Rollerskating Championship: స్కేటింగ్‌.. కింగ్‌

బుడిబుడి ప్రాయంలో కాళ్లకు చక్రాలు కట్టుకున్నాడు... కింద పడి, దెబ్బలు తగిలించుకుంటున్నావని కన్నవాళ్లు మొత్తుకుంటున్నా పట్టు వీడలేదు... రోజుకి ఇరవై కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లి సాధన చేశాడు.

Published : 06 Jul 2024 00:18 IST

బుడిబుడి ప్రాయంలో కాళ్లకు చక్రాలు కట్టుకున్నాడు... కింద పడి, దెబ్బలు తగిలించుకుంటున్నావని కన్నవాళ్లు మొత్తుకుంటున్నా పట్టు వీడలేదు... రోజుకి ఇరవై కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లి సాధన చేశాడు... మెరుగైన ఆట కోసం ఊరే మారాడు... పిన్న వయసులోనే జాతీయస్థాయి పతకం సాధించి, అంతర్జాతీయ వేదికపైనా సత్తా చాటుతున్నాడు... తాజాగా న్యూజిలాండ్‌లో రోలర్‌స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు... ఆ కుర్రాడే పడిగ తేజేష్‌. తన విజయ ప్రస్థానం ఇది.

కాళ్లకు చక్రాలు కట్టుకొని అలా జరజరా జారిపోతుంటే చూడముచ్చటగానే ఉంటుంది. కానీ రోలర్‌ స్కేటింగ్‌ అంటే మాటలు కాదు. అలా విన్యాసాలు చేయాలంటే ఎంతో నైపుణ్యం, శిక్షణ అవసరం. కిందపడితే గాయాలు తప్పవు. ఫిట్‌నెస్‌ తప్పకుండా ఉండాలి. నాజూకు శరీరాకృతిని కొనసాగించాలి. అందుకే రోలర్‌ స్కేటింగ్‌లో ప్రావీణ్యం ఉన్నవారు వేళ్ల మీద లెక్కించగలిగేంత మందే. అలా చెప్పుకోతగ్గ రోలర్‌స్కేటర్‌గా ఎదుగుతున్నాడు తేజేష్‌.

తనది విజయవాడలోని అరండల్‌పేట. చిన్నప్పుడు చాలా చురుగ్గా ఉంటూ తెగ అల్లరి చేసేవాడు. తనకు మూడేళ్ల వయస్సులో.. తండ్రి ఒకసారి వేసవి క్రీడా శిబిరానికి తీసుకెళ్లారు. అక్కడ బుల్లి పాదాలకు స్కేటింగ్‌ చక్రాలు కట్టుకొని పరుగులు తీయాలని ప్రయత్నించాడు. అతడి ఆసక్తి గమనించి ఓ శిక్షణసంస్థలో చేర్పించారు నాన్న. కానీ కాళ్లకు చక్రాలు కట్టుకుని, నియంత్రించుకోలేక చాలాసార్లు కింద పడి పోయే వాడు. అతడికయ్యే గాయాలు చూడలేక ‘ఇది మనకు వద్దు నాన్నా’ అని అమ్మానాన్న బుజ్జగించారు. అయినా పట్టు వదిలేవాడు కాదు. సాధనతో క్రమంగా రాటుదేరాడు. ఉదయం, సాయంత్రం ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలోని డీఆర్‌ఆర్‌ ఇండోర్‌ స్టేడియానికి సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లి, కోచ్‌ దుర్గాప్రసాద్‌ దగ్గర శిష్యరికం చేసేవాడు. ఏడెనిమిదేళ్లకే పోటీలకు వెళ్లడం ప్రారంభించి, 11 ఏళ్లకే.. జాతీయ స్థాయిలో పతకం సాధించాడు. ఆపై ఇక వెనుదిరిగిచూసుకోలేదు. రాష్ట్ర, జాతీయ పోటీలకు వెళ్తే.. ఏదో ఒక పతకంతో తిరిగొచ్చేవాడు. అయితే ఆటలో మునిగిపోయినా ఏనాడూ చదువును  నిర్లక్ష్యం చేయలేదు. ఏ రోజులో ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా స్కేటింగ్‌ ప్రాక్టీస్, చదువుకే కేటాయించేవాడు. అలా పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. 

ఊరు వదిలి..

ఆటలు, చదువు.. రెండూ బాగుండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాల ఇంటర్‌లో ఉచితంగా సీటు ఇచ్చింది. అదయ్యాక రోలర్‌స్కేటింగ్‌లో అంతర్జాతీయ పోటీలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌పై దృష్టి పెట్టాడు. దానిలో భాగంగా అర్జున అవార్డు గ్రహీత అనూప్‌ కుమార్‌ యామ దగ్గర శిక్షణలో చేరాడు. ఉదయం, సాయంత్రాలు రెండేసి గంటలు తర్ఫీదు పొందుతున్నాడు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటివరకు ఏకంగా 79 పతకాలు గెలిచాడు. 2023 సెప్టెంబరులో సాధన చేస్తుండగా కాలు మడత పడి పెద్ద గాయమైంది. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అదే సమయంలో తను ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఆస్ట్రేలియాలో జరిగాయి. అందులో పాల్గొనలేకపోయానని చాలా బాధ పడ్డాడు. కఠోర సాధనతో.. త్వరగానే గాయం నుంచి కోలుకున్నాడు. గత నెలలో న్యూజిలాండ్‌లో ‘ప్రపంచ స్కేట్‌ అండ్‌ ఓషియానియా పసిఫిక్‌ ఆర్టిస్టిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌’లో మూడు పతకాలు కైవసం చేసుకున్నాడు. దీంతో సెప్టెంబర్‌లో ఇటలీలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించాడు.

టి.చిరంజీవి, అమరావతి

కన్నవాళ్ల త్యాగం

తేజేష్‌ ఈ స్థాయికి చేరడంలో అతడి ప్రతిభ, కష్టంతోపాటు కన్న వాళ్ల త్యాగమూ ఉంది. వాళ్లది మధ్యతరగతి. తండ్రి బాల సుబ్రమణ్యం విజయవాడలో మెడికల్‌ షాపు నిర్వహించేవారు. కుమారుడికి ఇంటర్‌లో ఉచిత సీటు రావడం, మెరుగైన శిక్షణ, అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉండాలనుకోవడంతో.. కొడుకు కోసం ఆ అమ్మానాన్నలు ఊరు మారారు. హైదరాబాద్‌లోనే మెడికల్‌ షాపు నిర్వహిస్తూ తేజేష్‌కి అన్నిరకాలుగా అండగా ఉంటున్నారు. 

స్కేటింగ్‌లో ఆర్టిస్టిక్‌ రోలర్, ఇన్‌లైన్‌ స్కేటింగ్, సోలో డ్యాన్స్, కపుల్‌ డ్యాన్స్, ఫ్రీ స్కేటింగ్‌.. ఇలా విభాగాలుంటాయి. అందులో నాకు ఫ్రీ స్కేటింగ్‌ అంటే చాలా ఇష్టం. వీటిలోనే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 32 బంగారు, 28 రజతం, 19 కాంస్య పతకాలు సాధించా. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్నది నా కల. తర్వాత ప్రతిభ ఉన్న ఎంతో మందిని స్కేటింగ్‌లో తీర్చిదిద్దాలనుకుంటున్నా.

ఇవీ ఘనతలు..

  •  2024 - న్యూజిలాండ్‌లో ఓషియానియా ఛాంపియన్‌షిప్‌లో ఇన్‌లైన్, సోలో డ్యాన్స్, ఫ్రీ స్కేటింగ్‌ విభాగాల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు.
  •  2023 - చైనాలో ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌ రజతం.
  •  61వ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ (చెన్నై)లో ఒక బంగారు, నాలుగు వెండి, రెండు కాంస్య పతకాలు.
  •  2022 - బెంగళూరులో జరిగిన జాతీయ పోటీల్లో రెండు విభాగాల్లో ప్రథమ, రెండు విభాగాల్లో ద్వితీయ స్థానం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని