Viswanath - Raviteja: సమాజహితమే.. వ్యాపార సూత్రం!

సరికొత్త ఆలోచనలతో.. సాధించాలనే కసితో.. యువత అంకుర సంస్థలు ప్రారంభించడం కామనే! కాలం కలిసొస్తే.. కొందరు కోట్లు కూడా కూడబెడతారు

Updated : 20 May 2023 07:01 IST

సరికొత్త ఆలోచనలతో.. సాధించాలనే కసితో.. యువత అంకుర సంస్థలు ప్రారంభించడం కామనే! కాలం కలిసొస్తే.. కొందరు కోట్లు కూడా కూడబెడతారు. ఇంకొందరు మాత్రం భిన్నం. ఎంత సంపాదించామన్నది కాదు.. జనానికి ఎంత ఉపయోగపడుతున్నాం అనే ఆలోచిస్తారు. స్టార్టప్‌ ప్రారంభించడం కాదు.. సృజనాత్మక దారిలో ముందుకెళ్లాలనుకుంటారు.ఈ ఇద్దరు యువకులు అదే రకం.


చిన్ననాటి అనుభవాలే.. పాఠాలై..

చిన్నప్పుడు విశ్వనాథ్‌ కారి పరిస్థితి దారుణంగా ఉండేది. పని కోసం నాన్న 20 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లొచ్చేవారు. తనేమో బడికెళ్లడానికి 4 కిలోమీటర్ల దూరం నడిచేవాడు. కొన్నాళ్లయ్యాక పరిస్థితులు కుదుటపడి, మోటార్‌ సైకిల్‌ కొన్నా.. నిర్వహణకూ ఇబ్బందే ఉండేది. అప్పుడే ఆ కుర్రాడు విద్యుత్తు వాహనాల గురించి ఆలోచించాడు. పెరిగి పెద్దయ్యాక ‘రాయల్‌ ఈవీ’ ప్రారంభించాడు. ఈ సంస్థ తయారు చేస్తున్న ఈవీలు ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో అమ్ముడవుతున్నాయి.

విశ్వనాథ్‌ విశాఖపట్నం వాసి. ఇంటింటికీ తిరిగి పేపర్లు వేస్తూ, చిన్నచిన్న పనులు చేస్తూ చదువుకున్నాడు. డిగ్రీ పూర్తవగానే ఓ ఉద్యోగం దొరికింది. కష్టపడే మనస్తత్వం కావడంతో కొద్దిరోజులకే మేనేజర్‌ స్థాయికి వెళ్లాడు. ఆర్థికంగా కొంచెం కుదురుకున్నాక తన చిన్ననాటి లక్ష్యం గుర్తొచ్చింది. అమెరికాలో ఉన్న  మిత్రుడి సాయంతో 2016 నుంచి సౌర శక్తి, విద్యుత్తు వాహనాల గురించి వివరాలు సేకరించసాగాడు. ఈ రంగంలో ఉన్న అవకాశాలు, భారతీయ వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా పరిశోధనలు చేశాడు. మూడేళ్ల అనుభవంతో ‘రాయల్‌ ఈవీ’ అనే అంకుర సంస్థ ప్రారంభించాడు. మొదటి ఏడాది ప్రయోగాత్మకంగా ఏపీకే పరిమితమయ్యాడు. ‘విద్యుత్తు వాహనాల్లో ఉపయోగించే లిథియం అయాన్‌ బ్యాటరీలకు త్వరగా వేడెక్కి, కొన్నిసార్లు పేలిపోయే గుణముంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మేం లిథియం ఫెర్రో ఫాస్పరేట్‌ (ఎల్‌ఎఫ్‌పీ) సాంకేతికతను ఉపయోగిస్తాం’ అంటున్నాడు విశ్వనాథ్‌.
విద్యుత్తు వాహనాల మరమ్మతులు సాధారణంగా కష్టం. దీనికి పరిష్కారంగా స్మార్ట్‌ యాక్టివ్‌ బ్యాటరీని తయారు చేసిందీ సంస్థ. దీంతో వినియోగదారుడు తన మొబైల్‌ యాప్‌ ద్వారానే బ్యాటరీ పనితీరు, సమస్యలు తెలుసుకోవచ్చు. సొంతంగా రిపేర్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం బ్యాటరీ సమస్యల్ని తేలికగా పరిష్కరించే వర్చువల్‌ టెక్నాలజీ మీద పని చేస్తున్నామంటున్నాడు విశ్వనాథ్‌. ‘మేం ఈవీ బ్లేజ్‌, వైల్డర్‌, గ్లాడియేటర్‌ ప్రో, చోటూ అనే మోడళ్లను వందశాతం దేశీయంగా తయారు చేస్తున్నాం. చోటూ ధరని తక్కువగా రూ.35వేలు నిర్ణయించాం. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 70-80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పెట్రోల్‌ బైక్‌లతో పోలిస్తే నిర్వహణ వ్యయం చాలా తక్కువ’ అంటున్నాడు.    
చిన్నప్పుడు మొదలైన ఆలోచన ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారంగా మారడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు విశ్వనాథ్‌. పెట్టుబడి కోసం ఎన్నో బ్యాంకుల చుట్టూ తిరిగాడు. మంచి టెక్నాలజీ ఇవ్వడానికి తన బృందంతో కలిసి అహరహం శ్రమించాడు. ‘మామూలు వాహనాలతో పోలిస్తే విద్యుత్తు వాహనాలతో పది రెట్లు కాలుష్యం తక్కువ. ప్రత్యక్షంగా, పరోక్షంగా మేం 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. తెలుగు రాష్ట్రాలతోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో మా ఈవీలు రోడ్లపై తిరుగుతున్నాయి. మొత్తం ఐదువేలకు పైగా అమ్మాం’ అంటూ వ్యాపారం వెనక ఉన్న పర్యావరణ, సమాజహితాన్నీ వివరిస్తున్నాడు విశ్వనాథ్‌.


గర్భిణులకు వరం.. ఐమమ్జ్‌

మన దేశంలో మూడు కోట్ల మంది గర్భిణులకు లక్ష మంది వైద్యులే న్నారు. ఒక గర్భిణికి వైద్యుడితో మాట్లాడేందుకు, తన బాధలు చెప్పుకునేందుకు ఐదు నిమిషాలకి మించి సమయం దొరకట్లేదు. దాంతో వాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇది బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా ‘ఐమమ్జ్‌’ యాప్‌ ప్రారంభించాడు అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన ఆకొండి రవితేజ. వైద్య నిపుణులు నిరంతరం సలహాలు ఇచ్చేలా దీన్ని తీర్చిదిద్దాడు. ఈ యాప్‌ను ఇప్పటికే ఐదులక్షలకు పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

రవితేజ వారణాసి ఐఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, ఆరేళ్లు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థలో మెడిటేటర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో ఒక స్నేహితురాలు ‘మా అబ్బాయి అల్లరి తక్కువగా చేస్తాడు. ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. నడక, మాటలు త్వరగా వచ్చాయి’ అని చెబుతుంటే ఆశ్చర్యపోయాడు. అందుక్కారణం గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా యోగా చేయడమే అన్నారామె. యోగా చేస్తే గర్భంలోని బిడ్డపై సానుకూల ప్రభావం ఉంటుందా అని స్నేహితుడు మయూర్‌తో కలసి పరిశోధనలు చేశాడు. వందలమంది వైద్య నిపుణులను కలిశాడు. వెయ్యికిపైగా పరిశోధన పత్రాలు, పుస్తకాలు చదివాడు. యోగాతో కచ్చితంగా సానుకూల ఫలితాలు ఉంటాయని తెలుసుకున్నాడు. అది మహిళలకు చెప్పేలా ఓ యాప్‌ అందుబాటులోకి తీసుకురావాలనుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకునే సమయానికి రవితేజ లక్షల జీతం అందుకుంటున్నాడు. దాన్ని వదులుకొని ఇటువైపు రావడం కన్నవాళ్లకు నచ్చలేదు. అయినా అతడి నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. దాంతో 2020 నవంబరులో యాప్‌ అందుబాటులోకి వచ్చింది.

ఈ యాప్‌ గర్భిణి, వైద్యుల మధ్య వారధిగా పని చేస్తుంది. యాప్‌ తరఫున 75మంది ఆయుర్వేద వైద్యులు, పోషకాహార నిపుణులు, యోగా శిక్షకులు నిరంతరం పని చేస్తుంటారు. వాళ్లకి ఆహార ప్రణాళిక అందజేస్తారు. వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేస్తారు. గర్భిణులు, బాలింతలను గైడ్‌ చేస్తారు. వ్యాయామాలు చేయిస్తారు. ప్రసవానికి మానసికంగా సన్నద్ధం చేస్తారు. తొమ్మిది నెలలపాటు వాళ్లకు తోడుగా ఉండి, ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టేలా ‘గర్భ సంస్కారం’ చేస్తారు. ప్రస్తుతం ‘ఐమమ్జ్‌’ను 5 లక్షలకు మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకన్నారు. దిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణే, హైదరాబాద్‌, కోల్‌కతా, అహ్మదాబాద్‌, విశాఖ, విజయవాడ తదితర నగరాలతోపాటు 44 దేశాల్లో ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఇటీవల అంకురసంస్థల పెట్టుబడుల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘షార్క్‌ ట్యాంక్‌’ పోటీలో పాల్గొన్నాడు రవితేజ. అక్కడి న్యాయనిర్ణేతలు దీన్ని దేశంలోనే రెండో అత్యుత్తమ యాప్‌గా గుర్తించారు. ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు.
కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, విశాఖపట్నం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని