AP CM Jagan : కొవిడ్‌ సంక్షోభాన్ని ఏపీ సమర్థంగా ఎదుర్కొంది : జగన్‌

కొవిడ్‌ సంక్షోభాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో

Updated : 23 May 2022 13:57 IST

దావోస్ : కొవిడ్‌ సంక్షోభాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో వైద్యారోగ్య వ్యవస్థలపై నిర్వహించిన సమావేశానికి ఏపీ సీఎం జగన్‌ హాజరై ప్రసంగించారు.

‘రాష్ట్ర విభజన తర్వాత మాకు అత్యున్నత, ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. భారత్‌లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఉన్నటువంటి ఆస్పత్రులు మావద్ద లేవు. అయినప్పటికీ వాలంటీర్లు , గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కోవిడ్ సంక్షోభాన్నిఎదుర్కోవటంలో ఏపీ ముందుంది. ప్రాథమిక స్థాయిలో వైద్యారోగ్యం అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో 44 సార్లు మేము ఇంటింటికీ వైద్యారోగ్య సర్వే చేపట్టాం. ఆ సమయంలో ఏపీ మరణాల రేటు 0.63 శాతం మాత్రమే ఉంది. దేశంతో పోలిస్తే ఏపీ మరణాల రేటు అతి తక్కువ’

‘ప్రభుత్వాలు ప్రివెంటివ్ కేర్, క్యూరేటివ్ కేర్ పై దృష్టి పెట్టాలి. వైద్యారోగ్యం ఎంతమందికి అందుబాటులో ఉందన్న విషయాలపై ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలి. ఏపీలో గ్రామ, మండల స్థాయిలో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. 104 వాహనాలతో పాటు, విలేజ్ క్లీనిక్స్‌లో ఉండే వైద్యులు గ్రామానికి కుటుంబ వైద్యులుగా వ్యవహరిస్తారు’

‘వైద్యారోగ్య సేవలు అందించేందుకు నిధుల కొరత ఉన్నమాట వాస్తవమే. రూ.16 వేల కోట్లను వైద్యారోగ్య సేవలు మెరుగుపరిచేందుకు ఖర్చు చేయాలని నిర్ణయించాం. ప్రస్తుతం 11 మెడికల్ కళాశాలలు ఉన్నాయి. కొత్త వైద్యులను తయారు చేసేందుకు వీలుగా మరో 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం. బోధనాసుపత్రులు పెంచటం ద్వారా వైద్యుల కొరత తీర్చాలనేది మా లక్ష్యం. కచ్చితంగా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. వైద్యారోగ్య సేవలకు బీమా తప్పనిసరిగా ఉండాలి. భారత్‌లో ప్రధాని మోదీ ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమం చేపట్టారు. అయితే.. ఇది 1000 చికిత్సలనే ఉచితంగా అందిస్తోంది. పేదలు వైద్యం చేయించుకునేందుకు ఇది ఏమాత్రం సరిపోదు. ఏపీలో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా అమలు చేస్తున్నాం. దీని ద్వారా 2,446 వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నాం ’ అని జగన్ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని