Amalapuram: పోలీసు వలయంలో అమలాపురం.. డీఐజీ, నలుగురు ఎస్పీలు అక్కడే..

కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రశాంత వాతావరణం దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలంటూ మంగళవారం జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated : 25 May 2022 12:24 IST

అమలాపురం: కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రశాంత వాతావరణం దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలంటూ మంగళవారం జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల నుంచి అదనపు బలగాలను కూడా రప్పించి అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు.

అమలాపురం వైపు వచ్చే అన్ని బస్సు సర్వీసులను రద్దుచేశారు. దీంతో బస్టాండ్‌ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. సెల్‌ఫోన్‌ సిగ్నళ్లను ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు. అమలాపురం పట్టణంలోకి ఆందోళనకారులు వచ్చే అవకాశమున్న మార్గాల్లో భారీగా పోలీసులను మోహరించారు. సాయంత్రం రావులపాలెంలో ప్రదర్శన నిర్వహిస్తారన్న సమాచారంతో అప్రమత్తమై ప్రత్యేక బలగాలను అక్కడికి పంపారు.

అమల్లో 144 సెక్షన్‌..

అమలాపురంలో పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు, ఎస్పీలు రవీంద్రబాబు (కాకినాడ), ఐశ్వర్య రస్తోగి (తూర్పుగోదావరి), సిద్దార్థ కుషాల్‌ (ఎన్టీఆర్‌ జిల్లా), విశాల్‌ గున్ని (గుంటూరు) అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. కోనసీమ వ్యాప్తంగా సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 అమలు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేవని తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని