Published : 14 Jan 2023 00:28 IST

క్రేజీ కపుల్‌...ముచ్చటైన ట్రావెల్‌!

చదువుల్లో ప్రతిభ కనబరిచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు కొట్టేశారు...అభిరుచులు కలవడంతో జీవితంలోనూ ఒక్కటైయ్యారు...ఆట విడుపుగా చేసిన టూర్లను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ మేటి ట్రావెలర్లుగా మారారు... ఆ జంటే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన సౌరభ్‌, మేఘలు.

పర్యాటకులకు మార్గనిర్దేశకులుగా మారిన ఈ ఇద్దరూ ఒకప్పుడు క్లాస్‌మేట్స్‌. ఆ సమయంలోనే వీళ్ల మధ్య స్నేహం మొదలైంది. ఆపై ప్రాంగణ నియామకాల్లో వేర్వేరు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగాలు సంపాదించారు. కొన్నాళ్లకు ఓ ప్రాజెక్టులో భాగంగా ఇద్దరూ కలిసి శిక్షణ కోసం పుణె వెళ్లారు. అప్పుడే ఫ్రెండ్షిప్‌ మరింత బలపడింది. తర్వాత మేఘకు విదేశాల్లో ఉద్యోగం రావడంతో యూరప్‌ వెళ్లింది. కొద్దిరోజులకే సౌరభ్‌ సైతం ఆఫర్‌ లెటర్‌తో అక్కడికే బయల్దేరాడు. ఇద్దరూ కెరియర్‌లో స్థిరపడ్డారు. పైగా ఆలోచనలు, ఆసక్తులు ఒకేలా ఉండటంతో మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. కొత్త జీవితం బాగానే ఉన్నా.. రొటీన్‌ జాబ్‌ బోర్‌ కొట్టేసింది. దాంతో వారాంతాల్లో సరదాగా ప్రయాణాలు మెుదలు పెట్టారు. పర్యాటకానికి యూరప్‌ దేశాలన్నీ పెట్టింది పేరు కావడంతో భుజాన బ్యాగ్‌లు వేసుకొని ఒక్కో దేశాన్నీ చుట్టి రావడం మొదలు పెట్టిందీ యువ జంట.

వీరిద్దరూ వెళ్లొచ్చిన పర్యాటక ప్రదేశాల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయసాగారు. అవి చూసిన మిత్రులు, నెటిజన్లు ‘యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించండి’ అని సలహా ఇచ్చారు. వీళ్లకీ ఆసక్తి ఉండడంతో DESI COUPLE ON THE GO అనే ఛానల్‌ ప్రారంభించారు. అందులో అందమైన పర్యటక ప్రదేశాల గురించి నెటిజన్లకు చెప్పసాగారు. అక్కడి అందమైన ప్రకృతి సోయగాలను వర్ణిస్తూ వీళ్లు తీసే వీడియోలకు ఎంతోమంది మంత్ర ముగ్దులయ్యారు. వీక్షకుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో.. తక్కువ బడ్జెట్‌లో మంచి టూర్‌ ప్లాన్‌లను యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా తెలియజేయడం ప్రారంభించారు. ఎలాంటి ప్రదేశాలకు వెళ్లాలి? ఎక్కడ వసతి పొందాలి? లాంటి అంశాలతో దేశీయ పర్యాటకులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. వీళ్లు యూరప్‌తోపాటు అమెరికా, జపాన్‌, చైనాలు సైతం పర్యటించి వీడియోలు చేశారు. ఫిన్లాండ్‌ వెళ్లినప్పుడు అక్కడ చెక్క ఇళ్లలో బస చేస్తూ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. కొవిడ్‌కి ముందు ఇండియా మొత్తం చుట్టేశారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తునే.. ట్రావెల్‌ యూట్యూబర్లుగా పేరొందిన ఈ క్రేజీ కపుల్‌ తమ వీడియోల ద్వారా నలుగురికీ ఉపయోగపడే సమాచారం అందిస్తే చాలంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని