Padakandla Srinivas: వ్యర్థాలకో అర్థం..మోదీ మెచ్చిన వైనం

మూలన పడ్డ కారు.. ముచ్చటైన ప్రతిమగా మారుతుంది! పనికి రాని ప్లాస్టిక్‌ సైతం అచ్చెరువొందే శిల్పం అవుతుంది. ఇలాంటివి వందలకొద్దీ కళాఖండాలు సృష్టించారు పడకండ్ల శ్రీనివాస్‌.

Published : 29 Apr 2023 00:07 IST

వాహనాల తుక్కే... అతడి చేతిలో  పడితే మాత్రం అందమైన రూపం సంతరించుకుంటుంది! మూలన పడ్డ కారు.. ముచ్చటైన ప్రతిమగా మారుతుంది! పనికి రాని ప్లాస్టిక్‌ సైతం అచ్చెరువొందే శిల్పం అవుతుంది. ఇలాంటివి వందలకొద్దీ కళాఖండాలు సృష్టించారు పడకండ్ల శ్రీనివాస్‌. ఈ సృజనాత్మక ప్రతిభతో ప్రధాని మోదీనే మెప్పించారు. ‘మన్‌ కీ బాత్‌’లో అనుభవాలు పంచుకోవడానికి స్వయంగా ఆహ్వానం అందుకున్నారు. ‘నా ప్రయత్నమంతా పర్యావరణ హితానికే’ అంటున్న ఆ యువ ప్రొఫెసర్‌తో మాట కలిపింది ‘ఈతరం’.

ప్రధాని మోదీ తన 75వ ‘మన్‌ కీ బాత్‌’లో శ్రీనివాస్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మనమంతా విజయవాడ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌లా వినూత్నంగా ఆలోచించాలి. ఎలక్ట్రానిక్‌, ఆటోమొబైల్‌ వ్యర్థాలకు తన నైపుణ్యాన్ని, కళాత్మకతను జోడించి.. చూడముచ్చటైన ప్రతిమలుగా మలుస్తున్న కళాకారుడాయన’ అని మెచ్చుకోవడంతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించారు.

ఫైన్‌ఆర్ట్స్‌తో మొదలు

శ్రీనివాస్‌ది ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు. ముందు నుంచీ ప్రతిదీ సృజనాత్మకంగా ఆలోచించేవారు. పెద్దయ్యాక ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్‌    ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ), బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ (ఎంఎఫ్‌ఏ) పూర్తిచేశారు. తనకున్న ఆసక్తి, ప్రతిభతో ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయాలని నిత్యం తపించేవారు. ఈ క్రమంలోనే ప్లాస్టిక్‌, ఆటోమొబైల్‌ వ్యర్థాలతో ఆకట్టుకునే ప్రతిమలు చేయాలనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే.. దేశంలో ఏ మూలకు వెళ్లినా ఈ వ్యర్థాలు తేలికగా దొరుకుతాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, లారీల.. తుక్కు     అన్ని ప్రాంతాల్లోనూ కుప్పలుగా పేరుకుపోయి ఉంటుంది. వీటితో అర్థవంతమైన ఆవిష్కరణ చేయడం అంటే.. తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకోవడం, పర్యావరణహితం కూడా.

దేశవ్యాప్తంగా ముద్ర

2016లో విజయవాడలో ఓ వర్క్‌షాప్‌ ప్రారంభించారు శ్రీనివాస్‌. నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన మెటల్‌ వ్యర్థాలను సేకరించారు. దీనికి కార్పొరేషన్‌ సహకారంతో కష్టపడి శిల్పాలు తయారు చేశారు. వాటితో బస్టాండ్‌ సమీపంలో స్క్రాప్‌ పార్కు ఏర్పాటు చేశారు. ఎందుకూ పనికిరావు అనుకున్న సామగ్రితో తీరైన ఆకృతులు తయారవడం జనాన్ని ఆకర్షించింది.  దాంతో సహజంగానే శ్రీనివాస్‌ పేరు మార్మోగిపోయింది. ‘మాకూ అలాంటి స్క్రాప్‌ పార్కులు ఏర్పాటు చేయ’మంటూ దేశంలోని ఇతర నగర పాలక సంస్థల నుంచి పిలుపు అందింది. వారి ఆహ్వానాన్ని అందుకున్న శ్రీనివాస్‌ స్థానిక ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా స్క్రాప్‌ కళాఖండాలు సృష్టిస్తున్నారు. చెన్నైలోని పార్కులో జల్లికట్టును ప్రతిబింబించేలా ఫైటర్‌ బుల్‌తోపాటు 15 శిల్పాలు రూపొందించారు. మధురై, తిరునల్వేలిలలో ప్రత్యేక పార్కులు తయారయ్యాయి. తూత్తుకుడి తీర ప్రాంతంలో సముద్ర జంతువుల రూపాలతో ఓ పార్కును తీర్చిదిద్దాడు. గుంటూరు, కర్నూలు, అనంతపురం నగరపాలక సంస్థల్లోనూ శ్రీనివాస్‌ ప్రతిభ కనిపిస్తుంది. తాజాగా నాగార్జున విశ్వవిద్యాలయంలో 18 అడుగుల ఎత్తులో బ్రూస్‌లీ శిల్పం మలిచారు. తెలంగాణలో మిషన్‌ భగీరథ నమూనా శిల్పాలు తయారు చేసే పనిలో ఉన్నారు. మొత్తమ్మీద అతడు వ్యర్థాలతో 160కి పైగా అర్థవంతమైన ప్రతిమలు తయారు చేశారు.

ఎన్ని రకాలో..

శ్రీనివాస్‌ రూపొందించిన ఈ స్క్రాప్‌ ప్రతిమల్లో నాలుగు అడుగుల నుంచి నలభై అడుగుల వరకు ఉన్నాయి. ఆటోమొబైల్‌ వ్యర్థాలు పెద్ద పరిమాణంలో ఉండటంతో ఎంత పెద్ద శిల్పమైన తయారు చేయడం తేలికంటారు. ‘విగ్రహంలోని తల, చేతులు, మొండెం, కాళ్ల ఆకారాల కోసం వాహనాల్లోని ఏ విడిభాగాలను ఉపయోగించారని సందర్శకులు ఆసక్తిగా గమనిస్తుంటారు. దాని రూపాన్ని బట్టి ఒక్కో పార్ట్‌ని వాడుతుంటాను’ అంటున్నారు. ఎక్కడికెళ్లినా ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు ప్రతిబింబించేలా అతని శిల్పాలు ఉంటాయి. డైనోసార్‌, జిరాఫీ, జింక, గద్ద, ఎలుగుబంటి, రోబో.. ఇలా రకరకాల రూపాలను తీర్చిదిద్దారు. ‘ప్లాస్టిక్‌, ఆటోమొబైల్‌ వ్యర్థాలు కేజీల చొప్పున దొరుకుతుండటంతో వీటిని మలచడానికి పెద్దగా ఖర్చవదు. మొదట్లో రకరకాల మెటీరియల్‌తో తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ఫైబర్‌తో ఆరోగ్యానికి ప్రమాదకరం. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ ఎక్కువ కాలం మన్నికగా ఉండదు. బ్రాంజ్‌తో చేస్తే ఖర్చు భారీగా పెరుగుతుంది. అందుకే.. చివరికి ఆటోమొబైల్‌ వ్యర్థాలను ఎంచుకున్నా’ అంటున్నారు శ్రీనివాస్‌.

ప్రధాని మోదీ తన ‘మన్‌ కీ బాత్‌’లో ప్రతిభావంతులు, సమాజ సేవకుల గురించి ప్రస్తావించడం సాధారణమే అయినా ఓ కళాకారుడి గురించి మాట్లాడటం ఇదే తొలిసారి. అలా ప్రశంసించడమే కాదు.. వందో ‘మన్‌ కీ బాత్‌’లో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపిక చేశారు. దీనిలో భాగంగా ఈనెల 26 నుంచి 28 వరకూ దిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు శ్రీనివాస్‌. విమాన టికెట్లు సహా అన్ని ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే భరించింది.

మరిశర్ల జగదీష్‌కుమార్‌, విజయవాడ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని