బుల్లెట్టు బండిపై.. బీటెక్‌ పానీపూరీవాలీ

ఇంజినీరింగ్‌ చదివింది. బిందాస్‌గా ఏ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమో.. సర్కారీ కొలువో చూసుకోకుండా పానీపూరీ బండి పెట్టేసింది తాప్సీ ఉపాధ్యాయ.

Published : 25 Mar 2023 00:09 IST

ఇంజినీరింగ్‌ చదివింది. బిందాస్‌గా ఏ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమో.. సర్కారీ కొలువో చూసుకోకుండా పానీపూరీ బండి పెట్టేసింది తాప్సీ ఉపాధ్యాయ. అదీ బుల్లెట్టు బండెక్కి దిల్లీ వీధుల్లో తిరుగుతూ తన గోల్‌గప్పా రుచులు చూపిస్తోంది. సాధించాలనే గోల్‌ ఉండాలేగానీ సంపాదించడానికి బోలెడు మార్గాలు అంటున్న తను ఇప్పుడు అంతర్జాలం తాజా సంచలం. అసలే అందమైన అమ్మాయి.. బుల్లెట్టు బండెక్కి పానీపూరీ అమ్ముతుంటే ఆ మాత్రం ఉండదా మరి?

పానీపూరీ చూడగానే సహజంగానే అమ్మాయిలకు నోట్లో నీళ్లూరిపోతుంటాయి. తాప్సీ సైతం గతంలో ఇలాగే లొట్టలేసుకుంటూ తినేది. పెరిగి పెద్దవుతున్నకొద్దీ దీన్నే వ్యాపారంగా ఎందుకు మలుచుకోకూడదు అనే ఆలోచన వచ్చేది. డిగ్రీ పూర్తవగానే ఈ మాట కన్నవాళ్లతో చెప్పింది. ‘హాయిగా ఏసీలో కూర్చొని ఉద్యోగం చేసుకోక ఈ రోడ్డుమీదకొచ్చి రిస్క్‌ తీసుకునే ఫుడ్‌కోర్టు గోలేంట’ని చెడామడా తిట్టారు. అప్పటికే ఓ ప్లాన్‌తో సిద్ధమైన తాప్సీ తన పట్టు వదల్లేదు. ఎలాగోలా కష్టపడి వాళ్లని ఒప్పించింది.

రోడ్‌ సైడ్‌ పానీపూరీలు ఎవరైనా అమ్ముతారు. వాళ్లందరికంటే భిన్నంగా ఉండటమే నా ప్రత్యేకత అంటోంది తాప్సీ. ముఖ్యంగా తన పానీపూరీ బండిలో అమ్మే స్నాక్స్‌లో శుభ్రత పాటిస్తుంది. హైజీనిక్‌గా ఉండేలా చూసుకుంటుంది. పానీపూరీతోపాటు దహీ బటాటా పూరీ, ఆలూ టిక్కీ, పాలక్‌ కీ చాట్‌, దహీ గుజియా, పాప్డీ చాట్‌, రాజ్‌ కచోరీ, భేల్‌పూరీలాంటి ఎన్నో వెరైటీలు అందుబాటులో ఉంచుతుంది. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా తెప్పించిన పింక్‌ హిమాలయన్‌ ఉప్పునే వాడుతున్నానంటోంది. అలా తనకంటూ ఓ ప్రత్యేకతతో దిల్లీ వీధులన్నీ తిరుగుతూ ఇప్పుడు బాగా ఫేమస్‌ అయిపోయిందిగానీ, ఈ స్థాయికి చేరడానికి తాప్సీ ఐదారు నెలలు చాలానే కష్టపడింది. ‘బీటెక్‌ చదివి పానీపూరీ బండి పెట్టడమేంటి? ఏదో ప్రచారం కోసం తప్ప దీంతో బాగు పడేదేమైనా ఉంటుందా?’ అని మొదట్లో చాలామంది నిష్ఠూరమాడారు. ‘చక్కగా చదువుకున్నావ్‌. ఉద్యోగం చేసుకోక పైసాపైసా కూడబెట్టి కోట్లు సంపాదిస్తావా?’ అని వెనక్కి లాగారు. ఇలాంటి మాటలతో ఆత్మస్థైర్యం కోల్పోలేదు. తన వ్యాపార అనుభవాలు, పానీపూరీ తయారీ విధానం పంచుకుంటూ కొన్నాళ్లకి మంచి ఫుడ్‌ బ్లాగర్‌గానూ పేరు సంపాదించుకుంది. గతంలో ఎంబీఏ చాయ్‌వాలా, బీటెక్‌ చాయ్‌వాలీలాంటి వాళ్లు ఓ వెలుగు వెలిగి కనుమరుగైపోయారు. తను అలాంటి రకం కాదంటోంది తాప్సీ. ఆమె పేరునే ఓ బ్రాండ్‌గా మార్చి ఫ్రాంచైజీలు ప్రారంభిస్తోంది. ఈ వ్యాపారాన్ని దేశమంతా విస్తరిస్తానంటోంది. ‘ఈ కాలం అమ్మాయిలకు ఏ రంగంలో అయినా దూసుకెళ్లే సత్తా ఉంది. ఆ ఆలోచన ఉన్నవాళ్లని తమ కాళ్లపై తాము నిలబడి ఎవరికీ తీసిపోం అని నిరూపించాలన్నదే నా లక్ష్యం’ అంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని