నీ స్టేటస్‌ ఏంటమ్మా?

డబ్బున్నోడు.. లేనోడు.. మంచి హోదా ఉన్నోడు.. అసలేమీ లేనోడు.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో స్టేటస్‌. నిజ జీవితంలోనే కాదు.. యువతకి సామాజిక మాధ్యమాల్లోనూ ఓ స్టేటస్‌ ఉంటుంది.

Published : 04 Feb 2023 00:39 IST

డబ్బున్నోడు.. లేనోడు.. మంచి హోదా ఉన్నోడు.. అసలేమీ లేనోడు.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో స్టేటస్‌. నిజ జీవితంలోనే కాదు.. యువతకి సామాజిక మాధ్యమాల్లోనూ ఓ స్టేటస్‌ ఉంటుంది. అది వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. వాళ్లు పెట్టే స్టేటస్‌లు, రాసే పోస్టులు, పంచుకునే ఫొటోల ఆధారంగానే కుర్రకారు స్టేటస్‌, వ్యక్తిత్వాన్ని కొన్నిరకాలుగా వర్గీకరించారు.  

* సామాజిక మాధ్యమ ఆటగాళ్లు

వీళ్లు పోస్టు పెట్టినా, ఫొటో పంచుకున్నా.. అన్నీ పక్కా పర్‌ఫెక్ట్‌గా ఉండాల్సిందే. ఆచితూచి స్టేటస్‌ పెడతారు. ఎవరూ వేలెత్తి చూపించకుండా జాగ్రత్త పడతారు. పొద్దంతా సామాజిక మాధ్యమాల్లోనే గడపకుండా దీనికోసం ప్రత్యేకంగా ఓ సమయమంటూ కేటాయిస్తారు. ప్రొఫైల్‌ ఫొటోలు సైతం పద్ధతిగానే ఉంటాయి.

* మార్పునకు వ్యతిరేఖులు

సామాజిక మాధ్యమాలను వాడుతున్నామా అంటే వాడుతున్నాం అంతవరకే. అవసరం ఉంటే తప్ప ఆన్‌లైన్‌కి రారు. కొత్త ఫీచర్లు అసలే పట్టించుకోరు. ఒక్కసారి ప్రొఫైల్‌ పిక్‌, డీపీ, స్టేటస్‌ పెట్టారా.. ఇక అంతే. మళ్లీ మార్చడమంటూ ఉండదు.

* సామాజిక మాధ్యమ పరోపకారి

ప్రతి పోస్టూ, స్టేటస్‌ పరులకు ఉపయోగపడాలనే తలంపే. అవసరాలు, ప్రమాదాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనే సందేశాలు, అత్యవసరంగా రక్తం అవసరమైతే స్పందించడం, ఉద్యోగ ఖాళీల వివరాలు చెప్పడం.. అన్యాయాల్ని ఎండగట్టడం.. ఇలాంటివే ఉంటాయి. ప్రొఫైల్‌ ఫొటోలు ఎక్కువగా పెంపుడు జంతువులవి ఉంటాయి.

* సామాజిక మాధ్యమ సర్వాంతర్యామి

రోజుకో స్టేటస్‌ మార్చేయడం.. పూటకో పోస్టు పెట్టడం.. గంటకో ఫొటో షేర్‌ చేయడం.. వీళ్ల లక్షణం. పనికొచ్చేవి, రానివి.. ఏదైనా  ఆన్‌లైన్‌లో కుమ్మరిస్తూనే ఉంటారు. అదేసమయంలో బాగా రాయగలరు. ఇతరులను ప్రభావితం చేయనూ గలరు. ఫార్మల్‌, ఇన్‌ఫార్మల్‌.. ఆధునికం, సంప్రదాయం.. అన్ని రకాల ప్రొఫైల్‌ ఫొటోలు పెడుతుంటారు.

* సామాజిక మాధ్యమ వాస్తవికవాదులు

వీళ్లు రాంగోపాల్‌వర్మలా పక్కా ప్రాక్టికల్‌ టైపు. ఎవరేమనుకున్నా పట్టించుకోరు. నిర్మొహమాటంగా తాము అనుకున్న స్టేటస్‌, పోస్టులు పెట్టేస్తుంటారు. విభేదించిన వారితో వాదనకూ దిగుతారు. ఏదైనా పోస్ట్‌ పెట్టేముందే దానివల్ల కలిగే లాభనష్టాలు బేరీజు వేసి ఫలితాలకు సిద్ధంగా ఉంటారు.

* సామాజిక మాధ్యమ సన్నిహితులు

స్నేహితులు, సన్నిహితుల కోసమే సామాజిక మాధ్యమాల్లోకి వచ్చే టైపు. వాళ్లకి నచ్చేలా, మెప్పించేలా సోషల్‌ మీడియాని ఉపయోగిస్తుంటారు. ఇబ్బంది పెట్టే, ఇబ్బందుల్లో చిక్కుకునే పోస్టులు, స్టేటస్‌లకు దూరంగా ఉంటారు.

* సామాజిక మాధ్యమ గూఢచారి

అవతలి వాళ్ల విషయాలు తెలుసుకోవడానికే గ్రూపులోకి వస్తారు. స్టేటస్‌లు పెడతారు. ఇతరుల పోస్టులను పోస్ట్‌మార్టమ్‌ చేస్తారు. ఆచితూచి వ్యవహరిస్తూ, అత్యవసరం అయినప్పుడే రంగంలోకి దిగుతారు. వీళ్ల ప్రొఫైల్‌ ఫొటోల్లో ఎక్కువగా ప్రకృతి దృశ్యాలుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని