Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు

ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు నేడు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో కోడ్‌ ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం మోహన్‌ బాబు న్యాయస్థానం ఎదుట

Updated : 28 Jun 2022 12:48 IST

తిరుపతి: ప్రముఖ నటుడు మంచు మోహన్‌ బాబు(Mohan babu) నేడు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో కోడ్‌ ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం మోహన్‌ బాబు న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఆయనతో పాటు కుమారులు మంచు విష్ణు, మనోజ్‌ కూడా కోర్టుకు వచ్చారు.

2019 మార్చి 22వ తేదీన అప్పటి ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించలేదని మోహన్‌ బాబు కుటుంబం తిరుపతి - మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. అయితే అప్పటికే సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో కోడ్‌ ఉల్లంఘన కింద మోహన్‌ బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌, శ్రీ విద్యానికేతన్‌ విద్యా సంస్థల ఏవో తులసి నాయుడు, పీఆర్వో సతీష్‌పై కేసు నమోదైంది. రోడ్డుపైకి వచ్చిన వాహనదారులకు ఇబ్బంది కలిగించారని, ధర్నాకు పోలీసుల అనుమతి తీసుకోలేదని వీరిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసు విచారణలో భాగంగానే నేడు వీరు కోర్టుకు హాజరయ్యారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి కోర్టు ప్రాంగణం వరకు వీరంతా పాదయాత్రగా కోర్టుకు హాజరయ్యారు. దీంతో అభిమానులు, విద్యార్థులు పెద్ద ఎత్తున రావడంతో కోర్టు ప్రాంగణం కిక్కిరిసింది. మోహన్‌ బాబుకు సంఘీభావంగా భాజపా నేత కోలా ఆనంద్‌, వైసీపీ నేతలు కూడా వచ్చారు. కాగా.. ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబరు 30వ తేదీకి వాయిదా వేసింది.

ఈ సందర్భంగా మోహన్‌బాబు(Mohan babu) విలేకరులతో మాట్లాడుతూ.. ‘పిలిచారు.. పేపర్‌ ఇచ్చారు.. సంతకం పెట్టమన్నారు.. వాయిదా వేశారు.. బయటకు వచ్చేశాను. నేను ఏది మాట్లాడినా తప్పు అవుతుంది. అసలు నాకు సమన్లు అందలేదు. న్యాయాధిపతి రమ్మని పిలిచారు. ఆయన సమక్షంలో సమన్లపై సంతకం పెట్టాను. ఇంతకుమించి ఏమీ మాట్లాడలేను’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని