమ్‌లో కసరత్తులు చేసేవాళ్లు. వాళ్లలాగే తనూ కండలు పెంచాలని బరువులెత్తేవాడు. చదువుపై దృష్టి పెట్టమంటూ వాళ్లు తిట్టేవాళ్లు. అయినా చాటుగా సాధన చేసేవాడు. రానురాను అది ఎంత ఇష్టంగా మారిందంటే.. 2005 నాటికి బాడీబిల్డింగ్‌ని కెరియర్‌గా ఎంచుకున్నాడు.

* కార్మికుడిగా: బాడీబిల్డింగ్‌ అంటే మాటలు కాదు. మంచి పోషకాహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా సాధన చేయాలి. దీనికి చాలా ఖర్చవుతుంది. సంతోష్‌ అమ్మానాన్నలేమో పారిశుద్ధ్య కార్మికులు. వాళ్లకి భరించే శక్తి లేదు. దీంతో సంతోష్‌ కూడా కార్మికుడిగా మారాడు. 2003 నుంచి 2010 వరకు పార్వతీపురం పట్టణ పరిధిలో వీధులు శుభ్రం చేశాడు.

* సైనికుడిగా: పతకాల మోత మోగిస్తున్న సంతోష్‌కి స్పోర్ట్స్‌ కోటా కింద 2015లో సైనికుడిగా ఉద్యోగం వచ్చింది. అక్కడా రెండుసార్లు ఆర్మీ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించాడు. ఆర్మీలో పనిచేస్తూ మిస్టర్‌ ఇండియా అయిన మొదటి వ్యక్తి తనే. అప్పుడే మిస్టర్‌ ఆసియన్‌ పోటీల నుంచి పిలుపొచ్చింది. ఆర్థిక పరిస్థితులు సహకరించక వెళ్లలేకపోయాడు. తర్వాత మళ్లీ ఆ అవకాశం రాలేదు. సైన్యంలో ఆంక్షల నేపథ్యంలో.. తను కలలు కనే మిస్టర్‌ ఒలింపియా పోటీలకు వెళ్లలేనని భావించి ఉద్యోగం మానేశాడు.

* శిక్షకుడిగా: వృత్తి, ప్రవృత్తికి సరిగ్గా సరిపోయేలా ప్రస్తుతం జిమ్‌ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు సంతోష్‌. ఫిట్‌నెస్‌, బాడీబిల్డింగ్‌పై ఉత్సాహంగా ఉండే యువతకు ఉచితంగానే సలహాలిస్తున్నాడు. ఎలాంటి ఆహారం, సప్లిమెంట్స్‌ తీసుకోవాలో సూచిస్తున్నాడు.  ఈ రెండేళ్లలో తన దగ్గర శిక్షణ పొందిన దాదాపు 40 మంది విద్యార్థులు జిల్లా,రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొన్నారు. కొందరు పతకాలు సాధించారు.


ఎస్‌.శివవరప్రసాద్‌,ఈనాడు పాత్రికేయ పాఠశాల

* విజేతగా: తను కొలువులో చేరాక ఆర్థికంగా పరిస్థితి ఓ కొలిక్కి వచ్చింది. దీంతో ఏమాత్రం సమయం దొరికినా సాధనపై మనసు పెట్టేవాడు. క్రమంతప్పకుండా బాడీబిల్డింగ్‌ పోటీల్లో పాల్గొనేవాడు. అలా పాల్గొంటూనే..

* రాష్ట్రస్థాయిలో 29 సార్లు మొదటిస్థానంలో నిలిచాడు.15 సార్లు రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌ సాధించాడు.

* 2011లో పుణెలో జరిగిన మిస్టర్‌ సౌత్‌ ఇండియా  పోటీలో రజతం.

* 2012 జూనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం. 2013 సీనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో మూడోస్థానం.

* 2018లో పుణెలో నిర్వహించిన మిస్టర్‌ ఇండియా పోటీల్లో జాతీయ ఛాంపియన్‌పిష్‌తో బంగారు పతకం.

* గత ఏప్రిల్‌లో మిస్టర్‌ ఇండియా పోటీలో మూడో స్థానం, మిస్టర్‌ యూనివర్స్‌లో పదోస్థానం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు